పావనములు హరిభక్తి వి
భావనములు సర్వమంత్రపరమరహస్యో
ద్బావనములు గాయకనిక
రావనములు తాళ్ళపాకన్నయపదముల్ 3
రంజనములు దుర్గుణగణ
భంజనములు విమల కమల భవజనక గుణా
సంజనములు సుజ్ఞాన ధ
నాంజనములు తాళ్ళపాకన్నయపదముల్ 4
సారంబులు హరికరుణా
సారంబులు విబుధనికర సంపూర్ణసుధా
హారంబులు బహుదేశ వి
హారంబులు తాళ్ళపాక యన్నయపదముల్ 5
వేదంబులు పౌరాణిక
వాదంబులు వరకవిత్వవాణీ వీణా
నాదంబులు కృతసుజనా
హ్లాదంబులు తాళ్ళపాక యన్నయపదముల్ 6
లక్షణములు పదకవితా
రక్షణములు వివిధ కుకవిరాజీ మదస
మ్మోక్షణములు వేంకటపతి
వీక్షణములు తాళ్ళపాక విభుసత్కవితల్ 7
విన్నంతఁ బాపసంఘము
లన్నియు నడపంగఁ బూఁటయగుఁదాళులపా
కన్నయ పదములు వాడిన
యన్నయకోవిదుల వేంకటాధిపుఁడాలున్ 8
సంకీర్ణ వివిధ పాప వి
శంకట చిత్తులకునైన సర్వేశ్వరుపై
సంకీర్తనములు పాడిన
శంకాతంకములు వదలు శమనుని వలనన్ 9
మదిఁదాళ్ళపాక యన్నయ
పదములపై భక్తిగలిగి పాడిన విభవా
స్పదములగు వివిధ సంపత్
ప్రదములు శ్రీవేంకటేశుపదములు దెలియున్ 10
నక్తంచరారి తనకును
భక్తుండైనట్టి తాళ్ళపాకన్నయ చా
టూక్తి పదబంధ కవితా
రక్తుండై యితర వాగ్విరక్తుండయ్యెన్ 11
శ్రుతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై
యతిలోకాగమవీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై
కృతులై వేంకటశైల వల్లభ రతిక్రీడారహస్యంబులై
తులై తాళుల పాకయన్నయ వచోనూత్నక్రియల్ చెన్నగున్ 12