|
|
|
శ్రీ వేంకటగిరిదేవా! నా దేహంబు నీవుండెడి నిత్య నివాసంబు; నాజ్ఞానవిజ్ఞానంబులు నీయుభయపార్శ్వంబుల దీపంబులు నాముకుఁజెఱమలయూర్పులు నీయిరుదెసలం బట్టెడి యాలవట్టంబులు; నామనోరాగంబు నీకుం జెంద్రకావి వలువ;నీకు మ్రొక్క నెత్తిన చేతులు రెండును మకర తోరణంబులు; నాభక్తియెనీకు సింహాసనంబు; నా మేనం బొడమిన పులుకలు నీకు గుదులు గ్రుచ్చి యర్పించిన పూదండలు; నేనిన్ను నుతియించిన నుతుల యక్షర రవంబులు, నీకు భేరీభాంకార ఘంటికానినాదంబులు; నాపుణ్య పరిపాకంబులు నీకు నైవేద్య తాంబూలాదులు; మదీయ నిత్య సేవా సమయ నిరీక్షణంబులు నీసర్వాంగంబుల నలందిన తట్టుపునుంగు; నా సాత్విక గుణంబు నీకు ధూప పరిమళంబు నీవు దేవదేవుండవు నేనర్చకుండను; ఈ రీతి నిత్యోత్సవంబు నాయందు నవధరింపవే శ్రీ వేంకటేశ్వరా! మఱియును;
నందకాయుధధరా! నీ యాయుధంబులకు జయ జయ; నీ వాహనంబులకు శుభమస్తు; నీ పరివారంబులకు క్షేమంబు గోరెద; నీ కళ్యాణ గుణంబులకు నిరంతరాభివృధ్ధియగుఁగాక; నీ సత్వంబులకు శోభన పరంపరావాప్తి యొసగవలయు; నీ దేవులకు మంగళ మహాశ్రీలగు; నీమహిమకు ననంత వివిధార్చనము; నీ భుజబలమునకు నపరిమిత స్తోత్రము; నీ చక్కఁదనమునకుఁ బుష్పాంజలి; నీ యుదారతకు శరణంబు; నీ శ్రీవత్స కౌస్తుభాదిచిహ్నంబులకు సతతప్రార్ధన; నీ పాదంబులకు సాష్టాంగ నమస్కారంబు చేసెద; ఏనిమిత్తంబు చేసెదనంటివా ? నాలుగు యుగంబుల ధర్మంబులు, సకల జంతువుల పరిణామంబులు, కమలాసనాది దేవతల బ్రతుకులు, నీమూలంబునఁ గావున నీవు శుభంబున నుండుటే మేలు; శ్రీ వేంకటేశ్వరా !
అలమేలుమంగాపతీ! నిన్ను వెదకి వెదకి కనియెదమన నే మెంతవారము? నీ సుద్దులు పెద్దల నడిగియడిగి వైకుంఠనివాసుండ వనఁగా నీ యూరెఱింగితిమి; విష్ణు వాసుదేవ నారాయణ నామంబులు విని నీ పేరెఱింగితిమి; శరణాగత రక్షకత్వము నీకుఁగలదనఁగా నీగుణం బెఱింగితిమి. శ్రీవత్స కౌస్తుభాది చిహ్నంబులుచూచి నీగురు తెఱింగితిమి; నీలమేఘశ్యామ లక్షణంబులు గలుగంగా నీవర్ణం బెఱింగితిమి; శేషాచలనివాసంబుకతన నీగోత్రం బెఱింగితిమి; పురుషోత్తమ ఖ్యాతిచేత నీ పౌరుషం బెఱింగితిమి; వేణునాదవినోదివని చెప్పంగా నీ వశం బెఱింగితిమి; మత్స్యకూర్మ వరాహ నారసింహ వామనాద్యావతారంబులు విని నీ పుట్టువెఱింగితిమి; నీకు మ్రొక్కెదము అన్నింట నధికుండవని నిన్నుం గొలిచితిమి; యింక నీ మహిమలు గొనియాడెదము పాడెదము; శ్రీవేంకటేశ్వరా !
క్షీరాబ్ధిశయనా! కమలంబు సూర్యుని కెదురు చూచినయట్ట్లు నాహృదయ పద్మంబు రవిమండల మధ్యవర్తియైన నీకెదురుచూచుచున్నది; కుముదంబులు చంద్రోదయం బపేక్షించినట్లు నాకన్నుం గలువలు భవద్దివ్య ముఖ చంద్ర దర్శనం బపేక్షించుచున్నవి; మయూరంబులు మేఘాగమనంబునకుం జెలంగినట్లు నా మనోమయూరంబు నీలమేఘవర్ణంబైన తిరు మేను దలంచి యానందించుచున్నది; ముత్యపుఁజిప్పలు స్వాతి చినుకులకు నోరు దెఱచినట్లు నావదనశుక్తి మీ పాదతీర్ధంబునకు వికసించుచున్నది; సర్పంబులు గానంబులు గోరి చొక్కి పడగలెత్తి యాడినట్లు నా వీనులు నీ కధలాలకించుచున్నవి; నీవు పరాత్పరమూర్తివి;నేను ప్రకృతి సంబంధంబులైన యంగంబులు ధరియించినవాఁడ; నిది యెట్లుగూడు ననవలదు, ఆ ప్రకృతికి నీవు చైతన్యమవు. ఈ చుట్టఱికము తొల్లి కలుగఁగానే దీనికీ యనురాగము గలిగి యున్నది; కన్నెఱుంగకున్నఁ గడుపెఱుంగునండ్రు లోకులు; ఇంతియకాని నిన్ను నెఱుంగ మెంతటివారము; నాయాశ విన్నవించితి నింతియు కాని నిన్ను నేఁ గక్కసించిన వాఁడఁగానుజుమీ; శ్రీవేంకటేశ్వరా!
దామోదరా సకల తీర్ధంబులు మీ కోనేటనే యాడితి; సకల తిరుపతుల విగ్రహంబులు మీ మూర్తియందే సేవించితి;సకల దానంబులు మీకు నొక కాసు కానుక వెట్టినయందె ఫలియించె. విహిత యజ్ఞాదికర్మంబులు మీ కైంకర్యంబుననే తీర్చితి; జపంబులన్ని మీ తిరుమంత్రమందె జపించితి; వేదపాఠంబులు మీసంకీర్తనమందె యభ్యసించితి; తపములు వైష్ణవాచారముల లభియించె; నింక నేమిటం గడమలేదు; నా హృదయకమలంబున నీవున్నాఁడవు; నామనంబు శోధింపం బనిలేదు; నాణెంబైన టంకంబునకు వట్టంబు గొనరాదు; భండారమునం బడిన లెక్కకుఁ పరులు చాడి చెప్పం జోటులేదు; ఆరీతినే నీ సుముద్ర ధరియించినవాడ నగుటఁ జేసి యేదోషంబులు నన్నుఁ బైకొనకుండఁజేసి రక్షింపవే; శ్రీ వేంకటేశ్వరా!
హృషీకేశా! యేను బెక్కు జన్మంబు లెత్తి యలసి పూర్వజాతి స్మరత్వంబు గలిగి యీ పుట్టువున నిన్నుం గొలువవలయునని తలంచిన యుద్యోగంబునఁగాదు; శృంగారంబునకు నొసలఁ దిరుమణి వెట్టితి; మఱియు నా యుబ్బరితనంబున నీ సంకీర్తనలు నేర్చుకొంటి; నీ రీతి ప్రయత్నంబు లేక ఘనాక్షర న్యాయంబున నాచేఁతలు నీ దాస్యంబున కెక్కె; నీవు చక్కని మూర్తివి గావున నీ విగ్రహంబు నా యింటిలోపల నిడికొని నా వేడుకలకు దేవరఁగాఁ గొల్చితిని; నామీఁద దయదలంచి యకారణబంధుండవై యొక్కొక్క యుపాయంబున నన్ను నీడేర్చుకొఱకు నీమీదఁభక్తి పుట్టించితివి; నా జడత్వంబును నీ సర్వజ్ఞత్వంబును నిందులోనే చూపితివి; భళిభళీ! శ్రీ వేంకటేశ్వరా!
కమల నాభా ! మోక్షంబు గోరెడు వారికి నీపై నిరంతర ధ్యానంబు గారణంబు; ఈ రీతి ధ్యానంబు సేయుటకు నిర్మలంబైన మనంబు గారణంబు; నిర్మలంబైన మనంబునకు బంచేంద్రియ నిగ్రహంబు గారణంబు; పంచేంద్రియ నిగ్రహంబునకు శరీర శోషణంబైన తపంబు గారణంబు;తపంబునకు బాహ్యప్రపంచ విముక్తియైన వైరాగ్యంబు గారణంబు; వైరాగ్యంబునకు సంగరాహిత్యము గారణంబు; ఇన్ని మార్గంబులు నీ కలియుగంబున నెవ్వరికి సిద్ధించును? నీకు శరణుజొచ్చి నామంబులు పఠియించిన నీవే దయదలంచెదవుగాక; శ్రీ వేంకటేశ్వరా!
గోవిందా! పుట్టిన యపుడే యేయేజాతి పక్షులకాయా విధంబులం గూతలు వెట్ట నేర్పినవారెవ్వరు? మృగంబులు గర్భంబులలో నుండి వెడలి తల్లుల చన్నులం గుడువఁ గణంగుటెట్లు? పశువులు కసువుమెసంగెడి చందం బెట్టిది? నానావిధ వృక్షంబులు మొలచిన యపుడు తమ తమ యాకారములు పుష్ప దళములు గలిగి తతికాలం బెఱింగి చెలంగు టెట్లు? అన్నియును నీ యాజ్ఞారూపంబులైన ప్రకృతిభావంబులె; మేమును నీ రీతినే నీకల్పితములైన దేహంబులు మోచుచున్న వారము; మా నేర్పు, నేరములు, మాస్వభావంబులు, మా సంసార కృత్యంబులు నీ కల్పితములైన, నీ ప్రభావంబులే; మమ్ముఁ దప్పు లెంచఁబనిలేదు; శ్రీ వేంకటేశ్వరా!
పరమాత్మా! ప్రపన్నుండైన యతండు, జీవితకాలంబు మీ లీలా విభూతిలో, మీ కళ్యాణ గుణంబు లనుభవించి, భూమి పావనంబుగా సంచరించి, అర్చిరాది గమనంబునం బరమపదంబునం బొందెడునాఁడు, నాభినుండి ప్రణవభూరి నినాదంబు చెలంగ నీతోడం గూడి, నిన్ను సేవించికొని, హృదయగుహనుండి వెడలి, వాగాదీంద్రియంబులను మనంబుతోఁ గూర్చి, మనంబుఁ బ్రాణంబులఁ దగిలించి, ప్రాణంబుల జీవునిం గలపి, జీవుండైన తన్నుఁ బంచతన్మాత్రల నంటించి, యాజీవ ప్రకృతి నీయందుంబాదుకొల్పి, నీయాధారంబున సుషుమ్నానాడి బేధించి, మూర్ధన్యనాడి యైన బ్రహ్మరంధ్రంబున సూర్యకిరణంబులతో నిర్గమించి, యగ్నియహశ్శుక్ల పక్షోద గయనాబ్దాభిమాని దేవతలనియెడి యాతివాహిక గణంబు లొండొకరిచేతి కందీయఁగా, వాయువుఁ బ్రవేశించి సూర్యమండలంబుజొచ్చి, చంద్రమండలంబు జొచ్చి, మెఱుంగై యున్న విద్యుత్పురుషుని సహాయంబున, వరుణేంద్ర బ్రహ్మలోకంబులు గడచి, సువర్ణ బ్రహ్మాండ కటాహంబు భేదించి, పృధివ్యాపస్తేజోవాయ్వాకాశాహంకార మహత్తులనియెడి సప్తావరణంబులనుం దాఁటి, మూల ప్రకృతి మీఱి, విరజానది యుత్తరించి, తేజోరాశియైన బ్రహ్మంబనియెడు, నీ స్వరూపంబున బ్రవేశించునట; ఎటువంటి క్రొత్తైన కధ వింటిమి; ఆహాహా!! శ్రీ వేంకటేశ్వరా !
మురహరా ! ఆర్తులకు నభయంకరుండవు; సంసార సర్ప దష్టులఁదేల్ప గరుడధ్వజుండవు; అజ్ఞానతిమిరస్తులకు సూర్యనారాయణుండవు; పాపమను మొసలిచేతఁ బట్టువడిన వారి బాధలు మాన్పఁ జక్రాయుధుండవు; దారిద్ర్యదావానలంబార్ప గంగాజనకుండవు; దేవతలపాలింటి కల్పవృక్షంబవైన యశ్వత్థనారాయణుండవు; యోగీశ్వరులపాలికి చింతామణివైన కౌస్తుభవక్షుండవు; భక్తజన పాలక లక్ష్మీనాధుండవు; నీ ప్రతాపంబేమని వర్ణింపవచ్చు? నీ కళ్యాణగుణంబు లెన్నియని లెక్కపెట్టవచ్చు? నీమహిమలేమని తెలియవచ్చు? మేము మా నోరికొలందిఁ గొంత చింతించెదము; చిత్తగింపవే; శ్రీ వేంకటేశ్వరా !
గరుడధ్వజా !యేమని చెప్పెడిది నీ ప్రభావంబు? నీ నాభికమలంబునం బుట్టెనట; విరించి మీ మహిమం దెలియ శక్తుండుగాఁడట ! నానావేదంబులు నీ మహిమలు చెప్పునట; నీ మూర్తి కడగుఱుతుం గానవట ! రవిచంద్రులు నీ నయనంబులట; నీ యపార తేజోమహిమంబు లెఱుంగలేరట ! ఇంద్రాది దేవతలు నీ యాజ్ఞాధారులట; యొక్కొక్క మాఱును నీతోఁ గినిసి నిన్నెదిరించలేక నీ శరణు వేఁడుకొందురట ! పంచమహాభూతంబులు నీ ప్రకృతిగుణంబులట ! నీ స్వభావంబు లిట్టివి యని తెలుపజాలవట ! సముద్రంబులు నీ పాన్పట; నీ గుణంబుల లోఁతెఱుంగవట ! మునులు భవదీయ స్వరూప సూచకవాదులట; నీ మాయ దాఁటనోపరట ! చరాచర జగత్తు నీ సృష్టియట; నిన్నుం జూపి చెప్పనోపదట ! నా శక్తి యెంత? నేనెంత? నే నీశ్రీపాదంబులు గతియని యుండఁగా నీవే దయదలంచెదవుగాక; శ్రీ వేంకటేశ్వరా !
గోపికావల్లభా! నేఁ దలపోయంగా ఫలియించినమేలు, మఱియు నే వెదకంగా దొరకెడు పదార్ధంబులు, నేఁ గోరంగా వచ్చు లాభంబు, నేఁ జదువంగాఁ దెలిసిన యర్ధంబు, నే గడియించుకొనంగా సిద్ధించిన ధనంబు, నానేర్పులవలనఁ దెచ్చుకొనియెడి సుఖంబు, నా చేతులఁజేసిన పుణ్యంబు, నా తపోబలిమిఁ గైకొను లోకంబు, నా పురాకృతఫలంబు, నా మనోరధంబు, నీవే; నా నుదుట బ్రహ్మదేవుండు వ్రాసిన వ్రాలు, నే జన్మించిన జన్మ కారణంబు; నాయంతరంగంబులోనున్న మూర్తి నీవే సుమీ; నాకలిమి విన్నవించితి; శ్రీవేంకటేశ్వరా !
పీతాంబరధరా ! నీ సాలోక్యంబు నాకు ఈ భూలోకంబుననే సిద్ధించి యున్నది; సామీప్యంబు హృదయ కమలంబున లభియించె: సారూప్యంబు నీధ్యానంబున నిలిచినది; సాయుజ్యంబు నిద్రాసమయంబునంగలదు; నీకు శరణు జొచ్చినం బాపవిముక్తి సేతునంటివి గావున జీవన్ముక్తి సమకూడె; నీవు నన్నెడబాయకుండుటంజేసి సదానందానుభవంబు గలిగె; నీపై భక్తి యొసంగి నందువలన జన్మ శుద్ధి యయ్యె; నాలుకకు మీ నామామృతం బొసగిన కతన నమృతపానంబు దొరకె; మఱియు నీదాసుల సంగతిని యోగము నలవడె; ఇంక నిన్నడిగెడిదేమి? అన్నిటం గృతార్ధుఁడనైతిని;
శ్రీ వేంకటేశ్వరా !
శార్జ్గాయుధధరా ! నిన్ను భజించి యేమియైననుం గోరి యడిగెద నంటినేని నీకంటె నుత్తమ వస్తువు లెక్కడ నున్నవి? నీయందే మూర్తిత్రయంబును, ద్వాదశాదిత్యులను, నేకాదశరుద్రులును, నవ బ్రహ్మలును, నేకోనపంచాశన మరుత్తులును, వసువులును, దిక్పాలకులును, మునులును, సిద్ధగంధర్వపదంబులును, అణిమాద్యష్టైశ్వర్యంబులును,చతుర్దశభువనంబులును, కులాచలదిగ్గజ మహా నగములును, సింధుగంగానదీ ముఖ్య తీర్థంబులును, సకల సామ్రాజ్యంబులును, నున్నవి. పరమపదంబున్నది; నీవుగలచోట నన్నియుం గలవు; నిన్ను నాత్మ దలంచిన నాకు సకలసౌఖ్యంబులుం గలవు; శ్రీ వేంకటేశ్వరా !
నీలమేఘశ్యామలా ! అణువులకు నణువవు; మహత్తులకు మహనీయుండవు; ప్రకృతిపురుషులకుం బరమాత్మవు; మూఁడు మూర్తులకు మూలమవు; చరాచరంబులకు సాక్షివి; ఊహించి చూచిన నొక్కండవే దేవుండవు; ఏర్పరచి చూచిన ననంతుండవు; తలఁచిన నభేద్య తత్పదుఁడవు; విచారించిన నిర్గుణుండవు; వినం గణంగినఁ గల్యాణ గుణుండవు; కన్నులం జూచిన సాకారమవు; స్వరూప వ్యాప్తిని నిరవద్యుండవు; స్వాతంత్ర్యంబున జీవ చైతన్యమవు; భక్తిపరులకు బ్రసన్నుండవు; తుది విచారించిన జగత్కర్తవు; ఇట్టి నీ గుఱుతెఱుంగ వచ్చునయ్యా !పెక్కు రూపంబులు గలవాఁడవు; వేదవాదులకును నగోచరుండవు; నిన్నుం కొలువనేరము, నీవే కరుణించి కావవే; శ్రీ వేంకటేశ్వరా !
కోనేటి నిలయా ! విరజానది పర్యంతంబును విడువని పాకృతదేహం మోచిన జీవులు, తమ సామర్ధ్యంబుల జీవన్ముక్తుల మయ్యెదనెట్లువచ్చు? ఇట్టి ప్రకృతిసంబంధమున వచ్చిన ఇంద్రియంబు జయింపనిచ్చు? అందులకుఁ గారణంబైన మనస్సు నేరీతి నిర్మలంబగును ? తన్మూలంబునం జేసిన కర్మంబు లేల శాంతింబొందు? నదియునౌఁగాకేమి ? ఎందులకు నేలా భయంబునొంద ? ఇందులకుఁ గారణంబిన్నివిధంబులం బ్రవర్తిల్లెడు నీ మాయ; నిన్నుంగొలిచినవారికీ మాయ నుపసంహరింపనేర్తువు; తాళముచే యొకవంక నుండ దలఁపుతో బెనంగఁగా నేల ? ఇది యెఱింగికదా మున్నిట్టివారు కొందరు నీదాసులయి, నిన్నుం బొగడియు, నీకు శరణు జొచ్చిం మహాత్ములయిరి; ఏము నదియె యుపాయంబని యెఱుంగు కొంటిమి ; శ్రీ వేంకటేశ్వరా !
అప్రమేయా ! భువి నెన్ని మాయోపాయంబులు గలిగిన నీ దాసునకు నీడురావు; చేయవచ్చు బహువిధ పుణ్యంబులు; నీవు దేవునివని తెలియు విజ్ఞానమునకు సరిగావు; నేరం దగు యోగాభ్యాసంబున ఇవి నీ భక్తితో సరిగావు; ఉండుఁగాకేమి పెద్దతనంబులు కొందఱుకు నీ శరణాగత ధర్మంబుతోఁ బురుణింపరావు; వెలయుచున్నవి పెక్కు శబ్ధంబులు, నీ తిరుమంత్ర స్తోత్రంబువలె ఫలంబులొసగవు; ఇదియెఱుంగుదు; ఇంక నానావిద్యలు నీ సంకీర్తన విద్యం బోలవు; నిగు ముప్పదిమూఁడు గోట్లదేవతలు, నీవంటి బలవంతులుగారు; నీ వివరంబులకు హానిలేదు; నిన్నుఁ గొలిచినవారి పదవులు ధృవపట్టములు; ఇది లోక దృష్టాంతము; నీచరిత్రలు గణుతింప నలవిగావు; మఱియు నితర మార్గంబు లెండమావుల నీళ్ళవంటివి; మిణుంగురుఁ బురువుల ప్రకాశము వంటివి; కాకిబేగడల సొమ్ము వంటివి; కప్పచిప్పల వెండి వంటివి; ఇట్టిభ్రమలం బొరలక నీ శ్రీపాదంబులే గతి యని యన్న వారలు ధన్యులు; శ్రీ వేంకటేశ్వరా !
నారాయణా ! పుట్టువులు హేయమూల మనంగా నూరక రోయుటేకాని యవి యెవ్వరికి నపకారకంబులని తెలియంబడవు; కర్మంబులు ఫలంబు లొసగునని చేయుటకాని యవి మాతో నొడంబడుటలేదు; సంసారభారంబున నూరక జడియుటకాని యది యెవ్వరికి నసహ్యంబని తోఁపదు; మోక్షంబు మంచిదనంగా నాసపడి వెదకుటకాని యది తొల్లి యనుభవించి చూచినది గాదు; నీవు సర్వేశ్వరుండ వనంగా విని మ్రొక్కుటగాని నిన్ను నింతటివాఁడవని తెలియనలవిగాదు; ఏమని విన్నవించెద? నాజ్ఞానంబనఁగా నెట్టిది? తొలిజన్మంబున నా మీఁదఁ గటాక్షం బేపాటి పెట్టితివో యీ జన్మంబున నీ దాసుండం గాఁ గలిగె; శ్రీ వేంకటేశ్వరా !
సకలలోకారాధ్యా ! అన్నిచోటుల నుండుదువు గావున మే మెచ్చట నుండి సంచరించి వచ్చినను నీయొద్ద నున్న వారమే; నీవు సకల లోక నాధుండవు గావున నిన్నుం గొలిచిన వారమే; కన్నుల యెదుటనున్న రూపంబులెల్ల నీ శరీరంబు గావున నిన్ను సదా సేవించినవారమే; మాలో నెప్పుడుఁ బాయకుండుదువు గావున నిన్నుం దలంచినవారమే; నేఁగొనియెడి యాహారంబులు నీ విచ్చినవి గావున నీ ప్రసాదోజ్జీవనమే; నేఁజేయుచున్న కృషిగోరక్షణవాణిజ్యాదులు నీ లీల కుపయోగంబులు గావున నవి నీ పూజలే; నన్ను నీవు పుట్టించినవాడవు గావున నీ బాము నీవల్ల నీడేఱెడిదె; ఈ యర్ధంబు మఱవక ఆదరింపుమయ్యా ! నే నెప్పుడు నీ సూత్రంబున నాడెడు బొమ్మను; నా విన్నపములు పదివేలు విన్నపములుగా విన నవధరించి నన్నుం గరుణింపవే; శ్రీ వేంకటేశ్వరా !
హయగ్రీవా ! కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అదోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్ధన, ఉపేంద్ర, హరి, శ్రీ కృష్ణ, యనియెడి చతుర్వింశతి నామంబులు పాపహరంబులు; పుణ్యంబుల కునికిపట్లు; నుతించువారికి వచనభూషణంబులు; కోరినవారికిఁ గొంగు బంగారంబులు; జ్ఞానులకు సిద్ధమంత్రంబులు; ఇహపరంబులకుఁ గామధేను కల్పవృక్ష చింతామణులివి; శ్రీ వేంకటేశ్వరా !
ప్రహ్లాదవరదా! బదరికాశ్రమ, నైమిశారణ్య, సాలగ్రామపర్వత, అయోధ్య, ప్రయాగ, ద్వారావతీ, పురుషోత్తమ, సింహాచల, శ్రీకూర్మ, అహోబల, సేతు, కుంభకోణ, తామ్రపర్ణీ, శ్రీరంగ, కాంచీ, నారాయణ గిరులు మొదలగు పుణ్యక్షేత్రంబులు, నీ నూటయెనిమిది తిరుపతులు సేవించిన ఫలము, నీ దాసులంగని యొక్కసారి నమస్కారంబు చేసినం బ్రసన్నుండవై యిత్తువు; నాలుగువేదంబులు, ఆఱు శాస్త్రంబులు, అష్టాదశ పురాణంబులు చదివిన పుణ్యంబు "నారాయణా" యనిన నొసంగుదువు; ఆగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ ద్వాదశాహ పౌండరీకాది క్రతువులు గావించిన సుకృతంబు నీ శ్రీపాదంబులపై నొక తులసీదళంబు సమర్పించినఁ గలిగింతువు; తులాభార హిరణ్య గర్భాది దానంబుల ఫలంబు, మీ దాసులమనిన మాత్రంబున ప్రసాదింతువు; నీవు భక్తి సులభుండవు గావున నీ శరణార్ధులకుం బ్రయాసంబులు లేవు; శ్రీ వేంకటేశ్వరా !
శ్రీజనార్ధనా ! శ్రీ భూమీ నీలాసమేతా ! శంఖ చక్ర గదా ఖడ్గ శార్జ్గాయుధధరా ! చతుర్భుజా ! శ్రీకౌస్తుభమణి శ్రీవత్స శోభిత వక్షా ! పీతాంబరధరా ! మణికిరీట మకర కుండలాభరణా ! వై జయంతీ వనమాలాలంకృతా ! పుండరీకాక్షా ! అనేక బాహూదరశిర: పాణిపాదోరు జంఘావయవా ! విశ్వరూపా ! అనంత గరుడ విష్వక్సేనాది నాయకా ! సనకసనందన సనత్కుమార సనత్సుజాత సల్లాపా ! నారద గానప్రియా ! నీలమేఘ శ్యామలా ! చతురాననజనన నాభీ సరోజా ! గంగానదీ కారణ శ్రీ పాదపద్మా ! భక్తవత్సలా !వేదోద్ధారకా ! వైకుంఠపుర వరాధీశ్వరా ! అసురశిక్షకా ! అమర రక్షకా ! జగన్నివాసా ! జయ జయ, నీకు ననంత నమస్కారంబులు సేసెద; అవధారు; శ్రీవేంకటేశ్వరా!
గజేంద్రవరదా ! నీవు మాకుం గలవని యొరులను దీవింతుఁగాని యా దీవన ఫలము నొసగ శక్తుండను గాను;నీవు నాయందుఁ బ్రవేశించి యున్నావని మ్రొక్కించుకొందుంగాని రాజసమున మ్రొక్కించుకొన్న వాఁడనుగాను; నీ దాసుండనని పెద్దలలో దొరలుచున్నవాడఁ గాని నా తపోమహత్వంబున నధికుండనని యహంకరించినవాడం గాను; నీవు మనుష్యునిం జేసి ప్రవేశింపఁ బుట్టితింగాని నా స్వతంత్రంబునఁ బుట్టినవాఁడనుగాను; నే నెంత జడుండైన నెన్ని విధంబుల విడువందగునె నన్ను ? శ్రీ వేంకటేశ్వరా !
ప్రద్యుమ్నా ! నీ పాదంబులు మనంబునఁ దలఁచెదను; వాక్కునం గొంత నుతించెదను; నా చరణంబుల మీకుఁ బ్రదక్షిణంబు వచ్చి చేతులెత్తి మ్రొక్కెదను; నాకుం గలిగిన యుపాయంబులవియ; కాన బహు విధానంబులు పెంచి కర్మంబులు చేసి మిమ్ము మెప్పించ శక్తుండఁ గాను; మీకు దయ యుండ నతి ఘోర తపంబు చేసి హర్షించి వరంబులడుగ నేర; ఉద్ధవునిరీతి గోపికలకు మీకు నెడ మాటలాడి, మిమ్ము నభిముఖునిఁ జేసికొన సమర్దుఁడగాను; సుగ్రీవుని గతి సేనలం గూర్చుకొని మీ యవసరమునకుం గొలువ బలవంతుండంగాను;నా పురుషార్ధం బీపాటి; నన్నుఁ జూచి "వీడేల తగిలెడు" నని కలంగకు; పరుండు వానికి భూమి యాధారంబు; నదులకు సాగరంబే గతి; పక్షులకు వృక్షంబే వసియింపఁజోటు; సస్యములకు వర్షంబు; నాకు నీవు; శ్రీ వేంకటేశ్వరా !
సంకర్షణా ! నీ మాయా మాత్రంబున మానవులకు నీవు దరు లోహ పాషాణ మృణ్మయంబులైన రూపంబులు వహించుకొని గుళ్ళ లోపలను, ఇంటింటివారిచేతను, బూజలుగొని, వారు గోరిన వరంబు లొసగుచున్నాఁడవు; ఏమియు నెఱుంగని వారికెంత సులభుండవై యున్నాఁడవు ? నీ వితరణ గుణంబు నిన్నిటువలెఁ జేసినదియో ? ఈగతిం గరుణించుట నీ వ్రతంబో ? నీకది స్వభావగుణంబో ? దీనులఁ గాచుట కీర్తియో ? రామ రామ ! అరుదరుదు నీ మహత్వంబు ! నీ చరిత్రంబు విని వెఱఁగయ్యెడు; మేలు మేలు ! ఎట్లైన నింక నాజన్మములు ఫలించె; మనోరధంబు లీడేఱె; సంతోషంబు పరిపూర్ణంబయ్యె; శ్రీ వేంకటేశ్వరా !
దానవారి! తొల్లి నే నుత్తమ గుణంబు లెఱుఁగను; నామీఁదం గృపవెట్టి పెద్దలు నన్ను నాచారవంతుండందురను నభిమానంబు రేఁచి నన్ను సాత్వికుం గాఁజేసితివి; ఒరలు నన్నుం జెనకుదురో యని పిరికితనంబు బొడమించి శాంతునిఁగాఁ జేసితివి; కాంతలు ధనం బపహరింతురనియెడు లోభంబు పుట్టించి జితేంద్రియునిఁగాఁ జేసితివి; అలమటలం బొంది ధనంబార్జించు వేసటనొందించి విరక్తునిగాఁ జేసితివి; నరకభీతి నివారించుటకై నీ శరణు సొరంజేసితివి; ఈరీతి ననాది సంసారాసక్తుండనైన నన్ను నొక్కొక్క యుపాయంబున మీకభిముఖునిగా దిద్దుకొంటివి; మఱియింక నే బ్రార్ధించి నీకుంజేయు విన్నపము లేమియున్నవి? నీదైవిక ప్రయత్నంబు ముందఱ నా మానుష ప్రయత్నంబు లుపచరింప సిగ్గయ్యెడిని; బాపురే ; నిన్నుమెచ్చి నీకేమియొసంగెదము ; నిన్నుం బొగడుటే మాచేతనైనపని; శ్రీ వేంకటేశ్వరా!
పురుషోత్తమా! వేదంబులు రత్నాకరంబులవంటివి; తమలోపలి యర్ధంబులు బయలు పడనీయవు ; పురాణంబులు ఘంటవేటకాండ్రవంటివి; నానార్ధంబులు చాటిచెప్పి భ్రమయుంచుఁగాని నిశ్చయంబు దేట పడనీయవు ; భాట్ట ప్రాభాకరాది శాస్త్రంబులు నన్యోన్య శత్రువులవంటివి; ఒకొక్క మతంబు వేరొక్కమతమును ఖండించుంగాని నీ మీది భక్తి బోధించవు; దానంబులు ఇంద్రజాలంబులవంటివి; ఒకటి పదియారై యనుభవింపఁ జేయుఁగాని ముక్తికిం దెరువుఁ జూపనేరవు ; యితర కర్మంబులు చేని పంటలవంటివి; జన్మ పరంపరలకు హేతువులై దేహముల మొలపించుంగాని వైరాగ్యంబుఁ బొడమనీయవు; వీని చందంబు లిట్టివి; ఏమిటం దెగు సంశయంబు? నిక్షేపంబు పెట్టినవాఁడె చూపక కానంబడడు; నీవు సర్వజ్ఞుండవు; నాకు నిశ్చితార్ధంబిట్టిదని తెలుపఁగదే; శ్రీ వేంకటేశ్వరా !
పరమపురుషా! నే దుర్జనుండనని యెవ్వరు మఱుగుపడ విన్నపంబు సేయుదురో? యిప్పుడే నా నేరములు నేనే చెప్పుకొనియెద; మండాడుకొనియెద, తప్పుకొనియెద; నదియెట్లంటివేని, నేఁ జేసిన పాపములు నన్నుం జుట్టుకొనియనేని నీ నామోచ్చారణంబు చేసి తప్పించుకొనియెద; నీ చేతం గల్పితంబులైన విషయంబులు బాధింప వచ్చెనేని, నా మదిలో నీ పాదంబులు దలంచి మఱుగునఁ డాఁగెదను; పురాకృత కర్మంబులు నన్ను ననుభవింపవలయునని పట్టుకొనియెనేని నీ వాఁడనని బలిమిం ద్రోచెదను; యమ కింకరులు నా తెరువు వచ్చిరేని నా భుజంబులనున్న శంఖచక్ర లాంఛనంబులు చూపి వెఱపించెదను; సంసార పాశంబులు నన్నుఁ దగిలెనేని నీకధలు విని పరాకు సేసుకొనియెదను; నీమాయ నన్ను ముంచుకొనియనేని నీదాసులకుం జెప్పి నీకు విన్నపంబు సేయించెద; నా యపరాధంబులు చిత్తంబునం బెట్టకుమీ ; శ్రీ వేంకటేశ్వరా!
స్వామీ! నీవు రక్షింపదలచిన బ్రహ్మశాపంబేమిసేయును; ఉద్ధవునిఁకాలజిరజీవునిఁ జేసితివి; బ్రహ్మాస్త్రంబేమిసేయఁగలదు? పరీక్షిత్తును బ్రదికించితివి; బ్రహ్మ మాయ యేమిసేయఁగలదు? వత్స బాలకుల నిర్మించితివి; మృత్యువేమిసేయఁగలదు? సాందీపుని కొడుకులం దెచ్చితివి; పాపమేమిసేయఁగలదు? అజామిళుని ఉద్ధరించితివి; అన్నింట నీవు బలవంతుడౌట నీ చేతలం గానబడియె; నీ దాసులైన వారిని భయంబు
బొందకుండం గాతువు; నీ ప్రతాపంబు ఏమని వర్ణింపవచ్చునే? శ్రీవేంకటేశ్వరా !
పుండరీకాక్షా! అజ్ఞాన జంతువులైన మేకఁపోతులు ఇంద్రాద్రి దేవతలకుఁ బశుపురోడాశంబయిన సంబంధమునఁ దమ్ముఁగాచు గొల్లవానితోఁ గూడి స్వర్గాది భోగంబుల ననుభవించునట ! రాజ్యలోభంబునఁ గ్రోధంబు పెంచి సమరరంగంబున అన్యోన్య హింసాపరులైన వీరపురుషులు సూర్యమండలంబు సొచ్చి దివ్య పదంబులనుభవింతురట! కామాతురలైన సతులు పతులం బాయలేక కళేబరంబులు కౌఁగిలించుకొని యనలంబుఁ బ్రవేశించి యుత్తమగతులం బొందుదురట! సమ్యగ్జ్ఞానసంపన్నులై నీ దాసులై దేహంబులందు నీలాంఛనంబులైన తప్త శంఖచక్ర ముద్రలచే బరిశుద్ధులై, కామ క్రోధాది పశువులను జ్ఞానాగ్నిలో వేల్చి, తులసీయుక్తమైన నీ
శ్రీపాదతీర్ధ సోమపానంబునం బాపంబులు విదల్చి, నీ ప్రసాదమనియెడి పురోడాశనంబును ఆరగించి, ఆచార్యోక్తి ముఖంబున నీ తిరుమంత్ర యాజమాన పాఠంబులు జపియించి, నీకుఁ బ్రీతిగా శ్వేతమృత్తికా శ్రీ చూర్ణ ధారణంబుఁ జేసి పద్మాక్ష తులసీ మాలికలు పూని, నీ పైఁ దలంపుం బెట్టుకొని నీ పూజా యాగంబు నిత్యంబును జేయు వైష్ణవోత్తముల భాగ్యంబు లేమని వర్ణించవచ్చు? శ్రీవేంకటేశ్వరా !
పద్మనాభా! నీకై మ్రొక్కనెత్తిన కేలి నమస్కారంబు, ముంజేతికంకణంబు; నీలాంఛనంబైన తిరుమణివడంబుల జోడు మంగళ సూత్రంబు; ఇతరంబుమాని నిన్నే కొల్చుట పాతివ్రత్యధర్మంబు; నీదాసుల సంగతి మెలంగుట కులాచార నియమము; నీ పై భక్తినిష్ఠకుంజొచ్చుట ఉంకువ ధనం బందుకొనుట; నీదాశ్యమే మానంబు ; నీ కైంకర్యంబుసేయుట కాపురముసేయుట; నీ మూర్తి సేవించుటే సదానుభవంబు; నీముద్ర ధరియించుటే చక్కఁదనంబు; ఆచార్య ఉపదేశంబే యావజ్జన్మ సంపద; యని నిన్ను భజియించువారలు శ్రీ వైష్ణవులు; ఇటువంటివారలకు నీవు వరదుండ వని వింటిమి; మేము వారిలోనివారమే; నీ చిత్తంబునఁ బెట్టుమీ;
శ్రీ వేంకటేశ్వరా!
కోటిసూర్యప్రకాశా ! నీలీలావినోదంబులకు నీవు గడియించుకొనిన ద్రవ్యంబులు లవణేక్షు సురా ధధిఘృతక్షీరాదులు సముద్రంబులై యున్నవి; కాంచన రజత ముఖ్య లోహంబులు పర్వతంబులై యున్నవి;సకలధాన్యంబులు నిచ్చఁ గ్రొత్తపంటలై రాసుల గుచున్నవి; పద్మ రాగ వైఢూర్య రత్న సంఘంబులు భూగర్భంబున నిక్షేపంబులై యున్నవి; పుణ్యనదులు నీ రాజ్యంబునకుఁ గట్టు కాలువలై యున్నవి;పుష్ప ఫల సమేతంబుల కాననంబులు నీ శృంగారపుఁ దోఁటలై యున్నవి; గజ వాజి రధ పదాతి సమూహంబులు పట్టణంబు లెందుఁ జూచిన నీ ఠాణంబులై యున్నవి; జగదేకకుటుంబివైన నీవు సంసారంబు సేయఁగాఁ జూచి నోరూరుచున్నది; ఇతరులు నిన్ను మోక్షంబడుగ నెట్లు సమ్మతించెదరు? నీ తోడి కాఁపురంబు గోరుదురుగాక ! వారివలనఁ దప్పేమి? శ్రీ వేంకటేశ్వరా !
బలిబంధనా! దేహధారులకు రాగద్వేషంబులుడుగ ఎట్లు వచ్చు?బొందితో స్వర్గంబునకుఁ బోయిన ధర్మరాజును నున్నతపదంబున నున్న దుర్యోధనాదులం జూచి కనలిపడియెనట; నేమనంగా నెంతవారము? దేవా ! నీవు పంచేంద్రియంబులు పఱియవిడిచి, ప్రాణుల నజ్ఞానమున ముంచియెత్తి భ్రమియింపంగా నీతో నెదిరించి వాని నడంపశక్తులమె? నీకు శరణని నీ నామసంకీర్తన చేయంగ నీ చిత్తము ! మా భాగ్యము !యెట్లు చేసినా నీ చేతిలోని వారమే ! శ్రీవేంకటేశ్వరా !
వేదవేద్యా ! నీవు లోక వ్యాపారంబున నానాజీవులఁ బోషింపుచుండ నేనొక్కవంక నీమూర్తి నా మనంబున భావించి చిక్కించుకొని నీతో బట్టబయలు మాటలాడుచు నానా మనోరధంబులం గాలక్షేపంబు సేయుచున్నాడను; యిదినీవుసేయు నుద్యోగంబునకుం బరాకు సేయుట గాదుగదా ! కాదులే; విశ్వతోముఖుండవు గావున నందఱతో మాటలాడనోపుదువు; పరిపూర్ణుండవు గావున నన్ని చోటుల నుండనోపుదువు; మా కపచారము లేదు; అనంతశక్తిధరుండవు, అనేక మహిమల వాఁడవు, అపరిమిత ఉదారగుణండవుఁ గావున నిట్టి నీ మహాత్మ్యంబునకు శరణంబు; శ్రీ వేంకటేశ్వరా !
దేవదేవా నిన్ను నేఁ బలుమాఱు దలఁచిన వీఁ డేమి కోరి తలంచుచున్నాఁడో యని నీ చిత్తంబున నుండునని యొకానొకసారి నిన్నుఁ దలంపుదును; మఱియును మేనిం బడలించితపంబు సేసిన నంతరాత్మవైన నిన్ను బడలిక సోఁకునో యని యూరకుందును; పేరుకొని నిన్నుఁ బిలిచిన నన్ని పనులు విడిచివత్తువో యని మౌనఁబున నుండుదును; జగత్తున నీవుండుట భావించచూచిన నిన్ను శోధించునట్లయ్యెడినో యని పరాకుచేసుకొందును; నీచరిత్రంబులు సారెసారెకు వినంగడంగిన రహస్యంబులు బయలఁబడునో యని యాలకింపను; నీ కొలువు సేసి పాదంబులకు మ్రొక్కంగా మందెమేల మయ్యెడినో యని యంతట నింతట నుండి సేవింతును; యిదియెఱింగి నీవే దాయంగావుము; శ్రీ వేంకటేశ్వరా !
వైకుంఠనాధా ! హిరణ్యగర్భాదులకుఁ దండ్రివైన నిన్ను, సనకాదులకు నేలికెవైన నిన్ను, దివిజులకు రక్షకుండవైన నిన్ను, మునులకు వరదుండవైన నిన్ను, జ్ఞానులకుఁ బరదేవతంబవైన నిన్ను, జగంబులకు మూలకారణమవైన నిన్ను, యశోదానందగోపులు పుత్రుండవని పెంచిరి; గోపికాజనంబులు పతివని తలంచిరి; పాండవులు బావమఱఁదివని భావించిరి; వీరలటువంటి మమకారంబు లనుభవించిరి; మఱికొందఱు ముచికుంద దధిభాండ కమలాకర భీష్మాదులు పరతత్వమైన నారాయణుండువని భజియించి బ్రహ్మానందంబు బొందిరి; ఇన్ని విధంబులవారికి నీ వొక్కండవే గుఱి; ఎటువలె భావించిన నటువలె నవుదువు;వివేకింప నేర్చినవారి పాలిటి నిధానమవుదువు; శ్రీ వేంకటేశ్వరా !
సత్యసంకల్పా ! ప్రసన్నులైనవారికి మీదాసుల శ్రీపాదతీర్ధంబు శిరసావహించుట సకల పుణ్యనదీస్నానములు; త్రికాలంబుల ఆచార్యవందనంబులు సంధ్యావందనంబులు; అభ్యాగత శ్రీవైష్ణవులు ఉపచరించిన వాక్యంబులు గాయత్రీమంత్ర జపంబులు; పూర్వాచార్యోక్త స్వరూపగ్రంధానంబులు వేదపారాయణంబులు; జ్ఞానాగ్నియందుఁ కామక్రోధంబులను సమిధలు వేల్చుట ఔపాసనంబు; ఆర్తులైనవారికి శ్రీవైష్ణవ మార్గంబులు ఉపదేశించుట అతిధిసత్కారంబులు; తాతముత్తాతలమాద్రి నుండుటే దేవపితృ సంతర్పణంబులు; మీ తిరువారాధన సేయుటే సకల యజ్ఞంబులు చేయుట; వేదోక్తంబైన కర్మనియమంబుల ఫలంబులు నిటువలె సిద్ధించె; ;ఇదియే పరమార్ధంబు; నిను గొల్వవచ్చు; పాపముంబట్టి నిర్ధరింపవచ్చు; నిన్ను ముట్టి మెప్పింపవచ్చునే ! శ్రీ వేంకటేశ్వరా !
నిగమగోచరా ! నామనంబు ధ్యాన యోగంబు సేయం గడంగినఁ జండాల గార్దభ శూకర కాంతలు తలఁపునం బాఱెడిని; అంతట నదివిడచి పురాణంబులు చదువంజూచినఁ తాటకా శూర్ఫణఖా విరాధ కబంధ రావణ కుంభకర్ణాదినామంబులు నోటం దొరలెడిని; అది మాని జపంబుసేయంబూనిన నిద్రయు, నావలింతలు నలసత్వంబులుఁ బొదిలెడిని; అది చాలించి తీర్ధయాత్రకుఁ గుతూహలినైన దుష్ట చోర వ్యాఘ్ర మకరాదిభయంబులు వణఁకం జేసెడిని; ఈరీతుల నా ప్రయత్నంబు లెక్కడకెక్కు ? నే నొకటి దలంచిన వేఱొక్క చందంబున నీ మాయ భ్రమయింపుచున్నది; ఏ యుపాయంబున నిన్ను నావశము చేసుకొనియెద? నా చందము నాకు బోధింపవే; నీవు జగద్గురుండవు; నా మర్మము నీచేత నున్నది; శ్రీ వేంకటేశ్వరా !
నగధరా ! తరులతాపాషాణాదులైన కొన్ని జీవశరీరంబులు నరపశు పక్షిమృగాదులైన కొన్ని జంతువులకు నాహారంబులై యున్నవి; విచారించి చూచిన ఎవ్వరి కెవ్వరు చుట్టములయ్యెదరు? ఋణానుబంధంబున దగిలిన వారు పుత్ర మిత్ర కళత్రాదులు; ప్రాకృతసుఖంబులకుఁ దోడైన వారలు వీరు; స్వామీ ! జగదేక కుటుంబివి నీవు; మోక్ష సుఖంబునకుం దోడైనవారు నీ దాసులు; ఇహపరలోకంబులకు సాధనంబులైన బంధువులు మీరు; మీ నామములు సకల దురిత నివారణములు; మీయాయుధములు మాకు సర్వ రక్షకములు; మీ పాదంబులపై భక్తి మాకు వజ్రపంజరము; శ్రీ వేంకటేశ్వరా !
విష్ణుమూర్తీ ! నేనెంతమూఢఖఠినచిత్తుండనైన నీవు నామీఁదఁ గృపవెట్టిన సాత్వికుండనగుదును; అదియెట్లంటివా? ఱాతిమీదఁ గడువ వెట్టినఁ గుదురుగాదె ! కమరునం జవ్వాజి పూసినఁ బరిమిళంబు పుట్టదే! చిల్కకుం జదువుచెప్పినఁ జదువనేరదే ! అడవియిఱ్ఱికి వేఁటనేర్పినఁ బంపుసేయదే ! ఇట్టుగావున నీవు నామీఁద దయఁదలఁచి తల్లి, బిడ్డలను బిలిచి యాహారంబు వెట్టునట్లు యజమానుండు దన పసువులను దోలితెచ్చిన వానిని యింటఁ బోషించినరీతి, నన్ను నీ చిత్తంబున దయఁదలచి నీకింకరునిగాఁ జేసికొనవే; శ్రీవేంకటేశ్వరా !
గోవర్ధనోద్ధారా ! నేను గరచరణాద్యవయవంబులు దాల్చి మాతృగర్భంబునందుండి వెడలి పెరిగి బుద్ధినెరింగి యీజగంబులకుం గర్త యెవ్వండొకొ యని వెదకి వెదకి పురాణంబులవలన నీవైభవంబులువిని నిన్నుం గనుంగొన శక్యంబుగాక యేవ్వండవొకొ యని విచారించి నిన్ను నెఱుంగ నలవిగాక తిరుమల వరుస వెంటం జని వేంకటాచలంబెక్కి గరుడస్థంభంబు చెంత జనులకు నీ వొసగు వరంబులు చూచియుఁ పాప వినాశనంబునఁ దీర్ధంబులాడువారి పాపంబులు నీరై పాఱుటంజూచియుఁ ఆ కొండమీఁద వృశ్చిక సర్పాదిజంతువులు నిర్గతవిషంబులగుటఁ జూచియు, జోద్యంబు నొంది యచట నీమూర్తి దర్శించి తొల్లింటి యజ్ఞానంబు విడిచి సందేహంబులుమాని నీవే యేలిక వనియు నే నీబంటు ననియు దెలిసి శ్రీవైష్ణవుండ నైతి రక్షింపవే; శ్రీవేంకటేశ్వరా !
ఉపేంద్రా ! నీవు నాకు దేవరవై నాలోనుండఁగా నేను ఏదిక్కు చూడక యేకాంతంబని సంసారంబు చేసి బిడ్డలంగంటిని; అదియునుంగాక యేలికవైన నీవు నన్నుఁ జూచుచుండ భ్రమసి యెవ్వరుంగానరని చేయరాని పాపంబులు చేసితిని; మఱియు నీవు నాకుఁ దోడవై రక్షకుండవై యుండఁగా మఱచి యొంటి నున్న వేళ వొక్కండనే యని సంశయించి భూతంబులకు వెఱచితిని; క్రమ్మఱ నీవు నామనంబులోఁ బంచేంద్రియములలో విహరింపఁగా వెఱవక మందెమేల మని యెంచక, మంచముపై నిద్రించితి; వొక్కొక్కవేళఁ దల్లిదండ్రులైన మీ రాత్మభోగంబుల నొసగుచు బాహ్యాభ్యంతరములం గాంచుచుండఁగాఁ గొంచించక సిగ్గువిడిచి మలమూత్రంబులు విసర్జించితి; ఎంచి చూచిన నాయపరాధంబు లెన్నియైనం గలవు; అన్నియును నోర్చుకొనుము; నా తప్పులకు బ్రాయశ్చిత్తంబుగా దండంబు పెట్టెద; శ్రీవేంకటేశ్వరా !
చక్రపాణి! నీ మాయలకు లోనై నేను వ్యసనంబులచేతం జిక్కినప్పుడు నీ బంటనని విడిపించుకొనుమీ! ఆశాపాశంబులు నన్ను నలువంకలుకుం గుదియం దీసెనేని ప్రాఁతవాఁడనని వెనుక వేసుకొనుమీ ; కామక్రోధాదులు సారెసారెకుఁ బట్టఁ గడంగెనేని నీ ముద్రలు మోచినవాఁడ నని యడ్డంబు రమ్మీ; పురాకృతకర్మంబులు నన్నుఁ దగిలినేని సంకీర్తన సేయువాఁడనని మన్నించి రక్షించుకొనుమీ! నడుమనడుమ నజ్ఞానంబు చిక్కించుకొనిన దానిం బరిహరించి నన్నుఁ జేపట్టుమీ ! మనసుపట్టలేక మునుపునే విన్నవించితి; నీవు అనాధనాధుండవు; ఆర్తశరణ్యుండవు; సర్వ భూతదయానిధివి; నిర్హేతుక బంధుఁడవు; నీవు నాహృదయంబులోనివాఁడవు; నాకు దిక్కు నీవేసుమీ; శ్రీవేంకటేశ్వరా !
మాధవా ! మీరు అర్జునునకు సాక్షాత్కారమై యుండి భగవద్గీత లేడు నూఱు గ్రంధంబులు బోధించితిరి; విశ్వరూపంబుచూపి ప్రమాణంబుచేసి మిమ్మెఱుంగుమని యుపదేసించితిరి; ఇంక మముబోఁటి జీవుల నెన్నిట బోధింపవలయునో యందులకే చింతించెదను; అవులే; ఇంకొక యుపాయంబు విచారించుకొంటి; తొల్లి వాల్మీకి "రామా" యను రెండక్షరముల నుడివి బ్రహ్మర్షియై మీ కృపకుం బాత్రుండయ్యె; నారదుండు మీ సంకీర్తనంబుసేసి కృతార్ధుఁ డయ్యె; విభీషణుఁడు మీకు శరణుజొచ్చి బ్రదికె; నాకు నిదియే మార్గంబు; శ్రీ వేంకటేశ్వరా !
నందనందనా ! చేయంగల పాపంబు లన్నియుఁజేసితి; నా కర్మం బేమనుచున్నదో యెఱుంగను; దేవర్షి పితృతర్పణంబులు చేయకుంటిని; యమకింకరు లేమనుచున్నారో యెఱుంగను; ఎక్కడలేని యుద్యోగంబులు చేయుచున్నాఁడను; విధి యేమనుచున్నదో యెరుంగను; అన్నపానాదిభోగంబు లనుభవించుచున్నాఁడను; చిత్రగుప్తుఁడేమి వ్రాయుచున్నాఁడో యెఱుంగను; బాల్యకౌమార యౌవన గతులం బెరుగుచున్నవాడను; కాలంబేమనుచున్నదో యెరుంగను; ఇన్ని యపరాధంబులకు గురియైనవాఁడనగుటవలన నా భయము నివారింతువని నీమఱుంగు జొచ్చితి; చేయంగల విన్నపంబులెల్లఁ జేసుకొంటి; నీ చిత్తం బెట్లున్నదో యెఱుంగను; శ్రీవేంకటేశ్వరా !
ఆదిమూర్తీ! నేను భూలోకంబున నా కర్మంబు లనుభవింపం బుట్టితిగాని నిన్ను గుఱుతెఱింగి కొలిచెదనని పుట్టినవాఁడగాను; ఇంతలో నీవు నిర్హేతుకలీలం గరుణించి, నన్ను బంటుగా నేలితివి; నా భాగ్యంబు లేమని పొగడెద; నిన్నుంబొగడుటెకాక ! నేనేమితపంబు చేసితినో యది దలఁపనేల? నీ మహిమ దలఁచుటగాక! నాబుద్ధి నేమి మెచ్చుట ? నీ సంకల్పంబు మెచ్చుటగాక ! దప్పిగొన్న యతండు జలముల వెదకుచుండ భాగీరధి జలంబబ్బినట్లు, కృషికుండు తన చేనుదున్నుచో నాఁగటికొన బంగరు కొప్పెర దొరికినట్లు, పులిజూదంబాడెడువాండు ఱాలేఱుతరి మాణిక్యంబు చేకూడినట్లు నీవు నాకుం దొరికితివి; శ్రీ వేంకటేశ్వరా !
మత్స్యావతారా ! అవధారు ! దేవ, నాలోని పాపపురుషుండు విజృంభించి తఱుముకొని రాఁగా నీ మఱంగు జొచ్చితి; అంతలో నీ యభయదాన పురుషుండు వచ్చి యతనితో దారుణ యుద్ధంబు సేయఁ దొడంగెను; అరిష్డ్వర్గంబులనియెడి చుక్కలు డుల్లె ; తాపత్రయం బనియెడి పిడుగులు రాలె; చింతా సముద్రంబు గలంగె; నిర్దయ యనెడి ధరిత్రి వణఁకె; దుర్గుణంబులనియెడి దిక్కులు చలియించె; దురాశాపర్వతంబులు క్రుంగె; అతిఘోర సమరంబునఁ బాపపురుషుండు ఓడి పాఱె; మీయభయదాన పురుషుండు గెలిచె; ఈ మేలు వార్త మీకు విన్నవించితి; శ్రీ వేంకటేశ్వరా !
కమలనాభా ! నే నీవేగువాఁడనై విన్నపంబు సేయవచ్చితి ; ఏకాంతంబున విన నవధరింపుము; భువిలో శరీరంబనియెడి రాజు, చలంబనియెడు ప్రధాని, విషయంబులనియెడి కరితురంగంబులు, పాపంబులనియెడి వీరభటులు, కోరికలనియెడి కాపులు, రతిసుఖంబులనియెడి ధన ధాన్య భండారంబులు గలవు; ఈరీతిఁ గోటలోనివారలు ఆశలనియెడి నిశాసమయంబుల నేమఱి నిదురవోవుచుందురు; జ్ఞానంబనియెడి నీ యూడిగపు దొరతో నన్ను బుద్ధి వైరాగ్య శమ దమంబు లనియెడి బలము వెంటఁ గూర్చి యంపితేని ఆకోటగొని యందు ఠాణంబుండి పగవారినందఱను గెలిచి పట్టి తెచ్చి యప్పగించెద బంపు వెట్టవే; శ్రీ వేంకటేశ్వరా !
సుదర్శనధరా ! జీవులు సేసిన పాపపుణ్యంబులు చిత్రగుప్తులు వ్రాయుదురట; నామీఁద నేమి వ్రాయుదురో యెఱుంగను; నేఁ జేసిన పుణ్యంబులు మీకు సమర్పించితిని; పాపంబు సేయించిన యింద్రియంబులు మీముందటం బెట్టితి; మనంబు మీకు నప్పగించితి; భక్తి మీకుం గానుకగాఁ బెట్టితి; శ్రీ వైష్ణవుండనై మీ దాసుల మఱంగు సొచ్చితి; అన్నింట నా కొఱతలు దీర్చుకొంటిని; ఇంక నామీఁదఁ జిత్రగుప్తులు నిలువలు వ్రాయంబనిలేదు; ఇందుకు సాక్షియు నీవె; ఎఱుకయు నీవె; విన్నవించితి; శ్రీ వేంకటేశ్వరా !
రంగధామా ! నీవు నీటిపైఁ గొండలు దేలించిన బలవంతుడవని, కోతులచే రాజ్యంబు సేయించిన నేర్పరివని, రాతికి బ్రాణము ఇచ్చిన యుదారుండవని, కొండ గొడుగుగాఁ బట్టిన సత్త్వ సంపన్నుండవని, ఒక్క గజము మాట విని వచ్చి కాచిన భక్త సులభుండ వని ఆఁడుదాని మొఱ ఆలకించిన దయాళుండవని, ప్రహ్లాదుని ప్రతిజ్ఞ చెల్లించిన భక్త పరిపాలకుడవని, పదియాఱువేల నూట యెనుమండ్రు దేవుళ్ళకు అన్ని రూపులై వినోదించిన నెఱజాణవని నీకు మ్రొక్కితి; నిన్నుం గొల్చితి; భవంబులం గెల్చితి; సంతోషంబున నృత్యం బాడెదను; నిన్ను కొనియాడెదను;
శ్రీ వేంకటేశ్వరా !
రావణాంతకా ! నీవు దేవ సంరక్షణార్ధమై పాయసంబులోఁ బ్రవేశించి కౌసల్యా గర్భంబున జన్మించి తాటకాహరణంబును, సుబాహు రాక్షసవధయును, కౌశిక యజ్ఞ సంరక్షణంబును, అహల్యా శాపమోక్షణంబును, ధనుర్భంగంబును, సీతా వివాహంబును జేసికొని, పరశురాముఁడు మింటికిం గట్టిన త్రోవలు దెగనేసి దశరధుండు పట్టంబుగట్ట సమకట్టినఁ గైకేయిచేతఁ పదునాలుగేండ్లు అరణ్యవాసంబునకు మితి చేసికొనిన కారణంబేమి? అవులే; దశకంఠునికిఁ బదునాలుగేండ్లాయుశ్శేషము నాఁటికిఁ గలిగెఁ గాఁబోలును; తావత్పర్యంతమును, శూర్పణఖా నాసికాచ్ఛేదనంబును, మారీచ కబంధ ఖరదూషణాది హననంబును, వాలి నిబర్హణంబును, సుగ్రీవాదివరణంబును, వానర నియోగంబును, సముద్రబంధనంబును జేసి యంతట రాక్షససంహారంబు గావించి, లంక విభీషణునకిచ్చి సీతా సమేతుండవై యయోధ్యాపట్టంబుఁ గట్టికొంటివట! ఎంత కపటనాటకసూత్రధారివి? శ్రీ వేంకటేశ్వరా !
కేశవా ! నీవు విరక్తులకు మోక్ష సుఖంబవై యుందువు; ప్రాకృతులకు సంసారంబవై యుందువు; నిన్ను ధ్యానంబు సేయువారలకు సాకారంబవై యుందువు; ఇతరులకు మువ్వురిలో నొక్కండవై యుందువు; మూఢులకు నవేద్యుండవై యుందువు; దనుజులకు నహంకారంబవై యుందువు; దేవతలకు బ్రహ్మపదంబవై యుందువు; ఈ రీతి వారివారికిఁ దగినట్లు నీరుకొలఁది తామరవై యుందువు; ఓపినవారి కోపినంత భాగ్యంబవు; నీకు శరణన నేర్చినవారిని నీవే రక్షింతువు; నీవలనఁ గొఱఁత లేదు; శ్రీ వేంకటేశ్వరా !
అచ్యుతా ! మిమ్ము నేమియు నడుగ ననియెడు నహంకారంబు గల వాఁడఁగాను; మీ పనుల యెడ నపరాధంబు లేకుండెడు నట్టు కొలుతుననియెడు గర్వంబు గలవాడంగాను; మిమ్ము నమ్మితినని సారెసారెకుం గొసరెడివాఁడఁగాను; మీకు విశ్వాసి నని యెమ్మెలఁ బొరలెడివాఁడఁగాను; వేద శాస్త్రంబు లెఱుంగుదునని పెద్దల ధిక్కరించెడువాఁడఁగాను; అక్రమాచారంబులు చూపి యుత్తమలోకంబులు చొరఁబాఱి సరిగెల్పు నెరపెడివాఁడఁగాను; మీమీఁది భక్తిగలదని బలిమి చూపెడివాఁడఁగాను; శేషత్వ పారతంత్ర్యముల మఱుఁగున నిల్చి మిమ్ము సేవించు మీదాసానుదాసుండ నని యెఱుంగుమా ; శ్రీ వేంకటేశ్వరా !
భుజగేంద్రశయనా ! లక్ష్మీసమేతులై యేమేమి సేయుచుంటిరో మీ యవసరం బెఱుంగక మిమ్ముఁ దలంపరాదు; రుక్మిణీదేవితో నెత్తంబు లాడెడువేళ ద్రౌపది "హాకృష్ణా" యని తలంచిన అక్షయం బని పాచికలు వైచితిరట; కరీంద్రుడు మిమ్ముం దలంచిన వైకుంఠభోగంబులటువెట్టి వచ్చితిరట; ప్రహ్లాదుండు కంబంబునం జూపెద ననినఁ జించుకొని వెడలితిరట; ఈ రీతి మీ చరిత్రంబులు విన వెఱఁ గయ్యెడిని; మీవేళ చూడక తలంచిన నపచారంబుగదా ! మీయంత మీరెప్పుడు నన్ను మన్నించవిచ్చేయుదురో యని మీ శ్రీ పాదపద్మంబులచప్పుడు నాలకింపుదును; మీకై నే నేవేళనైనను హృదయంపువాకిళ్ళు గాచుచుండెద; శ్రీ వేంకటేశ్వరా !
పరంధామాధిపా ! మీ మహిమసముద్రమునకుఁ గారుణ్యంబు జలంబు; మీకళ్యాణగుణంబులు తరంగంబులు; మీనిగ్రహానుగ్రహంబులు తిమితిమింగిలంబులు; మీ శ్రుతులు ఘోషంబులు; మీ గంభీర్యంబు లోఁతు; మీ ప్రతాపంబు బడబానలంబు; మీ కపటనాటక వ్యాపారంబులు మకరకచ్చపాది జంతువులు; ఇట్టి మీ మహిమసముద్రంబు మీ దాసులు మిమ్ముఁ గూడి తరవఁగాను భక్తియను కామధేనువు వొడమెను; జ్ఞానంబనియెడి చంద్రోదయంబాయె; ఆనందంబనియెడి యైరావతంబు, సాత్త్వికంబనియెడి పంచతరువులు, అనంతనామంబులనియెడి యప్సరః స్త్రీలు; తిరుమంత్రంబనియెడి యమృతంబునుంబొడమె; మీయష్టాక్షరామృత మనుభవించుచున్నాము; శ్రీ వేంకటేశ్వరా !
కాలాంతకా ! బ్రహ్మాండకోట్లఁ గుక్షింబెట్టుకొన్న నిన్ను గర్భంబున మోచెనట దేవకీదేవి; విశ్వరూపుండవైన నిన్నుఁ గౌగలించుకొన్నారట గోపికలు; సర్వతో ముఖుండవైన నిన్ను ముద్దాడెనట యశోద; అపరిమిత బ్రహ్మంబైన నీకు ద్వారకానగరంబు గట్టెనట విశ్వకర్మ; సర్వవ్యాపకుండవైన నీకు రధముఁ గడపెనట దారకుండు; అనంతనామంబులు గల నీకు నామకరణంబు చేసెనట గర్గుండు; వేదాంతవేద్యుండవైన నీకుఁ జదువు చెప్పెనట సాందీపుండు; ఇది యెటువంటి యద్భుతంబు? విన నగోచరంబయ్యెడిని; అట్లేకదా, నీకంటె నీదాసు లధికులౌట తేటపడె; శ్రీ వేంకటేశ్వరా !
జగదేకవీరా ! నాయుర్ధాతురత్నంబున నిన్ను "దైవమా" యని దూఱి సొలసితి; ఐశ్వర్యగర్వంబుచేత మీ గుళ్లముందఱ వాహనంబు దిగనైతి; మీ సన్నిధిని దాంబూలచర్వణంబులు చేసితి; బాల్య యౌవన కౌమార గతులచేత మీకు మ్రొక్కనైతి; మఱియును గొన్ని యేమియపరాధంబులు చేసితినో? నేఁ జేసిన యపరాధములకు క్షామకముగానిప్పుడే మీ తిరుమంత్రోచ్చారణంబు చేయుట చేతను చంచలత్వంబు విడిచి చిత్తము శాంతమునం బొందె; మీరే పరతత్వంబని తెలిసి శరణాగతుండనై మీ దాసులలోఁ జేరితిని; నేఁ జేసిన యపరాధములకుఁ బరిహారముగా మిమ్ము నాకుం జాటి చెప్పిన యాచార్యుల శ్రీపాద తీర్ధ విశేషములకుం జేయొగ్గెద; మీదాసుల పాదరక్షలు మోచెద; మీదాసానుదాసుల సేవకుండనయ్యెద; మీదాసదాసీ జనంబులకు నీళ్ళు మోసెద; మీ లెంకలకు లెంకతనంబునఁ జొచ్చి యచ్చువేసుకొనియెద; నాసర్వాపరాధంబులు క్షమింపవే; శ్రీ వేంకటేశ్వరా !
లంకాపహారీ ! వైష్ణవజ్ఞానం బనియెడి యంజనంబుచేత నీ వనియెడి నిధానం బెత్తికొంటి; అదియునుంగాక నీపై భక్తి యనియెడి నావచేత సంసారసముద్రంబు దాఁటి వైరాగ్యంబనియెడి పదార్ధంబు నీకు సుంకంబు వెట్టక బలిమిందెచ్చుకొంటిని; నీ పాదంబులమీఁది తులసీమాలికచేత నజరామరపదంబుఁ జాఱగొంటిని; ఇవి నా దుర్జనకృత్యంబులు; నీవు భూమీశుండవు; కనుకఁ నీవునన్నుఁ బ్రమోషంబు సేయక యున్నప్పుడే విన్నవించితి; నేఁజేసిన చేఁత లివి; ముందఱ నీచిత్తం బెట్లుండునో? ఇదిగో నీకు విన్నవించితిని, మఱవక విన నవధరించి రక్షింపవే; శ్రీ వేంకటేశ్వరా !
ముచికుంద ప్రసన్నా ! సంసారధర్మంబులనియెడు నంగళ్ళ లోపల నీతి సంగతులనియెడు వ్యవహారులు కోరిక లనియెడు సరకులు పచరించుకొని అగ్గువతో నమ్మఁగా నేను బహుళంబుగా సంపాదించుకొంటిని; ఆ కోరికలను నొడిఁగట్టుకొని యనుభవించ వేడుకయగుచున్నది; నిన్ను ధ్యానంబు సేయంజనదు నా మనస్సు, క్రొత్త కోడెవంటిది; జ్ఞానంబనియెడు కంబంబునఁగట్టి వైరాగ్యంబనియెడు సాదుపసరముతో లంకెవైచి నీ కృషికి దిద్దుకొనవే;శ్రీ వేంకటేశ్వరా!
హిరణ్యగర్భా ! నీకుఁ బాన్పైన శేషుండు బ్రహ్మాండం బెత్తుకొనియె; నీకు వాహనం బయిన గరుత్మంతుం డమృతంబుఁ గొని చనియె; నీ కూఁతురైన గంగాభవాని హరు శిరస్సునెక్కె; ధ్రువుండు బ్రహ్మలోకంబు అతిక్రమించె; నారదుండు సురలకుఁ బోరువెట్టుచున్నాడు; రుక్మాంగదుండు యమలోకంబుం బాడుచేసె; శుకుండు వైరాగ్యంబు చూఱఁగొనియె; ఎందుచేతో నీదాసులు నీకంటె నధికులౌట తేటపడియె; శ్రీ వేంకటేశ్వరా !
రామ రామ ! లోకంబెల్ల నొకపాదంబునఁ గొల్చితివట; నీ రూపంబేమని చెప్పుదును? అనంతవేదంబులు నిన్నుం బొగడునట; నీ గుణంబులెన్నియని యెన్నుదును? నీ రోమకూపంబుల నజాండకోట్లు నిండుకొన్నవట! నిన్ను నేమని వర్ణింతును? నీవు సర్వ దేశ సర్వ కాల పరిపూర్ణుండవై యుండఁగాను నీప్రభావం బేమని పొగడుదును? పురాణ పురుషుండవట; నీతుద మొదళ్ళెఱుంగువారెవ్వరు? నిన్నుఁ దెలియ నుద్యోగంబుఁ జేసెద. నా యాసలేమని చెప్పుదు ? నంతయు నీ వెఱుంగుదువు; శ్రీ వేంకటేశ్వరా !
శరణాగతవజ్రపంజరా ! నీవు లోక సంరక్షణార్ధంబై నీస్వతంత్రంబున నెత్తిన రామావతారంబున నీ శక్తిని నీవె యెఱుంగవని యందురు గొందరు. హరివిల్లు నెక్కుపెట్టి విఱిచినదియును,పరశురాముఁడు గడియించిన స్వర్గ సోపానఁబులం దెగవ్రేసినదియును, సుగ్రీవునికి వాలింజంపెదనని ప్రతిజ్ఞ చేసినదియును, శరణుసొచ్చిన విభీషణునకు మున్నుగా లంకారాజ్యంబునకుఁ బట్టంబు గట్టినదియును, సీతను వెదకంబోయిన వానరులలోన హనుమంతుచేతికి నుంగరం బొసంగినదియును, జలధిపై విల్లు దొడిగినదియును, నీ భుజబలిమియుకాదె ! నీ ప్రతాపంబు నీ వెఱుంగని దేమి? నీవు సర్వజ్ఞుండవు; నిన్ను నెరుంగనివారలె యజ్ఞులు గాక! శ్రీ వేంకటేశ్వరా !
కౌసల్యానందనా ! ఈ మనుష్య జన్మంబు నీవె నా కొసంగి పుట్టించితివి. ఇది నా కిచ్చిన వారకపు శరీరము. ఇందుల యాభరణంబులు, నన్నపానాది భోగంబులు, నీ కరచరణాద్యవయవంబులు చేసిన పుణ్యపాపంబులు నీకె సెలవు; నే నేమిటివాఁడను ? అణుమాత్రపు జీవుండను; ఈ తనువు నామీఁద నదనంబు వెట్టితివి; రాచముద్రకుంబెట్టిన లంచంబు రాజునకు సమర్పణంబె కాదా ! అది యెట్లంటివా ? ఆత్మ నీవుండెడి నెలవు; నీవున్నచోటను నూటయెనిమిది తిరుపతులును సకల పుణ్యక్షేత్రంబును నుండును; నాకు అజ్ఞానంబు లంటనీయకు! శ్రీ వేంకటేశ్వరా !
సుగ్రీవ రాజ్యస్థాపనా ! నే నొకవేళ నీ దాస్య మనెడి గజస్కంధమం దారూఢుండనై చరియింతు; మఱియొకపరి నీవు నాకుం గలవనియెడి విశ్వాసం బను తురంగంబునెక్కి యాడెదను; ఇంకొకప్పుడు మీ కధలు విని యానందరధంబుపై విహరింతును; ఆ తర్వాతను వినయవిధేయవర్తనంబు లనియెడి చరణ త్రాణంబులతోడఁ బదాతినై మీ యవసరంబు గాచుకొని ముందఱఁ గొలువు చేయుదును; ఈ రీతి చతురంగబలములతోఁ దోడుసూపంగల బంట నీకు; నామీఁద నేమి యపరాధంబు గలిగిన నోర్చుకొనుము; శ్రీ వేంకటేశ్వరా !
ఆనందనిలయా ! మిమ్ము దర్శించు సమయంబున నొక కానుక గావలసి యపూర్వ వస్తువెట్టిదో యని వెదకి వెదకి మఱియుఁ గొందఱనడుగంగాను, వారలొండేమి యడుగుచున్నాఁడవని హుంకార ధిక్కారంబులచేత భర్జింపఁగాను వారలం దిరిగి కోపింపక యందులకు నొదిఁగి శాంతి గైకొని వర్తించితి; అంత నీ కామక్రోధ విరహితంబయిన శాంతమే ఆ యుత్తమ వస్తువని నా మనోవీధిం గంటిని; అది నీకుఁ గానుకగాఁ దెచ్చితిని; అది యమూల్యము; తులాభార హిరణ్యగర్భాది మహాదానంబు లిందులకు సరిగావు; అష్టాంగయోగంబుల సిద్ధులు నిందులోనే యున్నవి; తపంబునఁ బొందెడు మహిమయును దీన సిద్ధించును; నీ విందులకు సంతోషింతువని యిది మేలైన వస్తువు గనుక సర్వేశ్వరుండ వయిన నీ ముందరం బెట్టక పోరాదని సమ్ముఖంబున నిల్చితిని; నా హృదయంబనెడి భండారంబులోఁ బెట్టి పదిలంబుగా దాఁచుకొనుము; శ్రీ వేంకటేశ్వరా !
జ్యోతిర్మయా ! నా కాఁపురంబు నీకు విన్నవించెద; మా పెద్దలు గడియించిన పూర్వాచార్యోక్త గ్రంధంబు లనియెడి వృత్తులు గలవు; అవి పలుమారు ద్రవ్వి త్రవ్వి నానాదేశంబుల శ్రీ వైష్ణవుల కృపలనియెడి పంట కాల్వలఁ బాఱించుకొని వ్యవసాయంబు సేసి ముందరగా నీకైంకర్యమనెడి మొలకలను విత్తి పైరుకొల్పి నీ యనుగ్రహ మనుకొల్చు పండించి మనస్సనియెడి కణఁజంబునం బెట్టితి; భాగవత ధర్మంబు లనియెడి పాఁడిపశువులను బరిపాలించుకొనుచుంటిని; నీ ధర్మంబున సుఖంబునున్నాఁడను; దీన నిఁక నీ సారూప్యంబనియెడి ధనంబు గడించుకొనంగలను; శ్రీ వేంకటేశ్వరా !
శంఖపాణీ ! నా దేహం బొక నెత్తపుంబలక; నా పంచవింశతి తత్వంబులు సారెలు; నాయుచ్చ్వాశనిశ్వాసంబులు పాచికలు; నా పుణ్యపాపంబులు పన్నిదంబులొడ్డిన ద్రవ్యంబులు; ఈరీతిఁ దన్నుకాడెడి జూదగాఁడను; నీ మాయతో నింతగాలము నాడియాడి యోడి మఱి యొక్కొక్కజన్మంబునను మగుడ నూడుగొని యీ యాటలె యాడుచున్నాఁడను; గెలుపెట్టిదో, యెప్పుడో యెఱుంగను; నీవు నన్నేలిన యేలికవు; బంటు జయించిన జయము ఏలికదే కదా! నాకుంగాను సూడువెట్టి గెలిపింపుమా ! శ్రీ వేంకటేశ్వరా !
అభేద్య విక్రమా ! కన్నులు మూసిన లయంబును, దేఱిచూచిన జగంబును, మేలుకొనిన నందు జననంబును, బరస్త్రీగమనంబున నరకంబును, స్వపత్నీసంతానంబున స్వర్గ నివాసంబును, క్రోధంబున రాక్షసత్వంబును, ననాచారంబునఁ బాపంబును, నాచారంబునఁ పుణ్యంబును, నసత్యంబునఁ గీడును, సత్యంబున మేలును, నీరీతి నందఱకుఁ గానవచ్చు; మఱపు పుట్టించుచున్నది నీ మాయయే యని యీ యర్ధంబెఱుంగుదురుగాని భ్రమయనిన వారులేరు. ఇంతగాలంబున నే నెత్తిన జన్మంబులుం గోటానగోట్లు గలవు; అన్నియు సంసారంబునకే సమర్పణంబయ్యెఁగాని యిందులో నొక జన్మమైనను మీకు సమర్పణంబు గాదయ్యె; దేవా, యింక నా నేరంబు లెన్నియని యెంచెద ! గతజలసేతుబంధనంబు; అట నీమాయ నిగ్రహించెద ననిన నది యశక్తి, దుర్జనత్వంబు; నా మూఢత్వంబు చూచి యీ జన్మంబున నీవే దయదలఁచి నన్ను దాసునిఁగాఁ జేసితివి; నీకు ఉపకారంబు దక్కెను; నా మనోరధంబు నీడేరెను; శ్రీ వేంకటేశ్వరా !
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ! సకల ప్రాణుల శరీరంబులు నీకు క్షేత్రంబులు; నీవు క్షేత్రజ్ఞుండవు; జీవులు నీ కమతీలు; ఇంద్రియంబులు నీకు నేరు కలపలు; ఇహపర సౌఖ్యంబులు కాఱువేసంగిపంటలు; దేహానుభవంబులు నీవు వెట్టెడి జీతంబులు; లోకులు చేసిన ధ్యానానుష్ఠానఫలంబులు కొల్చు భండారంబులు; ఈరీతి ముందరికిని నందఱ హృదయంబులను జ్ఞానభక్తి వైరాగ్యంబులనియెడి బీజంబులు మొలవంబెట్టింపుము; తొల్లి బలభద్రరాముండవై నాఁగలి ధరియించి దున్ని కాళింది కాలువలు దీర్చితివట ! శ్రీ వేంకటేశ్వరా!
అసురకులసంహారకా ! నేను జన్మం బెత్తి వయో మదోద్రేకంబున యుక్తాయుక్తంబు లెంచక మనస్సుం బాఱవిడిచి నానా భోగంబులనుభవించి యందువలనఁ పుణ్యపాపంబుల యిఱుకునం జిక్కి కర్మబద్ధుండనై విడిపించుకొన శక్తుండఁగాక బందెదొడ్డిం జిక్కిన పసరంబువలెను, పాశమునం బడిన మర్కటంబు పగిదిని, జోగిచేతం జిక్కిన సర్పంబురీతిం, బసిరికాయలోని కీటంబువలె, నుండి నీవు సర్వలోకనాధుండ వగుటంజేసి విన్నవించితిని; నే నీకుం దగులైనవాఁడ నగుట నీవు నన్నుఁ గరుణించి నీ ముద్రవేసి నీ దాసునిఁగాఁ జేసుకొంటివి; ఈ సంతోసంబున నిన్నెంతయుం గొనియాడెద; ఓహో దేవరా ! శ్రీ వేంకటేశ్వరా !
అమృతమధనా ! మహాపురుషులు మిమ్ముంగోరి యతి ఘోర తపంబులు సేయువేళలఁ దేహంబులం గూళ్ళం బెట్టునట; ఇటువంటి నియమంబున మిమ్ము నే నెట్లు ధ్యానంబుచేసి బ్రత్యక్షంబు సేసికొని మెప్పించెద? ఇంతలేసి పనులకు సమర్ధుండనా? మీకుఁ జేతులెత్తి మ్రొక్కంగలవాఁడ నింతేకాని; తొల్లి మీరు రామావతారంబైన వేళ వనంబున సంచరించునప్పుడు, కృష్ణావతారంబైన వేళ నందవ్రజంబున సంచరించునప్పుడు పాషాణతృణగుల్మ లతాదులు మీ పాదంబులు సోఁకి పావనంబయ్యెనట! అవి యే తపంబులు చేసినవి? మాకు మీ శ్రీపాదములే గతి; శ్రీ వేంకటేశ్వరా !
వైజయంతీవనమాలికాధరా ! ఈ బ్రహ్మాది దేవతల యైశ్వర్యంబులు నీ దేవుల కటాక్షవీక్షణంబులోఁ గించిన్మాత్రంబువలనం బొడమినవి; మహాపురుషుల మహాత్మ్యంబులు నీవిచ్చు వరంబులలో లవలేశంబులు; అన్ని చదువుల ప్రభావంబులు నారాయణాష్టాక్షరంబులలోని సహస్రాంశంబులు; ఉత్పత్తి స్థితి లయంబులు నీ మాయాశక్తి సంకల్పమాత్రంబులు; నీ మహామహిమలం దెలియ నెవ్వరివశము? అగోచరములు ! తర్క వాదముల కభేద్యుండవు ; భక్తులకు సులభుండవు; నిన్ను నీవే యెఱుంగుదువు గాక! యితరులకు నెఱుఁగదరమా ; శ్రీ వేంకటేశ్వరా !
నరకాసురవైరీ ! ఈ కల్పంబున బ్రహ్మదేవునికి నేఁబదియేండ్లు చెల్లెనట ! అతని యొక్క దివసంబున స్వర్గంబునఁ బదునలువురు దేవేంద్రు లేలుదురట ; ఇప్పుడు ఏడవ దేవేంద్రుఁ ఏలుచున్నాడుట; నేను నాఁటనుండి యెన్ని జన్మంబు లెత్తితినో? యేయే జాతులం బుట్టితినో ? నేను మనుష్యుండనని చెప్పుకొను టెట్లు? పుట్టువులు వేఱు గాని యప్పటి జీవుండనే నేను ; ఇప్పుడు బ్రాహ్మణజన్మంబునం బుట్టించి శ్రీ వైష్ణవునిం జేసి యేలితిరి; నా యంత నే నెఱింగి మీకు విన్నపంబు చేసిన వాఁడఁగాను; నాకుఁగా వేఱొకరు మీతోఁ బంతం బాడి యొడంబఱచినవారు లేరు; మీయంతనే మీరు దయం దలఁచి నన్నుం బావనంబు చేసితిరి; మీరు నిర్హేతుక దయానిధులౌట యిందులోనే విశదంబాయె ; శ్రీ వేంకటేశ్వరా !
సోమకాసుర భంజనా ! భూమిమీఁద పండి నానాధాన్యంబులుఁ గొండలు కోట్లునై కుప్పలుపడుచున్నవి; సస్యంబులకు బీజంబు లొక్కటియును ఫలంబు లధికములునై యున్నవి ; ఇంత సామర్ధ్యంబా బీజముల కెక్కడిది? మీ మహిమకెకాక; మీరు గలుగుటకిది లోకదృష్టాంతంబు ; మిమ్ము నితరు లెఱుంగరానియట్లు నీవు గానరాదాగెదరు; మీ రెటువలెనుండినను, వేదశాస్త్రంబులు మిమ్ముఁజాటి చెప్పకేల మానెడివి? మహాత్ములైనవారు మిమ్ము నెఱింగి కొలువ కేల మానెదరు? మీ కరుణ యిందఱిమీఁదఁ బాఱ కెట్లుండెడిది? మీ దివ్యతేజఃప్రకాశంబు లెటువలె మూసి పెట్టవచ్చు? చాలుంజాలు నింక మీ వినోదంబులు బయలుపడెను; విభాండకునికిఁ బ్రత్యక్షంబైనయట్లు, ముచికుందునకిఁ బ్రత్యక్షంబైనయట్లు, ఉదంకునకు బ్రత్యక్షంబైనట్లు నాకు మీరు ప్రత్యక్షంబుగండు; శ్రీ వేంకటేశ్వరా !
అయోధ్యా పురాధీశ్వరా ! యేరీతి మనస్సు పట్టుదునో యే చందంబున మెప్పింతునో యేరీఁతి గృప నామీఁదం బాఱునో యెటువలె నా కభిముఖము చేసికొందునో యేక్రమంబున మీకుఁ జనవరినై బ్రదుకుదునో యని మానసంబునం గోరుచుందును; నీవు నా యంతరంగంబులోఁ జేరువనే యున్నాఁడవు; బ్రహ్మాది దేవతలకు దుర్లభుండవైన నీవు నాకెట్లు సులభుండ వయ్యేవంచుఁ జాతక పక్షులు మేఘంబులలోని జలంబుల కాశపడినయట్లు, ఆకాశంబున నున్న సూర్యునితోఁ గమలంబులు చుట్టఱికంబులు చేసినట్లు, చంద్రోదయంబునకు సముద్రంబు పొంగినట్లు,వెన్నెలకుఁ జంద్రకాంతంబులు గరఁగినట్లు నేను మీదర్శనంబునకు వీక్షింపుచున్నాఁడ ; అయితే నేమి కొఱంత? ఊరకున్న కీటంబుఁ దెచ్చి తుమ్మెద తనుఁ జేయుచున్నది; ఈ భ్రమరకీట న్యాయంబు దక్కింప నింక దేవర చిత్తము, నా భాగ్యము ; శ్రీ వేంకటేశ్వరా !
వాసుదేవా ! దేవకీనందనా ! గోపాలమూర్తీ ! లక్ష్మీ మనోహరా ! భూకాంతప్రియా ! గోపికావల్లభా ! రుక్మిణీ ప్రాణనాయకా ! సత్యభామా మనోహరా ! జాంబవతీ సుముఖా ! కాళిందీ సరససల్లాపా ! మిత్రవిందాభోగాలోకైకరతా ! భద్రాకుచకుంభవిహారా ! నీ రాసగ్రహాది సరస సత్కధా ప్రసంగంబులు భాగవత పురాణంబులు; ఈ కధలు విన్నవారికిఁ బుణ్యంబు లనంతంబులై పరలోకసాధనంబు లగునట ! యివి యెటువంటి విచిత్రంబులు! నీ కౌతుక క్రీడలు మోక్ష సాధనంబులట ! శ్రీ వేంకటేశ్వరా!
ధృవవరదా ! నాకు నెటువలెఁ బ్రత్యక్షంబయ్యెదవో ? విభుని రాకకుం గాచుకొన్న విరహిణి చందంబున మీ రాకకు నెదురు చూచుచున్నవాఁడ; చన్నుఁబాలకు దేవుఱు స్తనంధయుని బోలి మీ భుక్తశేషంబు వెదుకుచున్నవాడ; పొలముననుండి మేసివచ్చు ధేనువు రాకకుఁగ్రేపుచందంబున మీ దేవుల కటాక్షంబునకు నేఁకారుచున్న వాఁడ ; హంసతూలికా తల్పంబుమీఁద శయనించు రాజురీతి మీ పాదంబులకు సాష్టాంగంబు సేయం గాచుకొన్నవాఁడ; నివి నాగుణంబులు ; అపేక్షించినవారి నుపేక్షింపరాదని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు ; అది యట్లుండనిమ్ము ; ఏలిక మన్నించుకొలఁదినేకాని బంటునకుం గొసరఁగా నడుగరాదు ; నీవు నా హృదయంబున నెప్పుడును నేమఱకుమా ! అన్నియు సమకూఱెడు; శ్రీ వేంకటేశ్వరా!
హలాయుధధరా ! మన్మధుం డనియెడు నింద్రజాల విద్యలవాఁడు సుందర స్త్రీ పురుషులచేత నింద్రజాలవిద్యల నాడింపుచున్నవాఁడు ; అన్యోన్యావలోకంబుల కమల కల్హార పుష్పంబులు గురియింపుచున్నవాఁడు; మోహ సముద్రముల నాకర్షించి బట్టబయల యీఁదింపుచున్నాఁడు ; తుఱుమునఁ జీకట్లును ముఖంబునఁ జంద్రోదయంబును గాత్రంబున మొయిలు లేని వానలును పరస్పర విహారంబుల నగ్ని స్తంభనలును రతిబంధంబుల సిద్ధ విద్యలునుం జూపుచున్నవాఁడు ; ఈ యాటలకు లోనై సమ్ముఖంబులనున్న జీవులము మిమ్ము నెఱుంగ వెఱంగందుచున్నవారము ; గాని, నీ మాయలకు లోనుగాక చిఱునవ్వుతో వీక్షింపుచున్నవాఁడవు ; ఆతని కీవిద్యలు నేర్పిన గురుండవు నీవె కాఁబోలుదువు; నీకు వినోదంబైన నాయెఁగాని మమ్ము భ్రమయింపకువే ; శ్రీ వేంకటేశ్వరా !
ఖరదూషణవైరీ ! నీవు కల్పించిన వేదోక్త ధర్మంబు లించుకంత దప్పకనడచెనా పాపంబులు చెందవు; అటమీఁద పరకాంతలు పరధనంబులు వేడుక పుట్టించుచు ముందఱఁ బొదలంగా జీవులము చంచలచిత్తులము గనుక నా పాపంబులం దగిలి చేయక మానలేము; చేసిన కర్మంబులు బలవంతంబులు ; అనుభవింపక తీఱదు ; దాన మాకు సౌఖ్యంబుగాదు. మేము గావించు నేరములు మామీఁద నుండంగాను మీకు నేమి విన్నపంబు చేసెదము? మీ యాశ్రయ మనియెడి వజ్రపంజరమున్నది; మీ నామస్మరణ మనియెడి ఖడ్గమున్నది; మీపై భక్తి యనియెడి కవచమున్నది; మీకృప యనియెడి సహాయంబున్నది; నా యాచార్యులచేత సకల మీదురితములను గండలుగాఁ గొని తునియలుచేసి పాఱవేయించెదవో కాక నీవే మాపై దయదలంచెదవో ; శ్రీ వేంకటేశ్వరా!
చాణూరమర్ధనా ! మిమ్ముం బేర్కొని పిలిచి యావాహనముచేసి మా యింటిలోపల బీటపై బెట్టి పూజించుచున్నవాడను; సముద్రుని కర్ఘ్యపాద్యాచమనీయంబుల నిచ్చినట్లు మేరుపర్వతంబునకు భూషణంబులు పెట్టినట్లు మలయాచలంబునకు గంధం బొసంగినట్లు వసంతునికిఁ బుష్పంబులు సమర్పించినట్లు కస్తూరి మృగంబునకు ధూపం బిచ్చినట్లు సూర్యునికి దీపారాధన చేసినట్లు అమృతపదుండవైన నీకు నై వేద్యంబిచ్చినట్లు నీరీతి మిమ్ము నలంకరించి యర్చింపుచున్నవాడ; నా చేఁతలకు మీరేమని నవ్వుచున్నారో లజ్జింపక యుపచరింపుచున్నాఁడను; అయినం గానిమ్ము; తొల్లి, మీరు కృష్ణావతారంబై యుండెడువేళ మిధిలానగరంబున శృతదేవుండనియెడి బ్రాహ్మణుండు మిమ్మింటికిఁ దోడ్కొనిపోయి పూజింపఁడె ? మత్స్యావతారంబైన నాఁడు సత్యవ్రతుండను రాజు అర్ఘ్యము సమర్పించి మీరూపు దర్శింపండె? కుబ్జ మీకు గంధంబు లొసంగి సౌందర్యంబు వొందదె? మాలాకారుడు పువ్వులదండ లొసంగి మీచే మన్ననలు చేకొనఁడె ? విదురుండు విందువెట్టి వెలయఁడె ? ఇవి చూచి మాకుఁ గొంచింపం బనిలేదు; నీవు భక్త సులభుండవు, మే మేపాటి యారాధించినం జేకొందువు ; శ్రీ వేంకటేశ్వరా !
దేవచూడామణీ ! నీ పట్టినవి శంఖచక్రంబులు, ఎక్కినది గరుడవాహనము, తాల్చినవి చతుర్భుజంబులు, నీవు కావించిన కృత్యంబులు కంస కాళియ ముర నరకాసుర మర్ధనంబులు; ఇటువంటి నీవు నీలమేఘశ్యామవర్ణంబుతో విష్ణుస్వరూపుండవై నటియింపుచుండఁగాను నిన్నుఁజూచి దేవకీ వసుదేవులు నెటువలె భ్రమిసిరి? తపంబుసేయుచుండెడి వ్యాసవాల్మీకాది మునీంద్రులు మిమ్ముం జిక్కించుకొని మోక్షం బడుగ నేరీతి నేమఱిరి? శాస్త్రంబులు చదువుచుఁ బరబ్రహ్మంబును వెదకెడి బ్రాహ్మణోత్తములైన విద్వాంసుల వివేకంబు లెందువోయె ? బ్రహ్మేంద్రాది దేవతలు మిమ్ము సేవించి మీ సాయుజ్యంబుఁ బొందరైరి; వారిభాగ్యంబులెక్కడనుండె? అది యట్లుండనిమ్ము; అనాది దేవుండవై యిప్పుడిందఱి హృదయంబులలో నున్నాఁడవట ! నిన్ను భావించి మఱచియున్నారము; శ్రీ వేంకటేశ్వరా !
వరాహావతారా ! నిన్ను వెదకి వెదకి వేసారితిని; నీవు పుట్టించిన బ్రహ్మాండంబునకు నమస్కారంబు; అట్టి బ్రహ్మాండమునకు నాధారంబయిన నీ రోమకూపంబునకు దండంబు; అజాండములోని నీ విశ్వరూపంబునకు సాష్టాంగంబు; నీ తిరుపతులకు వందనంబు; చరాచరంబైన నీసృష్టికి నభివాదనంబు; నీ రూపంబులయిన విగ్రహంబులకు మోడ్పుఁగేలు; నీ యంతర్యామిత్వంబునకు జోహారు; నీవున్న శేషాచలంబునకు వందనంబులు సేయుచున్నవాడ; అందున్న నీ మూర్తికి శరణు; నన్ను నీ కరుణాదృష్టి నవలోకింపుము; నా యజ్ఞానంబు చెఱుపుము; నీ పాదంబులపై భక్తి నాకెల్లప్పుడుం బాయకుండఁ జేయుము; శ్రీ వేంకటేశ్వరా !
అమిత కల్యాణగుణాకరా ! జాతికులశీలవిత్తంబులచేత నాకు గర్వంబు రేఁపుచున్నది నా చిత్తంబు; దీనికి బుద్ధిచెప్పుము; నాకు వశంబుగాదు; లోకంబులో వర్తమానంబు విచారించి చూచిన దాసీజనంబులకుం జెల్లునే యహంకారంబు; షండునకు వచ్చునే కామోద్రేకంబు; కార్యాతురునకుఁ గూడునే లోభంబు; దీనున కున్నదే బలిమి; ఆఁకొన్నవాని కుండునే మదంబు; అశక్తునకు వెలయునే మత్సరంబు; ఇటువంటి వారికెల్లను వారివారికి నాయాగుణంబులు సహజంబులు చేసి యిప్పించితివి; ఇవియెల్ల అసంభవబ్రహ్మచర్యంబులు; అందులకేమి? నాకు నీ దర్శనంబు చూపి నా స్వతంత్రంబున నాతపోరాజ్యం బీడేర్పుము; నీవెట్లు చేసిన నట్లౌను,నీవు నాలోపల నున్నవాడవు;శ్రీ వేంకటేశ్వరా !
అధోక్షజా ! ఎవ్వని రోమంబున నజాండకోట్లు వొడమె; నే మూర్తి నాభికమలంబున బ్రహ్మ జనించె; నే మహాదేవుని పేర"శ్రీమహావిష్ణోరాజ్ఞయా" యని మహా సంకల్పంబు చెల్లుచున్నది; ఏవస్తువుఁ బురాణపురుషుండని చెప్పెదరు; ఏ బలవంతుని దానవవైరియండ్రు; ఏఘనుండు సముద్రంబుద్రచ్చి యమరుల కమృతంబు పంచిపెట్టె; నేపురుషునకు ప్రహ్లాద నారద వసిష్టాదులు దాసులు; ఏ ఘనునకు సూర్యచంద్రులు కన్నులు; లక్ష్మీపతి యెవ్వండు; సర్వరక్షకుండెవ్వండు;యజ్ఞకర్త యెవ్వండు;యజ్ఞభోక్త యెవ్వండు; మోక్షంబియ్యఁ గర్తయెవ్వండు; అతండవే నీవు; అట్టి నీకు అనంతనమస్కారములు సేసెద; చిత్తావధారు; శ్రీ వేంకటేశ్వరా !
యోగేశ్వరా ! పరమజ్ఞానులైనవారికిఁ గామ క్రోధ లోభ మద మాత్సర్యంబు లుడంగవలయు; అవి యెటువలెనుడగవచ్చు? ఎండ నుండిన యతండు నీడకుం బోవఁదలంచిన నదియె కోరికయయ్యెడిని; ఈఁగ తన మీఁద వ్రాలినం జోఁపుకోఁగణంగిన నదియె క్రోధం బయ్యెడిని; తనమంత్ర మొరులకుం జెప్పకుండిన నదియె లోభంబయ్యెడిని; పరులు దండంబు వెట్టినవేళ దీవించిన నదియె మోహంబయ్యెడిని; బిక్షాన్నంబు భుజియించి తృప్తిబొందిన నదియె మదంబయ్యెడిని;శిఖ లోపల బేలు దిరుగం గ్రోకికొనిన నదియె మాత్సర్యం బయ్యెడిది; యీధర్మంబు లెట్లు దప్పకుండ నడపెద మెంచిచూచిన నా వలన నీవు పట్టినవన్నియునుం దప్పులే; సర్వాపరాధంబులుం జేసి నీమరంగు చొచ్చితి; ననుఁ గావందగు; శ్రీ వేంకటేశ్వరా!
సీతాపతీ ! మీయాకారంబు గనుంజూడ నెవ్వరివశము ? మీభక్తవత్సల్యాది గుణంబులు దలంచుకొని కొంతదడవు జయవెట్టి మీకల్పించిన జగత్తు జూచి కొంతదడ వాశ్చర్యంబునొంది సర్వమైన వారికి వరంబులొసంగెడి మీ యుదారత్వంబు కొంతదడవు చింతించి మెచ్చి యహల్యా ద్రౌపది ప్రహ్లాదులకుఁ బ్రసన్నుల్లరైన మీ మహిమ కొంతదవు దలంచి పొగడి రావణ కుంభకర్ణ ముఖ్య దానవులఁ జెండాడిన మీ ప్రతాపంబు కొంతదడవు దలంచి విభీషణ హనుమత్ప్రభృతుల మన్నించిన మీ కీర్తి కొంతదడవు పెద్దలచే విని మీకు జేతులెత్తి మ్రొక్కి పరబ్రహ్మంబవై విలసిల్లు మీ ప్రభావంబు కొంతదడవు దలపోసికొని యాడంగలవారము; ఈరీతి గాలక్షేపంబు చేయఁగా మీరు మాకుఁ బ్రత్యక్షంబైనట్లుంటిరి; శ్రీ వేంకటేశ్వరా !
సర్వేశ్వరా ! అవధారు జగంబు నీ నాటకశాల ; నేనెత్తిన తొలుజన్మంబుల ఆకారంబులు నీముందరనాడెడి బహురూపంబులు; దారా సుత బంధుజనులు మేళగాండ్రు; నిన్ను నుతించు వేదశాస్త్రపురాణములు తూర్యత్రయంబు; మాపాద ప్రచారంబు నాట్యంబు; చేయుచేఁతలు, ఆడెడుమాటలు క్రియాభాషాంగంబులు; భోగవస్తువులు నీవు మెచ్చి ఇచ్చిన యీవులు; ఈరీతి నెంతగాలము నీకు వేడుక యంతకాలము నాడెదము, నర్తకులైనవారము; నీకు వినోదంబు చేసుకొని బ్రదుకవలయుఁగాని నెమ్మది మోక్షంబున నుండెదమనుట యే సంగతి? నీవే దయదలచి కృపచేసినప్పుడయ్యెడుఁగాక, యెఱుకగల యేలికఁ గొల్చిన వారికి నడుగ నేమి పని? నీవు నన్నిట అన్నిట మన్నించితివే ; శ్రీవేంకటేశ్వరా !
మదనజనకా ! మిమ్ము నే ధ్యానంబు సేయునెడ మీ యవయవ సౌందర్యంబు దలంప నేరకుండినను మీకు శతకోటి జన్మాధారమైన చక్కఁదనంబు దాఁచరాదు; మీ తిరుమేని కది సహజంబు; పరాక్రమంబు నేఁ బొగడ నేరకుండినను శంఖచక్రాధ్యాయంబులు మీ భుజంబుల ధరియింపవలయుఁగాని మానరాదు; మిమ్ము నే శృంగారింప నేరకుండినను మీ కిరీటకుండల పీతాంబరాభరణంబులు లోకాలంకారంబులు గాకపోవు; శ్రీదేవియు భూదేవియు మీయుభయపార్శంబుల నుండ నేను మీ కైంకర్యంబు సేయ సమర్ధుఁడం గాకుండినను అనంత గరుడ విష్వక్సేనాది పరివారంబులు మీకొలువు సేయుదురు; ఇంక నప్రయత్నంబున మీ పేరు నుడివిన మీరు చనుదెంతురు; మీ వెంట నన్నియుఁ జనుదెంచును; మాకు బహువిచారంబుల నలయనేల ? మిమ్ముఁ జేరుకొనుటే యన్నింటికి మూలము; నిత్యానుసంధానం బిందులనే కలిగె; శ్రీవేంకటేశ్వరా !
ఈశ్వరేశ్వరా ! చదువం జూచిన సంశయంబులె పుంఖానుపుంఖంబులై తోఁచును; చదువ కూరకుండిన జ్ఞానంబు వొడమదు; మరి నిన్నుఁ బలుదిక్కుల వెదకెదమని కన్నులం దెఱచిచూచిన లోకవ్యాపారంబులు భ్రమలఁబెట్టెడిని; ఱెప్పలు మూసికొన్నను బలుచింతలు ముంచుకొనును; పుణ్యములు చేసియైన నిన్నుం గనియెదమనిన నవి బంధకంబయ్యెడిని; చేయకుండిన సర్వనాస్తికుండ నయ్యెద; నీయర్ధం బొరులతోడ నే యోజించి చూచిన బహు కుతర్కములు వొదలెడి; మానిన సర్వ సిద్ధాంతంబులు దెగవు; జగంబు బహుసందేహకారణంబు; తత్వం బేగతి నిశ్చయింపవచ్చు ? కావున నేమిసేయంగా నేమగునో నీదాసులు పోయిన త్రోవ నడచి వారల యభిమానంబునం బొదలి నీకు శరణంటిని; నీవే వహించుకొని నన్నుంగాచెదవు; శ్రీవేంకటేశ్వరా!
శేషశయనా ! నే నీమీఁద నేవలన నీచిత్తంబు వెట్టెద ?నా యోగంబులు కాంతా సంయోగంబులు; నా నియమంబులు రేపుమాపు నన్నపానంబులుగొనుటలు; నానిత్య కర్మంబులు సంసారకృత్యంబులు; నా వ్రతంబులు రాత్రి నిద్రించుటలు; నా ధర్మంబులు శరీర భోగంబులు; నా పదవులు బాల్య కౌమార యౌవనావస్థలు; నా ఘటనలు పుణ్య పాపంబులు; నా వేదపాఠంబు లన్యోన్య ధిక్కారంబులు; నా పంచ యజ్ఞంబులు పంచేంద్రియ వ్యాపారంబులు; ఇవి మా వర్తనలు; నిన్నెంచిచూచిన సకలలోకోన్నుతుండవు; నీన్నుఁ బరికించి చూచిన నంతరమహాంతరంబుల నాలోనుండి రక్షించుచున్నాఁడవు; నీ గుణంబు లరుదయ్యెడి; శ్రీవేంకటేశ్వరా !
నరహరీ ! మొదలనే నోరు మాటలపుట్ట; మౌనంబెట్లు సిద్ధించు? వీనులు గిరిగుహలవంటివి; ఎవ్వరు మాటలాడినను బ్రతిధ్వనులవలె నాదింపుచుండు; అవి వినకుండనెట్లుండవచ్చు? కన్నులు రూపంబులకు నద్దంబులవలెనున్నవి; ఇందు సకలంబునుఁ ప్రతిఫలించుచుండఁగా జూడకుండ నెట్లుండవచ్చు; ఈ దేహంబు నాఁకలి దినదినము పీడింపఁగాఁ జవులుగొన కెట్లుండవచ్చు? ముక్కున నొక్కొక్కదినము పదియొక్క వేయిన్నాఱునూఱుల యుచ్చ్వాసములు గలుగఁగా వాసనలు గ్రోలకెట్లుండవచ్చు? నన్నియు నే ననుభవించిననేమి, నీవు రక్షకుండవైయుండఁగా; నేను నీకు గురి; నీపాదంబులు నాకుగుఱి; నన్ను నీవెల్లవిధంబుల రక్షింతువుగాక; శ్రీవేంకటేశ్వరా !
ద్వారకావాసా ! దేవుండవైన నీకు నాచర్మ మాంసాస్థిమయంబులైన కరంబుల మ్రొక్కుచున్నవాఁడను; పరమ పావనంబైన నీ తిరుమంత్రము నాయెంగిలినోర నుడువుచున్నాఁడను; గోపికలు నీవు రహస్యంబున వినోదంబులు సలిపిన సుద్దులు నావీనులను వినఁగడంగెదను; ఏకాంతంబున లక్ష్మీసమేతుండవైన నిన్ను వేళ యెరుంగక సేవింతును; కోమలంబైన నీ తిరుమేను నాకఱకుం జూపులఁ జూచెదను; నీచిత్తంబు దెలియక యావాహనంబుచేసి పూజించెద; నిది యపచారమో యుపచారమో యెఱుంగ; నేమిచేసినను నీదాసులకు నేర మెంచనిది నీగుణము; నీవు కలవని వెఱవకుండ మందెమేలమున నపరాధములు జేసెద నోర్చుకొనుము; శ్రీవేంకటేశ్వరా!
విట్ఠలేశ్వరా ! నా సాహసంబెట్టిదో కాని నిన్ను నడుగరాని ఫలంబు లడుగఁగోరెడు నా మనంబు; జిహ్వ నాకుం దగని పదార్ధంబులు నిన్నడుగ నిచ్చయింపుచున్నది; నాగుణం బభేద్యంబైన నీ మనస్సు శోధింపఁ గడంగెడు; నా బుద్ధి తెలియరాని రహస్యోద్యోగంబులు వెదకుచున్నది; నా హృదయంబు నందరాని పదంబులకు నాయిత్తపడుచున్నది; నా వేడుక నావలన నీకు నయ్యెడు భోగంబు విలోకించను; నన్ను నీవు సంతతంబునుం బాయక నానా భోగంబులిచ్చి యుపకారంబు లెంచుకొనఁజేసిన మేలెఱుంగనివాఁడ నపరాధిని; ఏమని విన్నపంబుచేసెదను? లోకజననియైన నీదేవిం జూచియైనను కరుణానిధివైన నిన్నుఁ జూచుకొనియైనను నన్నుఁగావవే; శ్రీవేంకటేశ్వరా !
త్రివిక్రమా! మీరు సాలగ్రామ చక్రపాణి దేవపూజ అశ్వత్థతులసీసేవా గోబ్రాఁహ్మణవందన తీర్ధస్నాన వేదపాఠ తపోయజ్ఞా ఏకాదశీ వ్రతదాన సంకీర్తనాదులచేతం గృతార్ధులుగండని జనులకుఁ బుణ్యంబుల చూఱలిచ్చితిరి; ఎదుటఁ గానవచ్చిన మీ మూర్తుల నాశ్రయింపనేరక కొందఱు కానరాని పరమపదంబున నిన్నుఁజూడఁగోరెదరు; అది మాకెంతదుర్లభంబు? ప్రత్యక్షంబైయుండిన మిమ్ముఁ గొలిచినఁ బరోక్షంబు మీరే యిచ్చెదరుగాక వేగిరింప నేటికి? మీ రుభయవిభూతినాయకులరు; మిమ్ము నింత శోధింప సమర్ధుండనా? మీదాస్యమె నేఁ గోరం గలవాఁడఁగాక; శ్రీవేంకటేశ్వరా!
నరసింహా ! నేను భూలోకంబున నెనుబదినాలుగులక్షల జంతువుల గర్భంబులందు వెడలిననేమి? నాకు నలయికలేదు; నీవు నాకంతరాత్మవై వెనువెంటఁదిరుగంగా నీ శ్రీపాదంబు లెంత బడలెనోయని విచారించెద; అదియునుగాక మున్ను స్వర్గనరకాదిలోకంబుల సుఖ దుఃఖంబులనుభవించెడి వేళలో నీవునాలోనుండి నామీఁద దయ నేమనుచుండితివో యనితలంచెద; నే నుపవాసములుండి శీతోష్ణంబుల సహించి తపంబులు సేయు తరిని నీకు బడలిక సోఁకదుగదా యని యూహించెద; నీకుఁ దిరువారాధన సేయుచో నాహ్వానంబుసేసి యారగింపుసేయు సమయంబున నేమి చవిగాకుండునో యావేళ యెటువలెనుండునో యెఱుంగక కొంకెద; కొండంతవాని నిన్ను సూక్ష్మంబుగాఁ జేసుకొని యాత్మలోఁదలంపఁగా నీకుఁ గక్కసంబయ్యెడినో యని వెరచెద; నా సర్వాపరాధంబులు క్షమియింపవే ; శ్రీవేంకటేశ్వరా !
భీమవిక్రమా ! జ్ఞానంబనియెడి శృంగారంపుఁ దోఁటలోఁ గామక్రోధంబు లనియెడి వరాహంబులు రెండు గుద్దులింపుచున్నవి; శమదమంబులనియెడి యోదంబులు ద్రవ్వి వానిం బడద్రోచెద నంటినా నా పూర్వజన్మ ప్రతిబంధంబు లనియెడి భల్లూకంబులు రెండు నందులోనే ఘోషించుచున్నవి; నీ మీఁది యాశాపాశంబు లనియెడు త్రాళ్ళుదీసి వానిం గట్టిత్రోయుము; తొల్లి నీవు మాయామృగంబు నేసిన వేఁటకాఁడవు గనుక విన్నవించితి; శ్రీ వేంకటేశ్వరా !
త్రిదశవంద్యా ! ఈ ప్రాణు లనేకకాలంబులవారు బహు కల్పంబులం జేసిన బహువిధకర్మంబు లసంఖ్యంబులు గలవు; అనుభవింపక శక్యముకాదు; వంశంబులం దొక్కరుండు శ్రీ వైష్ణవుండైతేను కులకోట్లెల్లను గృతార్ధులగుదురని పురాణంబులు సెప్పుచున్నవి; ఒక్కసారి మిమ్ము మనస్సునఁ దలంచిన దురవస్థలైన యాపదలు గడచునట ! ఫలపుష్పంబులు మీ పాదంబులపై వేసిన నానాపుణ్యంబులు చేకూడునట ! మీ మహిమలు అతివిచిత్రంబులు; చెఱవునీళ్ళు చల్లి ఫలము గొన్నట్లు ధేనువులు తృణములమేసి దుగ్ధములు పిదుకునట్లు బిడ్డఁడు తల్లిదండ్రులతో ముద్దులంగురిసి సంరక్షణసేయించుకొన్నట్లు పెద్దలకుం జేతులెత్తి మ్రొక్కి దీవన గొన్నట్లు నీరీతి సులభోపాయంబుల మిమ్ము మెప్పించుకొని మీచేమెప్పులు పుచ్చుకొనియెదను; మాకుం బ్రసన్నుండవు గమ్ము; శ్రీ వేంకటేశ్వరా!
వాసుదేవా ! నీవు సముద్రంబుపైఁ దేరు వఱపి కులాచలంబులు క్రుంగఁద్రొక్కి చరవాళపర్వతంబు దాఁటి చీకటి నఱకి దివ్య తేజంబు చొచ్చిపోయి బ్రాహ్మణుని కొడుకుని దెచ్చితివట ! తలఁచినప్పుడె గరుడ వాహనంబును శంఖచక్రాద్యాయుధంబులను రప్పించి యనేక భుజంబులతో వెలుఁగొందుదువట ! సూర్యునికి జక్రంబు మఱంగువెట్టి సైంధవుని సంహరింపించితివట ! గోవర్ధనోద్ధారణంబును ద్వారకా నిర్మాణంబును మొదలైన యతిమానుషకృత్యంబు లెన్ని వలసినం గలవు; నీ మహిమలు చెప్పెదనన నవాజ్మనసగోచరంబు లవి. చాలదే నవనీత చోరత్వంబును, వత్సబాలహరణంబును, గోవత్సపరిపాలనంబును, దామోరూలూఖల బంధనంబును, కుబ్జాప్రాణనాయకత్వంబును; ఇవియే కీర్తులు నెగడించు; శ్రీ వేంకటేశ్వరా !
సీతావల్లభా ! నా కవితా కన్యకు నీవు వరుండవు; దైవ మానుషంబులు గణ పొంతనములు; నా జిహ్వయే పెండ్లిపీఁట; నా మనస్సే తెర; నాసంతోషకళలే బాసికంబులు; నా భక్తియే కంకణంబు; అక్షరంబులే తలఁబ్రాలు; శబ్దంబులే వాద్యఘోషణంబులు; స్మృతిస్వరంబులే పేరంటాండ్ర పాటలు; చూపులే మంగళ హారతులు; నా వాక్యంబులే పువ్వుదండలు; నీ సహస్ర నామములే బంధువులు; నీ యాత్మగుణంబులే శోభనద్రవ్యంబులుగాఁ గైకొని యీరీతి వివాహంబైతివి; ఇంక నా కర్మబంధంబు లూడెఁగదే; నీ విట్లు పాణిగ్రహణంబు చేసికొంటివిఁక; నీ దేవులు నీవును చిరంజీవులై యుండి సంగీత సాహిత్య నానాలంకారాది పుత్ర పౌత్రాభివృద్ధి వెలయుచు నీ దాసుల రక్షింపవే ! శ్రీ వేంకటేశ్వరా !
శ్రీ పురుషోత్తమా ! కరిరాజుం గాచితివి; కొలువులోపల ద్రౌపదిమానంబు నిల్పితివి; ప్రహ్లాదునిమాట లాలించితివి;శరణుజొచ్చిన విభీషణుని రక్షించితివి; రావణకుంభకర్ణాదుల వధియించి లంక నేలించితివి; పాతాళంబు బలికి నొసగితివి; ధ్రువునికి ధ్రువంబుగాఁ బట్టంబు గృపచేసితివి; నిన్నెవ్వరెఱింగి నుతింతురో వారికి నీ పదవులిచ్చి రక్షింతువు; శ్రీ వేంకటేశ్వరా !
కరుణా కటాక్షా ! ఎవ్వరెవ్వరి జన్మంబులు వారివారికి హితవులై తోఁచుచుండం జేసితివి; దేహత్యాగంబులు నిర్భందంబుల వెడలిన తెఱంగున మనసులను సమ్మతింపంజేసితివి; పాపమూలం బయిన క్రీడనసమయంబులు నన్న పానాది రుచులు స్త్రీ భోగంబులు సుఖంబులై తోఁచుచుండంజేసితివి; కర్మానుభవంబులైన పరలోక సౌఖ్యంబులు, తదనుగుణంబులైన దివ్య శరీరంబులు నిచ్చు చున్నాఁడవు; ఈ రీతి సర్వజంతుల కవ్యాజాంతరసుఖంబులు గలుగఁగా మాకు నెక్కడ నున్ననేమి? శ్రీ వేంకటేశ్వరా !
వేణునాదప్రియా! నేనుబంట నైనందుకు నీకేమిగుఱి? నా నుతులవల్ల నీకేమి లాభంబు గల్గె? మఱియు నే మ్రొక్కంగా నైన ఫలము నీ కేమిటి? నిన్నుఁగూర్చి యుపవాసతపంబులు చేయఁగా నీవు గట్టుకొనియెడిది యెంత? మా నియమవ్రతంబులచేత జన్మంబులు మఱియును మొలపించుచున్నాఁడవు; జీవునికి జన్మ మరణంబులు నిర్బంధంబులై తోచవు; ఇన్నిటికి నీవు కలుగంగా జంతువులకు సుఖదుఃఖంబులనుభవింప సులభంబాయెను; నీవు దయానిధివి;నిన్నుం గొల్చిన వారికి నీవు కామధేను కల్పవృక్ష చింతామణులై ఫలియింపం గంటిమి; శ్రీ వేంకటేశ్వరా!
యజ్ఞరక్షకా ! పాపంబు లూరకె యజ్ఞానులమై చేసితిమిగాక మీఁదదాఁచిపెట్టితిమా ? పుణ్యంబులని కొన్ని వినోదించి నీ కృపంజేయంగా ననుభవించెదముగాక మేము ఫలంబులు మొలవంబెట్టితిమా ? యీరెండు మాలోనుండి చేయించంగాఁ జేసిన సేఁతలు అది మీఱెరింగి యుండియును నిష్ఠురము గట్టుకొనక దాక్షిణ్యంబున కర్మంబు లనుచు మొదళ్ళు కుదుళ్ళు గదలించి మాయలు చేసెదరు; మీ దాసులైన వారు మిమ్ముఁ దలఁచిన మాత్రంబున దోషంబు లపహరించెదరు; మీరెట్లు చేసిన నట్లౌను; లోకంబున "రాజానుమతోధర్మ" యనియండ్రు ; మీయనుగ్రహంబు మాకు మంచిది రక్షింపవే; శ్రీ వేంకటేశ్వరా !
కాళింగమర్ధనా ! జ్ఞానంబును నమ్మి కర్మంబులు విడువంగా నీ యాజ్ఞనుల్లంఘించినట్లగునో యని మనంబున శంక పుట్టెడిని; కాక విహిత కర్మంబులు చేసి, చేసిన ఫలంబు నీకు సమర్పించెద నన నీవాప్త సకలకాముండవు; ఇది నీ కేమి ఖ్యాతిగా నొసంగిదనని సిగ్గయ్యెడిని; లోకదూషణంబులకు లొంగి కర్మంబులు సేయఁగా బంధకంబు లయ్యెడినో యని చింత పుట్టెడిని; ఇందుల కొకమాట కర్మంబులు జ్ఞానసాధనంబులంటివి; వేరొకమాట జ్ఞాన మెక్కుడని యానతిచ్చితివి; లోకులకు రెండుమాటలు కర్మకాండ,జ్ఞానకాండలవలె నిశ్చయించితివి, గాని యొకటి నిశ్చయింపవైతివి; ఇందుకు వివేకియైన పురుషుండు దనకెంత మాత్రమునకు నధికారము కలిగె నటువలెం జేసుకొనియెడిని; నీవలనం దప్పులేదు; శ్రీ వేంకటేశ్వరా !
శ్రీధరా ! దేహధారియైనవాడు దివంబున సంసారమత్తుండై రమియించి రాత్రివేళ పగలింటి యాందోళనంబు కలలోపలం గని వెఱంగునొంది సంసారంబిట్టిది గదా యని వైరాగ్యనిష్టుండనై యుండెదనని యొక పుణ్యక్షేత్రంబున వసియించి యచ్చట నొకానొకవేళఁ దొల్లి పుత్ర మిత్ర కళత్రాదులతో వినోదించిన చందంబు దలంచి యామనోరధంబుల నోలలాడి మనస్సు కరఁగఁజొక్కి తెలిసిచూచి యెవ్వరింగానక బట్ట బయలు భ్రమసితిం గదా యని నిర్వేదనం బొరలుచుండు; నటుగావున గట్టిగా పట్టరాని దీమసం బిట్టిదెకదా! ఉల్లివాసన యంటిన పదార్ధంబునఁ గస్తూరి పరిమళం బంటనేర్చునే? ప్రాకృతివాసన యందినవాఁడు మోక్షసుఖంబెట్లు వెదకు? మీ మాయాప్రపంచం బిట్టిది గెలువరాదు; మీరే దయఁజూడవలయు; శ్రీ వేంకటేశ్వరా !
అనిరుద్ధా ! నిత్యంబును జీవులు నిద్రాసమయంబున నంతర్యామివై సంతుష్టుఁడవై యున్న నీయందుఁ బ్రవేశించి యందే నీవు సృష్టింపగాఁ గలలుగని మేలుకొని యింద్రియద్వారంబుల లోకవ్యాపారంబులు చూచి భ్రమయదురుగాని నీయందు నుండియు నిన్నెఱుఁగరు; గర్భంబులలో నున్న శిశువులు తల్లుల రూపెఱుంగనియట్లు నిన్నుఁ దెలియనేరక చదువులలో వెదకుదురు; నీ వున్న నెలవు తమ యంతఃకరణం బని యెఱుంగరు; నే మెటువలె నుండిన నేమి ? నీవు పూసలలో దారమై యున్నాఁడవు; నీ సన్నిధానంబున నున్నవారిని నీవే కరుణింపవలయు; శ్రీ వేంకటేశ్వరా !
శ్రీహరీ ! భువిలోన శునకసూకరాదుల వానివాని జన్మంబులు సుఖంబులౌనట్లుగా నడపుచున్నాఁడవు; నరకబాధ లనుభవించు వారికి యాతనా దేహంబు లలవరించి చేదన తాడనాదులచేఁ దదంగంబులు మఱియును దొలిపించుచు బాధ ననుభవింపఁ జేయుచున్నాడవు; శరీరంబులు నిర్భంధంబులు గావున నిన్నిటికిని నీవు గలుగంగా సుఖదుఃఖంబు లనుభవించుటలు సులభంబాయెను; నీవు దయానిధివి; నిన్నుఁ గొల్చినవారికి నీవు కామధేను కల్పవృక్ష చింతామణులై ఫలియించుట గంటిమి; శ్రీ వేంకటేశ్వరా !
శ్రీకృష్ణా ! నిన్ను గోపికావల్లభుండవని నియమంబున జపియించిన వారికిం బ్రసన్నుండ వగుచున్నాఁడవు; అవులే ; నీజారత్వంబుం దడవిన నీకు వేడుకపుట్టెడినో కాక నీ మర్మంబు దడవినవారల నుపచరించుటో కాక యిట్టి ప్రసంగంబులం దలంచిన మనస్సు కరుంగనో కాక యహల్యాజారుండ వని నొడివిన నింద్రుండు మెచ్చుచో నీవును నుపేంద్ర నని వంశానుచారంబైన వ్రతంబు జరుపుటో తెలియరాదు; మాకు నిన్నింత శోధించి యడుగం బనియేమి ? నీకు నిష్టంబు సేయుటే మాఁకు బ్రయోజనంబు; నీకెంత కాముకత్వంబు ప్రియంబైనంబోలు ! నేఁటనుండి మేము నిన్ను శ్రీభూమినీళాసమేతుండవని వజ్రాంగనా నాధుండవని అష్టమహిషీప్రాణవిభుండవని, శతోత్తరషోడశ సహస్రకాంతారమణుండవని నుతించెదము; శ్రీ వేంకటేశ్వరా !
భూపతీశా ! భూలోకంబున నన్నుఁ బలుమాఱు పుట్టించెదనని నీకేమైన వ్రతంబా ? నాకు నన్ని వేడుకలు నొసంగెదననియెడు నుదారత్వగుణంబుకాక? నీ ప్రకృతి నన్ను సతతంబుఁ బాయకుండెడి; నాతోడిదిచలంబా, సకలభోగంబులు నన్ను ననుభవింపఁజేసెద ననియెడు మాతృవాత్సల్యంబుగాక? ఈ రీతి మీరు పాలించి సంసార సౌఖ్యంబులు ప్రసాదింపఁగా నుల్లంఘించి మోక్షంబుగోరెడు మంకుతనంబు నాకుఁదగదు; మీరు నియమించినట్లు నిచ్చలు మెలంగుటే నాకు ధర్మంబు; అయినం గాని యింకొకవిన్నపంబు చేసికొనియెద విన నవధరింపుము; నామనంబులో మీరుండవలె, కన్నులను మీ మహోత్సవంబులఁ జూడవలె; వీనుల మీ కధలు వినంగావలె; నోటికి మీకీర్తనంబు కృపచేయవలె; నిదియె నాకుఁ బరమపదంబు; శ్రీ వేంకటేశ్వరా !
శ్రీనివాసా ! దేహంబులై పొదిగెడిది నీ మాయయట; అందులోని చైతన్యంబు నీవట; కోరికోరి సుఖదుఃఖంబు లనుభవించువారు జీవులట; ఇన్ని చందంబులం గలిగెడు ఫలంబులు స్వర్గనరకంబులట; ఇవి యెన్నటికిఁ దెగని కర్మబంధంబులట; ఈ సంసారంబు చేసి కూడఁబెట్టంగా మిగిలిన లాభంబులు పుణ్య పాపంబులట; ఇవి నీకు లీలావినోదంబులట; దీనికి తుదయేది మొదలేది; ఇటువలె ననాదియై సత్యమై జరుగుచున్నది ప్రపంచంబు;ఈ యర్ధంబుఁ దెలియఁ దరముగాదు; ఇంకనేమని విన్నవించవచ్చు? మీ చిత్తంబు నా భాగ్యము ! శ్రీ వేంకటేశ్వరా !
పరమేశ్వరా ! నా శరీరంబు నాకు రధంబు; నా పుణ్య పాపంబులే గుఱ్ఱంబులు; నా యాసలే పగ్గంబులు; నా కామక్రోధంబులే యాయుధంబులుగాఁ గైకొని జన్మ పరంపరల నిహపరలోకంబుల సంచరించిన విజయ పురుషుండ నేను; నీవు జగన్నాధుండ వనఁగా విని ఇప్పుడు నిన్నుం గొల్చితిని; సుజ్ఞానధనంబు జీతంబు పెట్టి యేలుము; ఇంతకాలంబు నీమాయలం బరగిన మర్మజ్ఞుండ; నేను నీకు సేవకుండనై యుండుట నీకు మేలు; శ్రీ వేంకటేశ్వరా !
రాధావల్లభా ! సకల యజ్ఞంబులకంటె జ్ఞానయజ్ఞం బధికంబనియును, అందులఁ గర్మ ఫలంబు లన్నియు సమాప్తంబులై పోవుననియును, అది నీవెరుంగుమనియును, తత్వవేత్తలకు దండంబువెట్టి ప్రార్ధించి యడిగితేను వారు నీ కీ జ్ఞానంబుపదేశించెదరనియును, ముందర నీయాత్మలో నీవే యెఱుంగుదువనియును అర్జునునకు పెద్దలం జూపి చెప్పితివి మొదల; నా తర్వాత నీవే వహించుకొని అన్ని ధర్మంబులు నంటువెట్టి నాకు శరణుసొచ్చిన మాత్రాన నే రక్షింతు నని సత్వంబుచేసి యిది యెవ్వరికిఁ జెప్పకుమని యితర తత్వము మాని నిన్నె కొలువంగట్టడిచేసితివి; అటుగాన కేవలజ్ఞానులకుఁ గర్మంబులు చేయనిదోషంబులు లేవనుటాయెను; ద్విజాతులు నీ యాజ్ఞా కైంకర్యంబులు సేయుదురు; కాన యవియును వారలకు బంధకంబులుకావు; నీవు పెట్టిన చిక్కు నీవే తీర్చితివి; శ్రీ వేంకటేశ్వరా !
పాంచజన్యధరా ! అనాదికాలంబున నుండియు జీవులం బాయలేక ఆత్మలోనుండుదు వది యంతకంటెను లాభంబింక నేమి వెదకెడిది? జీవులంటిమా నిత్యులు; వారికై చింతింపవలదు; నీలీలార్ధంబైన శరీరంబులు మోచినవారలుం గావున ప్రాకృతవికారంబులైన సుఖదుఃఖము లనుభవించిన మంచిదే; యేలినవారి పనులయెడం బంటునకు నేమి వాటిల్లిన నేలికకేకలవు; నీవే రక్షించెదవుగాక; అందులకు వెఱవఁబనిలేదు; నీవు గలవని నమ్మి నిర్భయత్వంబున నుదాసీనత్వంబున నుండవలసినది; నీదాసులైన వైష్ణవులకు పరమపదంబు సిద్ధంబు; ఆఢ్యులై మిమ్ము మఱచినవారికి సంసారమేగతి; ఇటువంటి లోకుల నీడు వెట్టుకొనవలదు; ప్రపన్నులైనవారలకు నీవు రక్షకుండవు; శ్రీ వేంకటేశ్వరా !
పురాణ పురుషా ! అప్రతిహతప్రతాపుండవు; అవాస్త సకలకాముండవు; అఘటనఘటనా సమర్ధుండవు; అపార కృపానిధివి; అశరణశరణ్యుండవు; అసంఖ్యాత కల్యాణగుణండవునైన నీ వబ్జభవాండంబు నీ పాదంబు గోట గీరిన నీరై పాఱెను; నీవు గావలయుననిన నర్జనుని ప్రతిజ్ఞకొఱకుఁ బగలు రాత్రి యయ్యెను; ఇటువంటివి నీ మహిమలు; ఘంటాకర్ణుండు నెక్కడ మొఱలిడె? కుబేరుపట్టం బెక్కడఁ గరుణించితివి? సరయూ తీరంబున పరమపదంబు చూఱలిచ్చితివి; ఇప్పుడు శేషాచలంబునందు వరంబు లొసంగెదవు; నీవు గరుణించిన నీకసాధ్యంబేది ? నీకిది సహజంబు; శ్రీ వేంకటేశ్వరా !
భక్తవత్సలా ! కన్నులెదుట గోచరించిన వన్నియును నీరూపంబులే; శబ్ధంబు లన్నియు నీయనంతనామంబులే; జలంబు లన్నియు నీ శ్రీపాదతీర్ధంబులే; ఫలమాలాదు లన్నియు నీ ప్రసాదంబులే; జీవకోట్లు నీదాసులే; తలంపున నిల్చినవి నీధ్యానంబులే; చేతులఁ జేసినవన్నియు నీ కైంకర్యంబులే; జగంబు వైకుంఠంబే; యజ్ఞంబులు మహోత్సవంబులే; సకలసంపదలు నీయుపకరణంబులే; ఇటువలె భావించియేకదా నీభాగవతులు భవంబులు గెల్చిరి, ఇహపరములు చెందిరి; శ్రీ వేంకటేశ్వరా !
గదాధరా ! బుద్ధిమంతుఁడైన యతండు దేహధారణమాత్రంబులు సుంత భోగంబులు గైకొని యితరంబు లేమియు గోరక అంతరంగంబునకు నిఖిలవస్తులాభంబులు నీపాదంబులేయని తలంచుకొని తృప్తింబొంది యేకాంతంబునందే కాని సంసారంబు చేయుచుండి కాని నిన్ను ధ్యానంబు సేయుట యోగరహస్యంబు; ఇదియే తపంబు; ఇందులనే సకల సిద్ధులును సిద్ధించు; తొల్లిటి మును లీరీతినే నిన్ను భజియించి ఘనులైరి; మఱికొంద ఱీమార్గంబున నేమియుం గోరక మీ శరణుసొచ్చి మిమ్ముఁ గొల్చి ముక్తులైరి; కావున మునుపడి సేవించు నుద్యోగంబులు జీవులవి; తర్వాత రక్షకత్వంబు నీది; శ్రీ వేంకటేశ్వరా !
త్రిగుణాతీతా ! చతుర్భుజాకారా ! కానరాని బ్రహ్మము నెవ్వరుఁ జూపలేరు; కానవచ్చియున్న నీమాయ లెవ్వరు మాన్పలేరు; కలది భక్త సులభుండవని చదువులలో నిన్నుఁ జెప్పంగాఁ జెవులు చల్లంగా వినుట యొకటి, కన్నుల పండువుగా నీ మూర్తులు దర్శించుట యొకటి, నీరూపులు మనంబునఁ దలపోయుటొకటి, కరంబుల నీకు మ్రొక్కుటొకటి,నీ నామంబులు జపియించుటొకటి, ఇంతియ కాని వేఱొక్కయుపాయంబు మఱిలేదు; విచారించిన నాత్మ పరమాత్మ దర్శనంబు లసాధ్యంబులు; కర్మంబులు కోరి చేసిన బంధంబులగు; కోరక చేసిన నిన్నుఁ గనుఁగొనుటకు; నన్ని చందంబుల మీకు శరణనుట మేలు; శ్రీ వేంకటేశ్వరా !
రుక్మిణీవల్లభా ! మహా పాతకంబులు చేసిన జీవులు పాషాణంబులై వృక్షంబులై తృణగుల్మలతాదులై పుట్టుదురని చెప్పుదురు; జగంబంతయు నివియ నిండుకొనియున్నవి; బ్రహ్మాండంబును పాపంబు నిండుకొన్నది; చెప్పవే, యెట్లాయహల్య నీపాదంబుసోకి పాషాణత్వం బుడిగి పావనంబయ్యె? నిటువంటి యీ చరాచరముల నంతర్యామివై నిండుకయుండఁగా నీ జీవుల పాపంబు లప్పుడే పోయిన బాధితానువృత్తి నున్నవియో కాక వారి నిర్బంధంబులు దోఁచకుండంజేసి మీ లీలకుం గైంకర్యంబు గొనుచున్నాఁడవొ కాక మీ ధ్యానకల్పన ఘటియించుకొన్నాఁడవొ; శ్రీ వేంకటేశ్వరా !
దేవచూడామణి ! మీస్వరూపంబు మితివెట్టి తెలియంగారాదు; తెలియకుండిన నాకు బ్రహ్మజ్ఞానంబు సిద్ధించుటెట్లు ? శాస్త్రమార్గంబున యుక్తులు వెదకిన మీఁదఁ బెరుగుచున్నవిగాని యవధిలేదు; మీగరిమ మెట్లు నిశ్చయింపవచ్చు ? మీరుండుత్రోవ లెఱుంగరానివని సందేహింపనేటికి ? అన్నిట మీదాసుండనని యుండుటేచాలు; నదియే సులభోపాయంబని నిశ్చయించి చెప్పితివి; మున్నిటిపెద్ద లిందువలననే నీ చిత్తంబు గరఁగఁగొల్చిరి; ఇదే పరతత్వ జ్ఞానంబునకు మూలంబని నామనంబున సన్నుతించి పతివ్రతాభావంబున దాస్యంబునకుఁ గంకణంబు కట్టుకొంటిని; ఇదినా విన్నపంబు; శ్రీ వేంకటేశ్వరా !
లక్ష్మీవల్లభా ! నీ వజాండంబున కాధారకూర్మంబవట; మీఁదట నీ బంటు శేషుని ఫణంబులమీద సకల లోకంబులు నున్నవి; ఆదివరాహంబైన నీ కొమ్మున భూమి నెలకొన్నది; మత్స్యావతారంబున నీచేత వేదంబు లుద్ధరింపఁబడెను; సకలైశ్వర్యంబులకుం గారణంబైన శ్రీదేవి నీదేవి; సూర్యచంద్రులు నీ కన్నులు; మూఁడులోకంబులు నీ పాదంబునఁ గొల్చినవి; బ్రహ్మ నీ కొడుకు; ఇటువంటి బ్రహ్మాండంబులు నీ రోమ కూపంబుల ననంతంబులై యున్నవి; ఇటువంటి దైవంబు లెవ్వరున్నారు ? నీ కీర్తిప్రతాపంబుల కెదురేది? శ్రీ వేంకటేశ్వరా !
శ్రీ తులసీ వల్లభా ! ఇంద్రజాలములు చూపువాఁడు బట్టబయలు సముద్రంబుగా నీదును; దివాంధములు పగలు చీకటిగాఁ దలఁచును; భ్రమసినవాండు రజ్జువు సర్పంబుగాఁ దెలియును; నీమాయ చేత మోహితుండైనవాఁడు నీప్రభావంబెరుగక తన సామర్ధ్యంబులని యహంకరించును; నీయవతారంబులు మానుషంబులుగా నెంచును; ఇటువంటి వారలకు నీపరతత్వము తెలియదు; నీవు పుట్టించిన నాస్తికులైనవారి వినిపింప నెవ్వరితరము? మీరె కరుణించినప్పుడు మధురమయ్యెడుఁ గాక ! శ్రీ వేంకటేశ్వరా!
సామగానప్రియా ! లోకరక్షణార్ధంబు నీవవధరించిన రామకృష్ణావతారంబులను కర్మపాశబద్ధులైనవారు తమసాటిగాఁ దలఁతురు; వారు మీతో సరి యేల యయ్యెదరూ ? సర్వోత్కృష్టుండవని యెఱుంగని వారికదియేల రుచియించును? సర్పదష్టులైన వారికేమి దినినఁ జప్పనుండినట్లు మాయాసర్పములు తలకెక్కిన తమ్ముతామెఱుంగక నిన్నుఁదమసాటి కెంచుకొంచున్నారు; కటకటా ! యేమియందు? సకలరక్షకుండవని మహాపురుషులు నిన్నుఁగూర్చి తపంబులుసేసి మహత్త్వంబులు వొందుచున్నారు; మీ ఘనత కిదియె దృష్టాంతంబని యెంచఁదగును; శ్రీవేంకటేశ్వరా !
శ్రీవత్సలాంఛనా ! నీవు బలవంతుడవు; ఎట్లు చేసిన నట్లగు; గౌతమీనది జలంబులకుం దగిలినశాపంబు పరిహరింప శబరిస్నానతీర్ధంబు గారణంబు చేసితివి; ఇదేమి చిత్రమో? బ్రహ్మర్షియైన దుర్వాసు నాపదమాన్ప నీభక్తుండైన యంబరీషుని గుఱిచేసితివి; హీనాధిక్యంబులు విచారించిన నెంతకెంతయంతరము ! మీదాసుల ప్రభావంబు లిట్టివని లోకులకుందెలిపితివి; ఏమని నుతియింతుము నీ మహిమ? శ్రీ వేంకటేశ్వరా !
తాటకాంతకా ! నేను రాజస తామసగుణంబులం దగిలి మదోన్ముత్తుండనై యున్నవాఁడ; నే బుద్ధిమంతుండ నౌటయెన్నఁడు? పూర్వజన్మంబున నే ననుభవించిన సుఖ దుఃఖంబులు దలంచియైనను, గొంత చక్కటికి వచ్చెదనంటినేని, జాతిస్వరత్వంబు లేదు; నరక బాధలఁ దలఁచు కొనియెద నంటినేని, నవి నాఁడె మఱచితిని; భువిలోపల శునక సూకరాదులను సంసారబాధలం బడెడివారి తర్జనభర్జనాదులుచూచి విరక్తుండనయ్యెదననినఁ బురాణవైరాగ్యంబెకాని దృడంబుగాదు; నా మూఢత్వంబు విచారించెదవో ! ఇన్నింటికిం బ్రేరేపకుండవు గనుక నీమఱంగు సొచ్చితిని; నీవె నన్ను శుద్ధసత్త్వసంపన్నుఁ జేయవే; శ్రీ వేంకటేశ్వరా !
సుబాహుదైత్యమర్ధనా ! నేను మంత్రసిద్ధి పడయుట కొఱకుఁ గుత్తుకబంటి జలంబులలోపల నుండెదననుచు, ఋషియయ్యెడు కొఱకు వనంబులలోపలఁ దపంబుచేసెద ననుచు,గాయసిద్ధివడయుకొఱకు సత్త్వౌషధంబులుచేసి సేవించెదననుచు, సిద్ధగంధర్వపదంబునం బొందెడుకొఱకు మహాయోగంబులు సాధించెదననుచు, ననేకోపాయంబుల యాశలం బొరలితిని ; నావివేకంబేమని చెప్పెడిది? ఇవి యన్నియు నిర్భంధంబులైన బంధంబులె కాని, మోక్షమార్గంబునకుం బ్రయోజనపడవు; చిరంజీవుండనై యుండుదుఁ గదాయని యాసపడి యెన్నాళ్ళుండినను, మీ మాయయైన జగత్తునఁ ద్రిమ్మటలే; కాని బ్రహ్మలోకంబు దాఁటరాదు; ఇందులకింత పనియేల యిప్పుడు? బుద్ధిమంతుండనైతిని; మిమ్ముఁగొల్చి మీరేగతియనియుండంగా, మీరు వలసినట్లు చేసెదరు;శ్రీ వేంకటేశ్వరా !
యదుకులతిలకా! కర్మంబులుచేసి మిమ్ముం గనియెదమనిన నది ఘనతిమిరమధ్య దర్పణావలోకనంబు; చదువులు చదివి మిమ్ముఁబట్టెదమనిన నది బకబంధనప్రయాసంబు; తపంబుచేసి మిమ్ము వశంబుచేసికొనియెదమని తలంచిన నది శేషమస్తకమాణిక్యగ్రహణంబు; ఉపవాసవ్రతంబుల మిమ్ము నాదరించెదమనిన నది సముద్రహేతుబంధనంబు; దానంబులొసగి మిమ్ము నాకర్షించెదమనిన నది యాకాసపాశబంధనంబు; నీవొక్క భక్తిచేతనే సాధ్యుండవు; ఇందుకు దుష్టాంతంబు మీకు శరణుసొచ్చిన ప్రహ్లాద నారద శుక భీష్మ విభీషణ కరి శబరీ గుహ అకౄర విదుర హనుమప్రభృతులైన పరమ భాగవతులు లోకంబులం ప్రఖ్యాతులయిరి; నిన్ను నొక్కని భజియించి నిశ్చింతనుండెదము; శ్రీ వేంకటేశ్వరా !
గోపాలబాలకా ! నిన్ను నెఱుంగని శుష్కజ్ఞానంబు పాషాణ కంటక కౄరసర్ప వరాహ శార్దూల భల్లూకా క్రాంతంబైన యరణ్య మధ్యంబువంటిది; మీదేవాలయంబులు లేనిచోట్లు కఠిన కర్కశ తిమిర దురవగాహ పిశాచ శునకావాసంబుల వంటివి; మీకు విరహితంబులైన పూజలు నిబిడ నిర్ఘాత విద్యుత్పాత జంఝామారుతవర్షంబులైన సముద్రమధ్యంబులవంటివి; మీ కధలు లేని పురాణశ్రవణంబులు భీకరాకార కాక ఘూక కంక గృధ్ర ఝిల్లీ పాషాణ గుహలలోని ప్రతిధ్వనులవంటివి; ఇవి యెల్లను మహాత్ములగుదువారు దలంపరు; మిమ్ము నమ్మి సర్వశుభంబులు మీయందె ఘటియించుకొందురు; వివేకులయిన మీదాసులకు నిదియె యుపాయంబు; శ్రీ వేంకటేశ్వరా !
పూతనాశిక్షకా ! గ్రహణకాలంబునంజేసిన స్నానంబునకు గంగాస్నానంబు సరియని చెప్పుదురు; పుణ్య క్షేత్రంబుల నుండెడివారిని ఋషిసమానులని యంద్రు; సత్పురుషులైనవారి హస్తంబునంబెట్టిన సువర్ణంబు మేరుసమానంబని పలుకుదురు; కాలకృతంబులైన యనిష్టానంబులు సఫలంబులని వచియింతురు; అన్నిటి మహాత్మ్యంబు మీయందేయున్నది; గంగాజలంబు మీపాద తీర్ధంబు, రుషిత్వంబు మీ దాస్యంబు, దాన ఫలంబైన సువర్ణంబు శ్రీమహాలక్ష్మి ప్రసాదంబు, అనుష్టానజపంబులు మీనామస్మరణ సులభంబులు; ఇన్నియును మీవలననే మాకు సిద్ధించె; ఇన్నిటం బరిపూర్ణులమై యున్నారము; వెన్న చేతఁబట్టుకొని నేతికై వెదకనేమిటికి? పరుసవేది యింట నుండగా బంగార మడుగవలెనా? మాకు మీరు గలరు ధన్యులమైతిమి; శ్రీ వేంకటేశ్వర!
లోకనాధా ! నేను జ్ఞానం బెవరినైన నడిగి తెలిసికొనియెద నంటినేని శాస్త్రాధీనుండు బ్రాహ్మణుండు; గృహస్తుండు పుత్ర మిత్ర కళత్రాధీనుండు; రాజు రాష్ట్రాధీనుండు; ప్రధాని కార్యాధీనుండు; జపిత మంత్రాధీనుండు; తపస్వి దైవాధీనుండు; ఈరీతిని వారువారు మనస్సులు తమ తమ కర్మంబులందే యొడంబడ వర్తింతురు; కాని నిన్ను నొక్కనినే కొలిచితేను నీవలన నన్నియుం గలవనియెడు విశ్వాసంబు వారికిఁ గలుగనేరదు; వారు నన్ను నెట్లు బోధించెదరు; విత్తొకటి వెట్టినఁ జెట్టు వేఱొక్కటి మొలచునా? అవి నీకృత్యంబులు; నేను వైష్ణవుండను; ఆచార్యాధీనుండను; నీవు భాగవతాధీనుండవు;నన్నుం గరుణాదృష్టి నవలోకింపవే; శ్రీ వేంకటేశ్వరా !
ఆదిమధ్యాంతరహితా! ఆకాశంబున భూమి బురుడింపవచ్చును; అనంతమైన నీమహిమకు నీడులేదు; సముద్రంబునెంచి మేరుపర్వతంబుఁ బోలించవచ్చు; నీకరుణాసముద్రంబునకు సరిచెప్ప నలవిగాదు; సూర్యుని తోఁడ జంద్రుని జోడు చెప్పవచ్చును; నీ కోటి సూర్య తేజంబునకుం బ్రతిలేదు; బడబాగ్ని నగ్నిదేవునిఁ బోల్పవచ్చును; నీప్రతాపాగ్నికి సాటి యుపమింపరాదు; చుక్కలను జ్యోతిశ్శాస్త్రంబుల లెక్కింపవచ్చునుగాని యపారంబైన నీ నామంబుల ప్రభావంబులకు నేమియు మితివెట్టరాదు; ఏకోదకంబైనప్పుడు నీవొక్కడవే నారాయణుండవై యుండుదువట; నీకు నీవే యీడు; నిన్నెంతని కొనియాడుదుము; అందఱకు నీ వొక్కరుండవే గతి; శ్రీ వేంకటేశ్వరా !
భక్త చింతామణీ! నేను విలాస సంకల్ప బాధితుండనై యజ్ఞానం బనియెడి యగాధ జలంబులలోన మాయావర్షాగమనంబునం దపంబు సేయుచున్నవాఁడ; అంగనాలింగనాకాశమధ్యంబుననుండి వదన చంద్రునిపై దృష్టినిలిపి యూర్ధ్వబాహుండనై తపస్సు చేయుచున్నవాడ; అష్టాశీతి బంధంబుల యాసనంబులనుండి మదనదైవతాగమంబున నిట్టూర్పులన్ ప్రాణాయామంబుల దపంబులు చేయుచున్నవాఁడ; క్రోధాగ్ని పాతకేంధనంబులు దరికొల్పి తపంబు సేయుచున్నవాడ; ద్రవ్యార్జనచింతాది కామ్య కర్మ ఫలాహారినై తపంబు సేయుచున్నాఁడ; ఆకాశ పర్వతంబు మీఁద నతిదైన్యసూచ్యగ్రంబునం దపంబు చేయుచున్నవాఁడ; సంసారంబనియెడి పుణ్య క్షేత్రంబునను పుత్రదారాదులనెడి సాకారులగు నిధులు కన్నులెదుటం జూచి చూచి ధ్యానయోగంబు తోడుతఁ దపంబు సేయుచున్నవాడ; విచారించి చూచితే యిన్నిచందంబుల నుండెడి వాఁడవు నీవే; ఈతపంబులన్నియు గల్పించినవాడవు నీవే; గురుండవు దైవంబవు రక్షకుండవు నీవే; మమ్ముఁ గరుణింపుము; శ్రీ వేంకటేశ్వరా !
దయానిధీ! నీవు మన్నించి భాండారంబు దెఱచి భూరిదానంబు లొసగఁగా సకల వైష్ణవులును నీపై భక్తి సంపదను తమ తమ యాత్మమందిరములలోన బాతర బెట్టుకొనిరి; నీనుతులు మూటగట్టి వదన సౌధంబులలోన తూగవేసికొనిరి; నీనామాంకితంబులు దేహముతో లంకించి తిరుమణి గుఱుతులు వేసికొనిరి; నీమూర్తిధ్యానంబు మనస్సనియెడి గోడల నంటించిరి; నీపూజాంగంబులు పిడికిళ్ళఁ బట్టుకొని యున్నవారు; నేను వారిలోని వాఁడనే; నీకృపాదృష్టి మాపై గురిసె; ఇంక మాకు ననావృష్టి దోషంబులేదు; నీధర్మంబున పరిణామంబున నుండెదము; శ్రీవేంకటేశ్వరా!
విజయ ప్రకాశా! కార్యాతురుండనై మందెమేలంబున మాటిమాటికి నిన్నుఁదలచుచున్నవాడను; నిన్నుఁదలంచి చూచితేను బ్రహ్మదేవునిలోని సామర్ధ్యంబు నీవె; ఇంద్రునిలోని యైశ్వర్యంబు నీవె; సూర్యునిలోని తేజంబు నీవె; చంద్రునిలోని కళలు నీవె; వాయువులోని వేగంబవు నీవె; సకలదేవతలలోని ప్రాభవంబులు నీవె; అన్నితీర్థంబులలోని పుణ్యంబులు ప్రభావంబులు నీవె; యజ్ఞదాన కర్మానుష్టానంబులు నీవె; ఇటువంటి నిన్ను సాధించనెట్లు వచ్చును? నేను మనుష్య మాత్ర దేహిని; మీరెంత నే నెంత? ఊరకే మిమ్ముఁగొలిచిన బంటనని పెద్దరికంబులకుఁ జెప్పుకొనియెదనుగాక, మిమ్ముఁగనుఁగొననెంత సమర్ధుఁడను? నాయగ్గలికకు నేను నన్ను నవ్వుకొనుచున్నవాఁడను; నా యాస చూచి నన్నుఁ దయదలంచి యేలుకొనవే; శ్రీ వేంకటేశ్వరా!
మధుకైటభాంతకా! జంతువులము మేము ఆహార నిద్రలతో నోలలాడుచున్నయెడ నిన్ను నొకానొకపరి మా పాలింటి దైవమవని తలంచుచున్నారము; మా జ్ఞానంబు లల్పంబులు ననాచారబహుళంబులు నయినట్లున్నవి; మాయునికి పెక్కు రంగులచెట్లలో నొక జిల్లేడుఁజెట్టువలె నున్నది; బంటులకు నీవేమి చేసెదవో? నేము మిమ్ము సదా సేవింప నేరమి చింతింపుచున్నారము; నిన్ను నిర్హేతుక దయానిధివని పెద్దలు చెప్పుదురు; నీ బిరుదులు దలంచుకొని మాపై కృపాకటాక్షము దయసేయుము; శ్రీ వేంకటేశ్వరా !
విభీషణస్థాపకా! ఈ మనుష్యలోకంబున రవి చంద్ర గ్రహ తారకంబులవలన నుదయాస్తమయంబులును పూర్వ దక్షిణ పశ్చిమోత్తరంబులును నేర్పడియున్నవి; ఇంద్రాదులకు దేవమానంబున నివియే శతగుణంబులై యున్నవి; అట మీద బ్రహ్మకు బ్రహ్మ మానంబున ననంత గుణితంబులై యున్నవి; ఇందులకు జ్యోతిశ్శాస్త్రంబునం జెప్పెడి కాలంబునకు నేకవాక్యతం గల్పించి యేలాగున సరిపఱచిచెప్పవచ్చును; శాస్త్రంబులు కల్లనరాదు; అయితే వీని కతంబున నీవే గాలాత్ముండవై ఇక్కడనక్కడ నిన్ని చందంబులతోడఁ జూపెడి నీస్వతంత్రంబు గానంబడియెను; జగత్తంతయును నీ మహిమనే యున్నదను నిశ్చయము తేటతెల్లమాయెను; సర్వంబు నీ కల్పితంబై చెల్లుబడియవుట, నిశ్చయంబు; పుట్టించుటకు రక్షించుటకు నీ వొక్కరుండవే కర్తవు; పరమేశ్వరుండవు; అఘటనా ఘటన సామర్ధ్యంబు నీకు కలదు; నీ చేఁతలు పొగడుచున్నారము; శ్రీ వేంకటేశ్వరా!
ఉద్ధవ వినుతా! సర్వమైనవారికి నీవాహారంబు గొనువేళను ఆయాపదార్ధంబుల రుచులు జిహ్వలకొకరీతివె; తరుణీ సంగమంబులు నొక్కచందంబులె; వీనుల వినియెడి వినికియును నొక్క జాడయె; ముక్కులాఘ్రాణించు పరిమళంబును నేత్రంబులం జూచిన తెలియునునొక్కతీరె; విచారించితే అనుభవంబులయెడ ఏక సూత్రంబె అవుచున్నది; ఓహో! నీ ఘటన యత్యాశర్యంబు, అన్నిట నేర్పరివౌదు; శ్రీ వేంకటేశ్వరా!
కంసమర్ధనా! నీవు ఆదివిష్ణుండవు; నీ యాత్మ సంభవుండైన బ్రహ్మదేవుండపర విష్ణుండు; అతని చేత సృజింపఁబడ్డవారందఱు వైష్ణవులే; "సర్వం విష్ణుమయం జగత్" అందురుగావున నందఱును మీయధీనులే; వారివారి పూర్వజన్మానుగుణ్యంబునం గొందఱు శైవులగుదురు; కొందఱు మాయావాదులగుదురు; అందులకు నింక నొక్క విశేషంబు గలదు; దేవతాంతర మతాంతర సాధనాంతర ప్రయోజనాంతరములు విడిచి తదేకనిష్ఠులై మిమ్ముఁ గొలిచినవారు పరమ వైష్ణవులు; విదురుని యంతరంగులు; ఇతర మతంబులవారు నిన్నెఱింగిన నెఱుంగకుండిన సకల దేవతలును నీ యంశసంభవులుగనుక నా దేవతలఁగొల్చినవారును నీవారే; శ్రీ వేంకటేశ్వరా!
అహల్యాశాపవిమోచనా! నీవు సర్వంబునకు నాధారంబని వేదంబులు చెప్పుచున్నవి; నీకు నాధారం బెయ్యదియో యెఱుంగను; నీ వొక్కండవే పరబ్రహ్మవట ! పురాణంబులు చెప్పెడి తక్కిన మూర్తిబేధంబు లెవ్వరెవ్వరో యెఱుంగను; నీవేమిటం బొరయనివాడవట! ఈప్రపంచంబెవ్వరికొఱకుఁ బ్రకాశింపుచున్నయదియో కానఁబడదు; ఇవి యన్నియును విచారించి చూతమనిన నీవభేద్యుండవు; ఇటువంటి నీ మహిమకు నేము నాశ్చర్యంబు నొందుట గాని యొకయర్ధంబు నిశ్చయింప నలవిగాదంటిని; తిలలలోని తైలంబువిధంబునఁ గాష్ఠంబులోని యనలంబు చందంబునఁ, బుష్పంబులోని పరిమళంబుపోలిక, బీజంబులలోని వృక్షంబులకైవడి నీరీతి జగంబులలోన నీవును, నీలోన జగంబులును; బాహ్యాంతరంబుల నీవు పరిపూర్ణుండవై యున్నాఁడవు; నీవు వలసినట్లుండుము; నీకు శరణని బ్రతికెదము; శ్రీ వేంకటేశ్వరా !
కల్క్యవతారా! మిమ్ముఁ గొలిచిన సాధుజనంబులకు వరదహస్తంబును, భయపడ్డ దీనులకు నభయహస్తంబును జూపుకొని సాకారమై నిలుచున్నవాఁడవు; శత్రుసంహారార్ధంబై యొక శైలచక్రంబును విజయఘోషంబులందఱకును నెఱింగించుకొఱకు నొకచేత శంఖంబును బెట్టుకొనియున్నాఁడవు; ఇంక నేమూహించి యాసపడి వెదకెడిదేమున్నది? కోరకే తొల్లి సర్వార్ధంబులు నొసగ నంతర్యామివై కాచుకొని యున్నాఁడవు; వెదకంబోయిన తీగ ముంజేతఁ దగిలినట్లు, వేడఁబోయిన యర్ధంబు వేడుకవచ్చినట్లు, ఆడఁబోయిన తీర్థంబెదురుగా వచ్చినట్లు, తొల్లిచేయని పుణ్య ఫలంబులు చేతికి వచ్చినట్లు సకల తిరుపతులం బొడచూపుచున్నాఁడవు; సకలమైనవారికి బ్రదుకుఁద్రోవలు నీవుండిన యాకారంబు చెప్పుచున్నది; శ్రీ వేంకటేశ్వరా!
రవిచంద్రలోచనా! మావేడుకకు నీప్రత్యక్షంబుఁ గోరెదము గాక; నీవు ప్రత్యక్షంబయిన నెట్లు కనుఁగొన నోపుదువు; నీవు కోటిసూర్యప్రకాశుండవట; ఒక సూర్యుండు దృష్టులకు మిఱుమిట్లు గొల్పెడిని నీ వెట్లు గోచరించెదవో యద్భుతంబు; శ్రీ వేంకటాద్రి మీద నీరూపంబు దర్శించితిమి; మాకు నిదియె బ్రహ్మ సాక్షాత్కారంబు; శ్రీ వేంకటేశ్వరా !
జగత్ ప్రాణా ! బ్రహ్మచర్యంబుననుండి సాధించు ఫలమును గృహస్థాశ్రమంబునంజేసి చెందెడి పుణ్యంబును, వానప్రస్థధర్మంబునం గట్టుకొనియెడి విశేషంబును, యతినిష్ఠచేతఁ బొందెడి యానందంబును నీదాస్యంబున సాధించుకొంటిని; నానావేదంబులం జదివిన యాధిక్యంబును నీ నామోచ్చారణంబునఁ గలిగించుకొంటిని; అఖిల లోకంబుల సౌఖ్యంబులు మీగుడిపంచనే దొరికించుకొంటిని; అమరత్వంబు వైష్ణవత్వంబునం గైకొంటిని; అన్ని తీర్థంబుల స్నానంబులును గంగాస్నానములో నిలిచినట్లు, మంత్రజపంబులెల్లను బ్రణవంబులోఁ జిక్కినట్లు, తపంబుల మాహాత్మ్యంబులు భక్తిచేతం దక్కినట్లు, నీ కృపవలన నాకు సంభవించెలే; శ్రీ వేంకటేశ్వరా !
కూర్మావతారా ! బ్రహ్మాండంబొకటి, బ్రహ్మలు తొమ్మండ్రు, రుద్రులు పదునొకండ్రు, దేవతలు ముప్పదిమూడుగోట్లు; ఇందఱిలో నెవ్వరిననుసరించెదము; అందఱుకును మూలకారణం బైన యాదిమూర్తివి నీవని నిన్ను నొక్కనిం గొలిచితిమి; ఇంక నిందఱును దృప్తులై మాకుఁ బ్రసన్నమయ్యెదరు; అట్లేగదా వృక్షంబునకు మొదటఁ బోసిన నీరు కొనలకెక్కి తనివిఁబొంది ఫలించు; నటువలెనే మీచేత నిర్మింపబడిన దేవతలందఱును మిమ్ముఁ జూచి మాకుఁబ్రసన్న మయ్యెదరు; బహుమార్గంబులం దగిలితేను మనస్సు చలియించును; ఏకాగ్రబుద్ధిని మిమ్ము సేవించెదము; శ్రీ వేంకటేశ్వరా !
సముద్ర సేతుబంధనా ! నీవలన నీ సంకల్ప రూపంబైన ప్రకృతియును; బ్రకృతివలన మహత్తును, మహత్తువలన నహంకారంబును, నహఁకారంబువలన మనస్సును, మనస్సువలన సకలేంద్రియంబులును, బంచతన్మాత్రలు జనించె; ఆ తన్మాత్రంబులవలన పంచమహాభూతంబులును బొడమె; కూడ నిరువదినాలుగు తత్వంబులయ్యె; ఆ యిరువది నాలుగు తత్వంబులైన జీవులలో నీవు వేంచేసియుండి ప్రకృతి భోగంబులన్నియు ననుభవింపఁ జేయుచున్నాఁడవు; నీవు ప్రాణ బంధుండవై లోకంబు లేలుచున్నాఁడవు; నిన్ను వేడుకొనియెదము; నీకుఁ బ్రియంబుఁ జెప్పెదము; గురుముఖంబునను నీ కృపవలనను స్వామి నని నిన్ను నెఱింగికొంటిమి; నీవు పెట్టినచెట్టు నీవే యీడేర్పవలయును; తరువాతి బుద్ధులు నీవే యనుగ్రహించి మమ్ముఁ గృతార్ధులం జేయవే; శ్రీ వెంకటేశ్వరా!
వాలినిగ్రహణా ! నీపై భక్తిఁ జేయునదెల్ల నన్ను నీవు రక్షింతువనియెడి స్వకార్యంబు కొఱకే; నీవు మమ్ముఁ బాయక యంతర్యామియై యుండెడిదంతయును నీవు మాకుఁజేసిన పరమోపకారంబే; నేను అస్వతంత్రుఁడ; నీవు స్వతంత్రుడవు; నే నగుణుండ. నీవు గుణాతీతుండవు; నేనశక్తుండ; నీవు సర్వశక్తిధరుండవు; నే నిన్ను ధరించుకొననోప; నీవు నన్ను ధరింపనోపుదువు; నానేరుపు నేరము లెంచంబనిలేదు; నీ కీర్తి ప్రతాపంబు లెంచుకొని నీ మహిమలు మెఱసి నన్నుఁ పోశించుట నీకుఁ బుణ్యము; ఎలుఁగుబంటికి జూలు వ్రేగనరాదు; తీగెకుఁ గాయ భారమనరాదు; కామధేనువునకుఁ గొమ్ములువేసటనరాదు; మా చిరభారంబులు నీవే వహించుకొనవే; శ్రీ వేంకటేశ్వరా !
మారీచ హరణా ! నీవు ధర్మ సంస్థాపనార్ధంబు సేయు నెపంబువలన ననంతావతారంబులై యపరాధంబులు చేసిరని దుర్జనులైన రావణాదులను సంహరించితివి; ఊరకున్న జీవుల చేతను బాపంబులు సేయింపనేల? వారిని రాక్షసులుగాఁ బుట్టింపనేల? నీవు జన్మంబు నొందనేల? మొదలనే సుజ్ఞానులం జేసిన నీకేమి వెలితియయ్యెడిని? నీవు స్వతంత్రుండవు;నీవులేక జగంబులోనఁ దృణంబు సలింపదని యండ్రు; నిన్ను మీఱిన పనులేమియున్నవి; నీవు తప్పుసేయవన తలంపున మేమొకటి యెంచుకొంటిమి; దేవ తిర్యజ్ మనుష్య స్థావరాదులకు నీయవతారంబులు సేవించి బ్రతుకుండనియెడి యుపకారంబు గాఁబోలు నియ్యది; శ్రీ వేంకటేశ్వరా !
శ్రీమన్నారాయణమూర్తీ ! శ్రీరంగంబునకుఁ బుణ్యజనుల వెంట నేఁబోయి కావేరీనదిలో స్నానంబుఁజేసి పాపంబులు విదిల్చి రంగనగరంబుఁ జేరంబోయి సప్త ప్రాకారంబులు గడచి యాపిమ్మట మీ తిరుకోవిల సొచ్చి గరుడస్తంభంబునకు సాష్టాంగనమస్కారంబుసేసి యనేక సువర్ణ నిర్మిత శోభనా లంకారంబైన తోరణంబులు దాటి పసిండి కవాటంబులకుం బన్నిద్దఱాళ్వారులకుం బ్రణమిల్లి యనంత భూషణంబైన మీ గర్భగృహద్వారమందు నిలిచి జయవిజయుల సేవించి సహస్రఫణిమాలాలంకృతంబైన భోగీంద్రుమీఁదఁ బవ్వళించియున్న నీలమేఘవర్ణంబైన నీయాకారం బారఁ జూచి నీశిరస్సున మరకత మాణిక్య పద్మరాగ వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగోన్నతంబైన కిరీటంబును గర్ణయుగ్మంబున ముత్యపుఁజౌకట్లను మకరకుండలంబుల మెఱపుకాంతులను, తిఱుమణి శ్రీచూర్ణంబులమరు నుదురును, గంధ కస్తూరి కర్పూరంబు లలందిన వక్షంబును, వైజయంతీ వనమాలికయును, జతుర్భుజంబుల రత్నఖచితంబులైన భుజకీర్తులును, హారకేయూర కంకణకటకాంగుళీయకములును బసిండిజన్నిదంబును, బంగారు కంఠహారంబును, బాదంబునఁ బసిఁడిగజ్జెలును, నవరత్నమయభూషణంబైన దక్షిణ హస్తంబును, దలక్రింద వామహస్తంబును, ఆజాను బాహుయుగళంబు మధ్యమున, నురముననున్న శ్రీ మహాలక్ష్మి పరకాంతవోలె నీ పాదంబు లొత్తుచుండఁ బదివేలకోట్ల సూర్యప్రభలు గలిగిన దివ్యమంగళ విగ్రహంబైన నీ యౌదార్యంబు నా కన్నుల కఱవు దీఱంజూఱి రోమాంకిత పులకాంకిత శరీరుండనై నీదివ్య పాదపద్మంబులు నా హృదయ కమలంబున నిలుపుకొని మ్రొక్కి కొనియాడి నీవు సకలలోకైక కర్తవని యచ్యుతేశ్వరుండవని యష్ట భుజ నారసింహుడవని యుత్పత్తిస్థితిలయంబుల కధికారివని, శంఖ చక్ర గదా ఖడ్గ ప్రముఖబాహుండవని యలమేలుమంగాపతివని నిన్నుఁగొలిచితిమి; మమ్ము గాచి రక్షింపవే; శ్రీవేంకటేశ్వరా!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ! ఆదిమధ్యాంతరహితా! అంబుజాసనాదివంద్యా ! శ్రీ యలుమేలుమంగా మనోహరా ! నీనామంబు లనంతంబులట ! నీజన్మంబులు అవాజ్ఞ్మనసగోచరంబులట ! నీగుణములెవ్వరుఁ దెలియ సమర్ధులుగారట ! నీ నాభికమలంబునం బుట్టిన బ్రహ్మ నాళంబునుంగానక శతవర్షంబులు తిరిగి నీ నామస్మరణంబున నిన్నుఁగనెనట! అయితే యింక నొకటికలదు. నీ దాసులు నిన్ను విశేషించిన విశేషము లేమని విన్నవించెదను; మాటి మాటికి నీ నామంబులు విన్నవించెదను; విని నవధరింపుము; శ్రీ పురుషోత్తమా ! శ్రీ కూర్మము, లోలార్కము, వైకుంఠము, రంగనాధము, సర్పవరము, కనకగిరి, కనకాంబరగిరి, గోవర్ధనగిరి, యంజనగిరి, హస్తగిరి, యాళ్వారులగిరి, పండరంగగిరి, గరుడగిరి, మంగళగిరి, నీలగిరి, రామగిరి, హేమగిరి, వేంకటగిరి, శ్వేతద్వీపము, హిరణ్యాద్రి, కుంతాద్రి, వృషభాద్రి, మదనాద్రి, ఘటికాచలము, శ్రీ రంగము, ప్రమోదూతము, సత్యలోకము, ఆకాశనగరము, శబరీ ప్రకాశము, ద్వీపాంతరము, పంపాతీరము, ఉత్పల్లాపదము, అగస్త్యాశ్రమము, శరణాగతము, కదళీవనము, క్షీరాబ్ధి, బదరికాశ్రమము, నారాయణాశ్రమము, నైమిశారణ్యము, వింధ్యారణ్యము, మహారణ్యము, సుబ్రహ్మణ్యము, బృందావనము, భక్తిస్థలము, కపిస్థలము, పాదస్థలము, శ్రీనివాసస్థలము, అవంతి, వజ్రము, కాళికాహృదయము, గయ, గంగాసాగరము, చక్రవర్ధనము, సాగరసంగము, చిత్రకూటము, మణికూటము, హరిక్షేత్రము, కురుక్షేత్రము, అహోబలము, శ్రీవైష్ణవము, హిమవంతము, చూర్ణ ప్రతీకము, కపిలము, హాటకము, నిఖిలసాగరము, మయూరము, శ్రీమద్ద్వారము, కురుకాయకము, భద్రనందనము, రవిమండలము, ఆదిశంఖము, పూనమంబరము, భీమశంఖము, మర్ధాచలము, వృద్ధాచలము, నాసికాత్ర్యంబకము, హరిహరేశ్వరము, అళఘరి, చెన్నకేశ్వరి, శ్వేతాద్రి, తోతాద్రి, శ్రీరామము, శ్రీరాఘవము, దివాభవము, పాతాళము, శక్తిసాగరము, అగ్నిపురము, వటారణ్యము, అనంతము, కుంభకోణము, అయోధ్య, ప్రయాగ, ద్వారకావతి, జింహిల, తామ్రపర్ణి, కంచి, సింహాచలము, మొదలైన యీ నూటయెనిమిది తిరుపతులయందవతరించితివని వింటిని, ఆ తిరుపతులఁ జూచి సేవించ సమర్ధుంఁడగాను, ఇన్ని తిరుపతుల సేవాఫలంబులు నాకు నీ సహాయమేగతి; శ్రీ వేంకటేశ్వరా !
ఉభయ విభూతినాయకా ! ఉభయ విభూతులలో నిత్యవిభూతి, మూఁడు లక్షల ముప్పదిరెండువేల ఆమడలు దాటఁగా నవ్వల అండజ బ్రహ్మాండంబు; అది దాటఁగా నవ్వల అమరావతీ పట్టణంబు; అమరావతీ పట్టణంబు దాటగా నావల సూర్య మండలంబు; సూర్యమండలంబు దాటగా నావలఁ జంద్ర మండలంబు; చంద్రమండలంబు దాటగా నావల నక్షత్రమండలంబు; నక్షత్ర మండలంబు దాటగా నావలఁ బ్రహ్మలోకంబు; బ్రహ్మలోకంబు దాటగా నావలఁ గారణ వైకుంఠంబు; కారణ వైకుంఠంబు దాటగా నావలఁ బ్రకృతి; ప్రకృతి దాటగా నావలఁ విరజానది;విరజానది దాటగా నావలఁ బరమపదంబు; పరమపదంబు దాటగా నావలఁ అష్టాక్షరి యనెడి కొలనుగలదు; ఆ కొలనిలోపలఁ కమలంబు గలదు; ఆ కమలంబులోపల నతి విస్తారమైన మంటపంబు కలదు; ఆ మంటపంబులోపల వేయి శిరస్సులు, రెండువేల జిహ్వలుగల ఆదిశేషుండు గొడుగై పానుపై యుండగా, భగవానులు పవ్వళించియుండఁగా, శ్రీ మహాభూదేవియు, శ్రీ మహాలక్ష్మియుఁ బాదంబులొత్తుచుండఁగాను, భగవానుల సన్నిధిని భాగవతులు, తిరుకొట్టారునంబియుఁ, దిరుమలనంబియుఁ, దిరుకచ్చినంబియు, మార్నూరునంబియు,ఈ అయిదుగురును మూఁడువేళలఁ బసిండి పువ్వులఁ పూజసేయంగా భగవానులేమనుచున్నారు; నా దాసులు నిర్భయులు; నాదాసులద్వయాధికారులు; నాదాసులు వేదాంతవేద్యులు; నాదాసుల నే నెఱుంగుటకాని, నన్నెఱుంగుట కూడదు; భాగవతాచారంబు పడ్డట్టాయెనా యాకాశంబు పగిలిన అదుకవచ్చును; భూమి పగిలినఁ బొదుఁగవచ్చును; సముద్రంబు పొరలినఁ గట్టవచ్చును; కాని యిటుకూడదు. భాగవతాపచారంబు దగ్ధపటలంబు అని వేదశృతులు చాటుచున్నవి; వరవరముని మంత్రంబను విత్తనంబుఁ దెచ్చి, పరమపదంబను పాదిగట్టి, చల్లఁగా నీ తిరుమంత్రంబులను పన్నీట జలకమార్చి కాలువలు దిద్ది యష్టాక్షరి యనెడి మొలక మొలిపించి సర్వవేదమంత్రంబనెడి తీగఁబాఱించిన,పరిపూర్ణ కటాక్షంబనెడి పువ్వు పూచి, కాయగాచి, పండుపండి, ఫలమంది, పంచసంస్కార పరుండగుట, నిన్ను నే గుఱుతెఱుంగుట; ’అస్మద్గురుభ్యోనమః’ అనియెడి మంత్రంబుఁ బోల మఱిదైవంబు లేదు; ఇట్లు నాకెఱింగింపవే; శ్రీ వేంకటేశ్వరా !
ఆదిమధ్యాంతరహితా ! అంబుజాసనాదివంద్యా ! వేదవేదాంతవేద్యా ! అవధారు ! దేవా! నావిన్నపమొకటికలదు; విన నవధరింపుము; అతిఘోర సంసారాంధకారం బనియెడి యడవిలోపల నా యజ్ఞాన జన్మ జీవుండనియెడి గజంబున్నది; అదియెటువలెనున్నదంటివా? ఆశామోహంబులనియెడి గజసమూహలం గూడి పంచేంద్రియ విషయభోగాదులం దగిలి కామక్రోధంబులంజిక్కి తాపత్రయంబులచే ముందు వెనుకలు గానలేక యీషణత్రయం బనియెడి ఘోరవనదుర్గ గహనంబులం దగిలి రేయంబగళ్ళు మితిలేని తిమిరంబునం జిక్కి సన్మార్గ సంచారంబు గానలేక యున్నది; అట్టి గజంబును బట్టి తెచ్చుటకు నొక్క యుపాయంబు గలదు; అది యెట్లన్నను నీయనుమతియను దివ్య పాశంబున నీ విజ్ఞానం బనియెడి వెంట యేనుఁగుతోగూడఁ బెనవేసి నీకృపాకాటాక్షంబనియెడి సూత్రంబున బంధించి అరిషడ్వర్గంబు లనియెడి యాశాపాశంబుల నూన్చి, నీపై భక్తి యనెడు కంభంబునంగట్టి నీ నామోఛ్ఛారణ రహస్యార్ధంబనియెడి మేపు మేపించి నీ తిరుమంత్రంబనియెడి జలంబుఁ బెట్టించి భవ జరారోగ హరంబైన యాచార్య తళిగె ప్రసాదంబను కవళంబు మేపి ద్వయంబనియెడి జూలు గట్టించి యష్టాక్షరంబనియెడి ఘంటలు గట్టించి రామానుజ సిద్ధాంతంబనియెడు మురజఁ గట్టించి కృష్ణరాహుత్తుండనియెడి మావటినెక్కించి భాగవతసజ్జారంబునం గట్టి యితర కింకరదోష హరంబనియెడి తులసిదండలు దిష్టిదండలుగాఁ బూన్చి యితరంబనియెడి భారి నిగళంబు విడిపించి, నీ చరమార్ధంబనియెడి యంకుశంబుఁ జేతఁబట్టి యిట్టట్టు కదలనీయక, నీ తద్దాస సంసర్గ గతులకు లీలావినోదంబుగా నెక్కుడు శత్రుక్షయమిచ్చి క్షేమంబు పాలించుకొరకునై పదునాలుగు దొంతర చెఱువులు దాటించి యావల బహుపాపహరంబైన విరజానదిలో స్నానపానాదులుసేయించి పరిశుద్ధాత్మునిఁ గాఁ జేసి శంఖచక్రపీతాంబర వన మాలికా భరతునింగాఁ జేసి యిందిరాస్తన్య పానం బనియెడి యుగ్గు వెట్టించి, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, పదవులిత్తువని సర్వ లోక జనులు కొనియాడఁగాఁ బాడఁగాఁ బేరుకొనఁగా విని నీవు అలమేలుమంగా లక్ష్మీసమేతుండవు గావున నీ కనంతంబులైన విన్నపములు చేసికొని యాడెదను;పాడెదను; శ్రీ వేంకటేశ్వరా !
అలమేలుమంగాపతీ ! అవధారు దేవా ! దేవా ! చిత్తావధారు ! నా విన్నపంబు విన నవధరింపుము. నిరాకారంబై వాయువుస్వరూపంబై యున్న జీవుని మాతృగర్భంబనియెడు నిరవుననుంచి శుక్ల పక్షంబున శుక్ల శోణితరూపంబున బదరీ ఫలప్రమాణంబునఁ జేసి, ద్వితీయ మాసంబునఁ గుక్కుటాండస్వరూపంబునఁ జేసి, తృతీయ మాసంబున మయూరాండస్వరూపంబునంజేసి చతుర్ధ మాసంబున నారికేళ ప్రమాణంబునఁ జేసి పంచమ మాసంబున శోణితాండరూపంబునఁ జేసి షాణ్మాసంబునఁ బంచతంత్రంబులతోఁ గూడిన దశవాయువుల స్వరూపంబై యున్న లింగశరీరంబున నున్న కర్మ జీవునిందెచ్చి తదీయ సూక్ష్మతనువందుఁ జొరఁదోలి, మాంస శోణితంబు లాహారంబులు సేసితివట ! సప్తమ మాసంబున జీవుని దత్వజ్ఞానవరునిఁ జేసితివట! అష్టమ మాసంబున జీవుండు గృతమిట్టి కర్మంబులం జేసితినని తన పాపంబులు గుర్తించుచు నవమాసంబున నారాయణ ధ్యాన పరుండగుచుఁ గరమల గర్ణంబులు మూసి దశమ మాసంబున ధర్ణిపై నుదయించి యజ్ఞానాంధకారంబనియెడి తిమిరంబుచేతఁ గప్పబడి, కొన్ని వర్షంబులు స్తన్యపానంబునఁ గొన్ని వర్షంబు న్లన్నప్రాశనంబున, భక్ష్యభోజ్యలేహ్య చోష్యపానీయంబులచేతఁ బరుత్రుప్తుండై యీ విధంబున ద్వాదశవర్షంబులు నజ్ఞాన కృత్యంబులఁజేయుచు శోడస వర్షంబున బంచేంద్రియంబులఁ బ్రబలుచు రాగమదమాత్సర్యంబున మత్త్గజ గమనుండగుచు జాతి వర్ణంబులు చింతింపక వర్ణాశ్రమ ధర్మంబుల వరుసలుదప్పి జీవుండు హింసాపత్రుండగుచు నేకవింశతివర్షంబుననుండి సంసారాంధకారంబునం దగిలి పుత్రేషణ దారేషుణ ధనేషణంబు లనియెడి యీషణత్రయంబునం జిక్కువడి నిన్నుఁ గానకయుండు. పంచాశద్వర్షంబున నుండి శ్లేష్మ సంకలితుండై యంధకత్వంబును బధిరత్వంబును నుదాసీనత్వంబును నుఛ్ఛిష్టత్వంబును ,గను. వాత పైత్యశ్లేష్మసంకలితంబైన ద్వంద్వరోగంబులచేత మగ్నతఁబొంది శతవర్షంబులలో హతుండై యిహలోకంబునఁ గళేబరంబు విడిచి యాతనా శరీరధారుండగుచు యమలోకంబున కేఁగి యతి ఘోర మహాఘోర బాధ లనియెడి నరక బాధలఁ గుందుచు నసిపత్రవనంబులనియెడు వమ్నభూములం గడు దుఃఖాత్ముండై తిరుగుడు వడుచుండునట. ఇవ్విధంబంతయు నే విని భయపడి, మీ యమిత కళ్యాణ గుణంబులు కొనియాడఁ దొడంగితి. నన్నుఁగృపఁజూచి రక్షింపవే శ్రీ వేంకటేశ్వరా !
దేవనారాయణా ! పరబ్రహ్మ స్వరూపా ! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా! పురాణ పురుషోత్తమా ! పుండరీక వంద్యా ! కపట నాటక సూత్రధారీ ! అగణితమహిమావతారా ! సకలకళ్యాణగుణవర్ణితా ! సకలజగదాధారా ! ఆశ్రితకల్పభుజా ! శరణాగత వజ్రపంజరా ! కారుణ్యావతారనిధీ ! భుక్తి ముక్త ఫలదాయకా ! శంఖచక్రగదా శార్జ్గాయుధధరా ! కోదండదీక్షాదిగురూ ! దశరధరాజతనయా ! కౌసల్యాగర్భ రత్నాకరసుధాకరా ! భరతాగ్రజా ! సౌమిత్రిభక్తిప్రియా ! శత్రుఘ్ననిరంతరసేవితా ! భక్తపరాధీనా ! ఇక్ష్వాకుకులతిలకా ! పక్షీంద్రవాహనా ! దేవాదిదేవా ! తాటకాప్రాణాపహరణా ! విశ్వామిత్రయజ్ఞప్రతిపాలకా ! యజ్ఞకర్తా ! యజ్ఞభోక్తా ! ’సర్వంవిష్ణుమయం జగత్’ శృతినికరప్రవేశితా ! అహల్యాశాపవిమోచనా ! పురహరకార్ముకఖండనా ! సీతావివాహా ! పరశురామ పరాక్రమ హరణా ! చిత్రకూటాచల నివాసా ! విరాధ దైత్యసంహారకా ! శరభంగదర్శనా ! దండకారణ్యనిలయా ! శూర్పణఖా నాసికాఛ్చేదనా ! ఖరదూషణత్రిశిరాది చతుర్దశ సహస్ర దానవశిరఛ్చేదనా ! మారీచ మాయామృగ వేఁటకాఱా ! యోజనబాహుఖండనా ! జటాయుముక్తిదాయకా ! శబరీప్రసన్నా ! పంచవటీతీర నివాసా ! ఆంజనేయ ప్రియాలంకారా ! మాల్యవత్ ప్రవేశా ! వాలినిగ్రహణా ! లవణాంబుధి హల్లకల్లోలా ! దక్షిణ సింధు రాజబంధనా ! విభీషణ రాజ్య స్థాపనాచార్యా ! సువేలాద్రి ప్రవేశా ! కుంభ నికుంభ మకరాక్ష ధూమ్రాక్ష విరూపాక్ష అతికాయ మహాకాయ కంపనా కంపన ప్రహస్త రక్తవర్ణాగ్నివర్ణ సర్పరోమ వృశ్చికరోమాది రాక్షస శిరఛ్చేధనా ! ఇంద్రజిత్తుతలగొండుగండా ! రావణగిరివజ్రాయుధా ! పంక్తికంఠశిరఛ్చేదనా ! కుంభకర్ణాపహారా ! ఛప్పన్నదేశ నిశ్చల పాలకా ! శ్రీ రాఘవేశ్వరా ! అవధారు ! శ్రీ వేంకటేశ్వరా !
అర్జునసఖా ! నీవు నిర్వచించిన పుణ్యంబు చేసిన దేవతలకు ఊర్ధ్వలోకంబును, పాపంబు చేసిన రాక్షసులకు అధోలోకంబును, పుణ్య పాప మిశ్రితులయిన మనుష్యులకు మర్త్య లోకంబైన భూలోకంబును, నుజ్ఞానులైనవారికిఁ బరమపదంబును గట్టడచేసి యొసంగి త్రిలోకబంధుడనై యున్నాఁడవు; ఎవ్వరికి నపకారము చేయువాఁడవు కావు. వారు వారు తమ తమ నేర్పు నేరముల మిమ్ముఁగొందఱు మెప్పించి బ్రతికెడువారును, గొందఱు మీతో విరోధించి పొలయువారును; ఇంతేకాని మీరు లోకొపకారులు; మీ ప్రభావంబు తెలియనివారు మిమ్ము దూరుదురు; ఎఱింగిన మహాత్ములు మిమ్ముఁ బొగడుదురు; పక్షాపరపక్షంబులు మీకు లేవు; ఇందులకు వేదశాస్త్రపురాణేతిహాసంబులు సాక్షులు; మీ దాసులైనవారు మీకుఁగా నేప్రమాణంబయినం జేసెదరు; పంపువెట్టుకొనుము; శ్రీ వేంకటేశ్వరా !
అనంత కళ్యాణ గుణనిధీ ! నీవు భక్త వత్సలుఁడ వనుటకు సందేహమేలా? అందులకు బ్రహ్లాదుండే సాక్షి; శరణాగత వజ్ర పంజర బిరుదుకు సందేహంబేలా ? అందుకు విభీషణుడే సాక్షి; దురితదూరుండవనుటకుఁ తర్కవాదంబులేలా? అందుకు అహల్యయే సాక్షి; నీయుదారగుణంబున కనుమానంబేల? ఇందుకుఁ పాంచాలియే సాక్షి; ఆర్తజనపరాయణుండ వగుటకు శంకయేలా? ఇందులకుఁ కరిరాజే సాక్షి; అగణితము లయిన వేదనల నవసాదింఛుటకు సత్యంబులేలా? అందుకు ధృవుండే సాక్షి; ఇవన్నియు నీమహిత ప్రభావంబగుట యెఱింగి నీ నామోఛ్చారణకే శరణు జొచ్చితిని; శ్రీ వేంకటేశ్వరా !
ఇంద్రాది వినుతా ! నీ శరణాగతి ప్రభావంబు నెఱంగునట గౌతమ మహాముని; నీ నామకీర్తన యెఱుంగునట పార్వతి; నీ జిహ్వరుచి యెఱుంగునట విదురుండు; నీ మనోభావం బెఱుంగునట శ్రీకాంతామణి; నీ మహత్త్వం బెఱుంగునట ధనుంజయుడు; నీయఖిలవిద్యా విశేషంబు నెఱుంగునట వేణునాదంబు. నీయలంకారం బెఱుంగునట కౌస్తుభ శ్రీ తులసీ వనమాలికలు; నీ జవం బెఱుంగునట వైనతేయుండు; నీ భుజబలపరాక్రమం బెఱుంగునట శార్జ్గగదా ప్రముఖ దివ్యాయుధంబులు; నీ రూప విభ్రమం బెఱుంగుదురట గోపాంగనలు; నీ భుజ విశేషంబు నెఱుంగునట వామదేవుండు; నీ భక్త వాత్సల్యంబు వైష్ణవ భాగవతోత్తము లెఱుంగుదురట; నీ శౌర్య శాంత మహిమలు వైకుంఠ సన్నిధాను లెఱుంగుదురట; పూతన హిరణ్యాక్ష రావణ కుంభకర్ణ జయ విజయాదులు నీ తేజం బెఱుంగుదురట! నిన్ను నుతియింప సహస్ర జిహ్వుండైనను నేరండట! శ్రీ వేంకటేశ్వరా !
స్వామీ ! నా రక్తమాంసంబుల కొలందియే మదంబు; మదంబుకొలందియే యింద్రియంబులు; యింద్రియంబులకొలందియే యాకారంబు; దీన ముదిమి ముంచుకొనిన నే నొరులకుఁ బ్రయోజనపడను; నాయత్నంబున కితరు లొడంబడకున్నఁ తామస భావంబులుతోచును; అంతట నా శరీరపోషణ బుద్ధియు, దేవతాభక్తియుఁ పాపరహితచింతయుఁ బుణ్య సంగ్రహమును యధాయధలగును; నా నేరము లేమని చెప్పుదును; నీవే దయతలంచిన నీడేరుదుము గాక ! శ్రీ వేంకటేశ్వరా !
స్వస్తి సమస్తలోక విస్తారా
స్వస్తి సమస్తలోకవిస్తారా! పురాణ పురుషోత్తమా! శ్రీలక్ష్మీ కళత్రా! కుంకుమాంకిత వక్షస్థల గాంభీర్యా ! సనకసనందన సనత్కుమార సనత్సుజాత నారదాది మునీంద్రవందితా ! బలి విభీషణ ప్రహ్లాద అర్జున ఆంబరీష రుక్మాంగద గజేంద్ర గుహ భృగు మృడ భరద్వాజ మార్కండేయ గౌతమ దూర్వాస వ్యాస వాల్మీకాది మునిగణ సేవితా ! శృతిప్రియ పూజితా ! బ్రహ్మాదిసురగణవందితా ! మృత్యుంజయా! త్రిమూర్త్యాత్మికా! ఇంద్రాగ్ని యమ నిఋతివరుణ వాయుకుబేర ఈశానాఖ్యాష్టదిక్పాలకేశ్వరా ! క్షీరాబ్ధిశయనా ! ఉత్సాహోజ్వలా లంకార బింబా ! సమంచిత నవరత్న ఖచిత పాంచజన్య జ్వాలాభిరామా ! మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన శ్రీరామ రామ కృష్ణ బౌద్ధ కల్క్యాద్యవతారా ! బలిబంధనా ! త్రివిక్రమమూర్తీ ! జమదగ్నిరామావతారా ! శంఖచక్రగదాశార్జ్గ శరాసననందకాయుధధరా ! కోదండపాణీ ! వేదాంతవేద్యా ! మణిమయమకుటా ! పుండరీకాక్షా ! శ్రీపుణ్యకోటివరదా ! కావేటిరంగనాధా ! శ్రీ వేంకటేశ్వరా !
హాటకగర్భజనకా ! వేదవ్యాసవాల్మీకాదిమునీశ్వరులు నిన్ను సేవించి చిక్కించుకొని మోక్షంబడుగక యేరీతినేమఱిరో? శాస్త్రంబులు చదువుటతోఁ పరబ్రహ్మంబును వెదకెడి బ్రాహ్మణోత్తములైన విద్వాంసుల వివేకంబు లెందుఁబోయెనో? బ్రహ్మాది దేవతలు నిన్ను సేవించి నీ సాయుజ్యంబు వొందరైరే ! వారి భాగ్యంబు లెందుబోయెనో? అదియట్లుండనిమ్ము; ఆది దేవుండైన నీవు ఇప్పుడందఱి హృదయంబుల నున్నావట! నిన్ను భావించి వలచి యున్నారము; శ్రీ వేంకటేశ్వరా !
కరుణావరుణాలయా ! అతిప్రజ్ఞావిలసితము, అత్యంత మనోహరము,జీవనదీప్రవాహంబు చందంబున నెడతెగక కల్పాంతంబుదాఁకఁ బాఱుచుండు, నదియు నీ లీలా విభూతిమయము నగు నీ విశ్వమును బ్రవ్యక్తంబుగా దోపించుచు జీవుల భ్రమయింపుచు నోదేవా! కర్తవైన నీవేల యవ్యక్తుండవై యంతర్యామివై యందకపొందక యడఁగి యుంటివన్నా ! అగపడినచో నార్తుల యలజడి హెచ్చగునని వెఱపా? వారికి నీవుగాక దిక్కెవ్వరు? నోటిమాట చెవి వినునంతలో నార్తుల మొఱనీవాలకింతువట; ధూర్తులకెంతకు అందరానంత దూరముననుందువట; ఆర్తతకెంతటి యోగ్యత నతికించితివి; ఇంత దయతో మమ్ముఁ గాచుచున్న నినుఁ కన్నుల కరవుదీరఁ గనుఁగొనఁ కోరుకొనుచున్నారము; ఈ మనుగడనే మాకోర్కె గడతేర్పవయ్యా; శ్రీ వేంకటేశ్వరా !
ఆదిశేషశయనా ! ఉపవాసవ్రతంబుల నిన్ను సాధించెద మంటివా యది సముద్రసేతుబంధనము; నీ వేయుపాయంబుల చేతను నసాధ్యుండవు, ఇందుకు దృష్టాంతంబుగ నీ శరణంబు జొచ్చి ప్రహ్లాద నారద శుక భీష్మ విభీషణ కరి శబరి అకౄర విదుర హనుమత్ ప్రభృతులైన భాగవతులు లోకంబులఁ ప్రఖ్యాతులైరి; ఇది మాకు దృష్టాంతంబని నిన్ను నొక్కని భజియించి నిశ్చింతంబున నుండెదము; శ్రీ వెంకటేశ్వరా !
కరుణా కటాక్షా ! నీ వుభయసేనామధ్యంబున నిరాయుధుండవై యర్జునునకు సారధ్యంబు సేయునాఁడు నీ దాసుండైన భీష్ముండు నీచేతఁజక్రంబు నెత్తించె; నీకూఁతురైన గంగాభవాని హరుని జటామకుటంబెక్కె; నీకుఁబాన్పైన శేషుండు బ్రహ్మాండంబు నెత్తి కెత్తుకొనియె; నీకు వాహనంబైన ఖగేంద్రుడు ఇంద్రాదుల నోడించి యమృతంబుఁ గొనియె; నీకుదాసుండైన ధృవుండు బ్రహ్మలోకంబు నాక్రమించె; నారదుఁడు దేవాసురులకుఁ పోరువెట్టుచున్నాఁడు; రుక్మాంగదుండు యమలోకంబుఁ బాడుసేసె; శుకుండు ముక్తిఁ జూరగొనియె; నీకు బంటైన యాంజనేయుండు అమరులకు అభేద్యమైన లంకానగరంబు దహనంబుసేసె; నీకు భక్తుండైన కుచేలుండు పిడికెఁడు అతుకులు సమర్పించి సంపదలనుభవించె; ఈరీతి నీ దాసులు నీవిచ్చిన సలిగను నీకంటెఁ బెచ్చు పెరుగుచున్నారు;నీ దాసులకిచ్చిన చనువులను, నీ సేవా ప్రభావంబులును, లోకంబునం జెల్లుబడియై చెల్లుచుండఁ జేసితివి; నీ కింకరుల చరిత్రంబులును, నీ యుదారత్వంబును వినియు నిన్నుఁ బొగడుచున్నారము; శ్రీ వేంకటేశ్వరా!
దేవా ! బ్రహ్మరుద్రాది దేవతలైన దేవతాగణంబులకు రాక్షసుల ఖండించిన హింసా కర్మంబు లంటవట; అప్సరోగణంబుల వలసి నట్లనుభవించిన వ్యభిచారంబులు లేవట; సోమపాన పురోడాశ భక్షణంబులు పుణ్యంబులయ్యెనట; ప్రసన్నులైన మీదాసులకు నేమిచేసిన దోషంబులేల కలిగెడివి; అందఱికిని నీవు గల్పించిన సాధారణ సహజ కర్మంబులివి; ఇందఱికి నీవంతర్యామివి; నీవు విరహితంబుగాఁజేసెడి కృత్యంబులెందున్నవి; పుణ్య పాపంబులు చెప్పెడి పురాణంబులు మహర్షులకు, సువ్రతంబిచ్చిన నీ కింకరులకు, దురితంబులు లేవని యప్పణ యియ్యవే; శ్రీ వేంకటేశ్వరా !
స్వామీ ! అయస్కాంతంబునకు ముఖంబు చేసి చూచిన సూదులు అతిత్వరితంబు నంటుకొనినయట్లు స్త్రీలకుఁ బురుషులకు నన్యోన్యావ్లోకంబునకు నంటుకొనం జేయుచున్నది నీ మాయ; అది యెట్టు తప్పించుకొనవచ్చును? తింత్రిణీశలాతువులు బలకు నోరూర్చినట్లు సువర్ణంబునకుఁ జిత్తంబు లాశపడం జేయుచున్నది, నీ ప్రభావంబు; ఇది యెట్లుగాదని త్రోయవచ్చు; దొంగిలించుక పోవంగాఁ దలవరులు పాశంబులఁగట్టితెచ్చి ద్రవ్యంబులు దొంగల మెడఁ గట్టి యేఁగించినట్లు చేసిన కర్మంబు లనుభవింపంజేయుచున్న నీ సామర్ధ్యంబు నేరీతిఁ దప్పించుకొనవచ్చు? ఇంక నీ జీవులకే చందంబుగా నిక్కట్లు దీరి కడతేరవచ్చు? అమృతపు కుండ నాయొద్ద నుండఁగాను నాఁకట నలయనేమిటికి? నీవునాకు గలవు; నీ పాదంబులు గొలిచి బ్రతికెదను; శ్రీ వేంకటేశ్వరా !
నాగకంకణ చాపఖండనా ! తాను దొలుజన్మంబునం జేయు కర్మంబులనుభవింపక పోరాదు; అది మాకు శక్యంబుగాదు; మేము గావించిన నేరంబులు మా మీఁద నుండఁగాను నీకు నేమని విన్నవించుకొనియెదము; నీ దాశ్యం బను వజ్ర పంజరమున్నది; నీ నామస్మరణంబు లనియెడి ఖడ్గంబులున్నవి; నీవే మాపై దయందలఁచి విచారించెదవు; శ్రీ వేంకటేశ్వరా !
అమృతమధనా ! మహర్షులు మిమ్ముఁ గోరి యతిఘోరతపంబుఁ జేతురు; పక్షులు దేహంబుల గూళ్ళువెట్టి నఖశిఖపర్యంతమును జీమలపుట్టలఁబెట్టునట; ఇటువంటి నియమంబులు చేసికొని నిన్నెట్లు ధ్యానంబుఁజేసి మెప్పించెదము; ఈ మార్గంబులు మావంటివారికి నతిదుర్లబంభులు; నీకుఁ జేతులెత్తి మ్రొక్కంగలవార మింతియగాని యింతలేసి పనులకు సమర్ధులముగాము; నిన్ను నొడంబఱచి యొక విన్నపంబుఁ జేసెదము; నిన్నుఁ దెలియక మాయకు లోనైనంతగాలంబు నీ లీలకు లోనైన వారము; తెలిసితిమేని నీ దాసులయ్యెదము; అటుగావున యీ రెండు తెఱంగుల నీవారమే; ఈ విధంబుననుండి నీవు చేసిన చేఁతలయ్యె; నన్ను నీ వెప్పుడైన రక్షింపక తప్పదు; నీకు నాకు స్వామి భృత్య న్యాయంబు తప్పదు; సిద్ధంబు; ఇట నీ నామంబును మఱవనివాఁడను; తొల్లి నీవు రామావతారంబున విశ్వామిత్ర యజ్ఞ సంరక్షణంబుఁ చేసి జనకునింటికిఁ బోవు త్రోవను నహల్యయు. దృణ గుల్మ లతాదులు నీ పాదంబులు సోకి పావనంబయ్యెనట! అవియే తపంబులఁ జేసినవి; మాకును నీ పాదంబులే గతి; శ్రీ వేంకటేశ్వరా!
మాయా శరీరధారీ ! కామాతురండైన జీవుండు నీ పాదంబుఁ దలంచెనేని యాకాంతదేహంబుకాని ప్రకాశమానంబైన నీ పాదంబు తనమనంబు లోపలికిరాదు; తాఁ దొల్లిఁ జూచిన రూపభావంబు లోపలికిఁ జూచిన విరహంబుఁ బుట్టించుఁ గాని ఫలంబులేదు; దీనికి బాహ్యంబులైన యింద్రియద్వారంబులు వెలుపలికి సాధనంబులు; తన మనస్సే తన్నుఁ లొనికిఁ ద్రిప్పు. అటుగావున నీ సాధనంబుల చేతను వెలుపల నీ మూర్తులు దర్శించి యా రూపంబులు తన మనంబున ధరించి నిన్నుఁ గనుగొనుచుండెనేని బ్రహ్మానుభవమై విలసిల్లి ఫలియించును; ఇవి రెండును నీ మహిమలే; వివేకించి నేర్చినవారికి యరచేతిలోనిది ముక్తి; శ్రీ వేంకటేశ్వరా !
రమాకళత్రా ! నీవు విరజానదీ తీరంబున వైకుంఠనగర వాసుండవై ముక్తారత్న వజ్ర వైఢూర్య గోమేధిక పుష్య రాగ మరకత మాణిక్యాద్యలంకార శోభితంబైన మేడమాడుగులయందు మాణిక్య శోభితంబైన సహస్ర ఫణంబులఁ బ్రజ్వరిల్లెడు నాదిశేషుండు నీకుఁ బానుపై శోభిల్లగా, శ్రీదేవీ భూదేవీ నీళాదేవులు నీకుఁ గైంకర్యంబులు చేయఁగా, శంఖ చక్ర గదా శార్ జ్గకోదండా ద్యాయుధంబులు రూపములు ధరియించి సేవసేయంగా, విష్వక్సేన వైనతేయాదు లుభయచామరంబులువేయగా, సనకసనందన సనత్కుమార సనత్సుజాతాది భక్తులు సేవింపంగాఁ, దుంబురు నారదాదులు నిరతముఁ బాడంగా, నప్సరసలు నృత్యములు సలుపంగాఁ, కిన్నెర గంధర్వ గీర్వాణ యక్ష పన్నగ గుహ్యకులు స్తుతులు సేయంగాఁ బరమేష్టి ఫాలలోచన పాకశాసని వైశ్వానర యమ వరుణ వాయు నిరృతి కుబేరేశానాఖ్యాష్ట దిక్పాలకులును, నవబ్రహ్మలు, నేకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, సప్తమరుత్తులు, చిత్రగుప్తులును, నవగ్రహంబులును, సప్త సాగరంబులును, సప్తనదులును, సప్తకులపర్వతంబులును, కృతయుగాదిచతుర్యుగకన్యలును, వినయ విధేయతలం గొలువంగా, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యంబులం బొందిన పుణ్య పురుషులు మీ పురంబున మెండై చెలంగుచుండ నవనిధులు, ఐరావతోచ్చైశ్శ్రవః కామధేను కల్పవృక్ష చింతామణ్యాదులచే నయిన యష్టైశ్వర్యంబులు శోభిల్లంగాఁ బేరోలగంబునఁ బెద్దకొలువై కూర్చుండి మనవి చనవులు పాలింపుచు నభయ ప్రదానంబు లిచ్చుచు మందస్మిత వదనారవిందుండవై యుండియు, సర్వజీవదయా పర్వతంబున ననంతరూపంబులు దాల్తువట! మత్స్యావతారంబున సోమకాసురు మర్ధించి వేదంబులు బ్రహ్మకు నొసంగితివట! కూర్మావతారంబున మందరగిరిమోసి నీ దాసులయిన సురలకు సకలైశ్వర్యంబులు సమకూర్చితివట! వరాహావతారుండవై హిరణ్యాక్షు మర్దించి పృధివిఁ జాపచందంబునం బఱపితివట ! నరహరిరూపంబుఁ దాల్చి హిరణ్యకశిపు మర్ధించి నీ భక్తుడైన ప్రహ్లాదుఁ గాచితివట ! వామనావతారంబున బలిని బంధించి పాతాళంబునకుఁ ద్రోచితివట ! పరశురామావతారంబునఁ గార్త్వీర్యార్జునాదిఛ్చప్పన్న దేశరాజుల మర్ధించి వారలకళేబరంబులు స్వర్గ సోపానంబులు చేసి పితృదేవతల మోక్షానకు నిలిపితివట ! రామావతారుండవై తాటకాప్రాణాపహరణంబును, విశ్వామిత్ర యజ్ఞపరిపాలనంబును, నహల్యా శాపవిమోచనంబును, శ్రీ కంఠచాపఖండనంబును, సీతా వివాహంబును, భార్గవ గర్వాపహరణంబును, యౌవరాజ్య విఘ్నంబును, గుహ సంభాషణంబును, జటావల్కల ధారణంబును, భరద్వాజ సంతోషణంబును, జిత్రకూటాద్రి నిలయంబును, భరతునకుఁ బాదుకాద్వయంబొసంగి మన్నించుటయును, విరాధ వధయును, శరభంగుం గాచుటయును, అత్రి అనసూయలచేతఁ బూజలనందుటయును, అగస్త్య సుతీష్ణ మతంగాది సకల మునివరుల యాశ్రమంబులం బ్రవేశించుటయును, మునుల కభయప్రదానంబు లొసంగుటయును, పంచవటీ తీరంబున నుండి శూర్ఫణఖా నాసికాఛ్చేదంబును, ఖరదూషణాది చతుర్దశ సహస్రదానవాపహరణంబును, మారీచమారణంబును, జటాయువుకు మోక్ష మిచ్చుటయును, కబంధ వధయును, శబరిచేఁ బూజలందుటయును, వాలిమర్దనంబును, సుగ్రీవునికిఁ గిష్కింధా పట్టణంబుఁ గట్టుటయును, దర్భశయనంబును, గంధినాధు నంపతుదికిఁ దెచ్చుటయును, సేతుబంధనంబును, సువేలాద్రినిలయంబును, రావణ కుంభకర్ణ మేఘనాధ అతికాయ మహాకాయ ధూమ్రాక్ష యూపాక్ష శోణితాక్ష మకరాక్ష ఖడ్గరోమ వృశ్చికరోమ సర్ప రోమాగ్ని వర్ణ కంపనా కంపన ప్రహస్తాది సకల రాక్షసప్రాణాపహరణంబును, విభీషణ లంకా సామ్రాజ్య పట్టాభిషేకంబును, బుష్పకారూఢులై వచ్చి యయోధ్యాధిపత్యంబున నేకాదశ సహస్ర వర్షంబులు పాలించుటయును,హలధరావతారంబున దుష్ట రాక్షస సంహరణంబును, గృష్ణావతారంబున బాలక్రీడా వినోదంబులును, గోపాలకత్వంబును, పూతనా శకటాసుర కుక్కుటాసుర ధేనుకాసుర బకాసుర వత్సాసురాది దుష్ట రాక్షస గర్వాపహరణంబును, గోవర్ధనగిరియెత్తుటయును, గోనిర్మితంబును, గోపాంగనాజారత్వంబును, కంస శిశుపాల నరకాసుర బాణాసురాది దుష్ట నిగ్రహంబును, ద్వారకా నిర్మితంబును, అర్జున సారధిత్వంబును, దుర్యోధనకులాంతకంబును, విదుర అకౄర ముచికందాది భక్తజన కటాక్ష వీక్షణంబును, గల్క్యవతారంబున దుష్టనిగ్రహంబును, శిష్టప్రతిపాలనంబును, వర్ణాశ్రమ ధర్మంబులు నిర్ణయించుటను, నిట్లు యుగయుగంబుల నవతారంబులెత్తి ధర్మంబు నిర్వహించుటయును, సర్వజీవ దయాపరత్వంబున తామ్ర శిలా మృణ్మయ దారువులందుల నుండి భక్తుల రక్షించుటయు, మఱియు గృహే గృహే తిరువారాధన రూపంబులై వెలసి భక్తులఁ గటాక్షింపుచుండుటయు,జరపుదు వనిన నీ ప్రభావంబు లేమని వర్ణింపవచ్చును? అణురేణుతృణకాష్ఠ పరిపూర్ణుండవై నిండియుండుదువట ! ఇటువంటి నీ ప్రతాపంబులు విని యిందున నొక యుపాయంబుఁ జింతించితిని; సకల జీవులయందును బరిపూర్ణుండవు గనుక నాయందు నీవుండుటంజేసి నాచేయి కృత్యా కృత్యములు నీవే చేయుటగా, నీకే ప్రీతియని నిశ్చయించి, యన్ని నేరములను నీ మీఁదనే మోపి నేను తేరకాఁడనయితిని; కర్తా భోక్తా జనార్ధన యను శృతివచనము ప్రకారమునఁజేకొని, నన్నుఁ గటాక్ష వీక్షణంబుల నీ దాసానుదాసానునిఁగా నెంచి రక్షింపుము; శ్రీ వేంకటేశ్వరా !
|
|
|
|